05 జులై, 2010

కొన్ని సరదా కబుర్లు - 1

నేను, మా రాజేష్ గాడు ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచీ రూమ్మేట్స్‌మి. మా రూం మేమున్న కాలనీలో ఒక మూలకి వుండేది. మేమందరం తినే మెస్సు సరిగ్గా అవతలి మూలకి వుండేది. మేము మెస్స్‌కి వెళ్లాలి అంటే మధ్యలో అన్ని రూములూ టచ్ చేసే ఒక సౌలభ్యం వుండేదన్నమాట. కాకపోతే అందరికీ రెండు అడ్డాలు వుండేవి. ఒకటి, మా రూముకి, మెస్సుకి మధ్యలో వుండే మా సూరీడు రూము. వాడి గురించి తెలియాలంటే ఇక్కడ చదవొచ్చు. రెండోది, బావబామ్మర్దుల రూము. (మా మిట్టి గాడు, సంతోష్ గాడూ ఇద్దరూ మైసూర్లో రూమ్మేట్సు. హైదరాబాద్ వస్తే బావబామ్మర్దులు. అందుకే ఆ రూంకి ఆ పేరు.) ఎవరి సౌకర్యం ప్రకారం వాళ్లు మెస్స్ టైముకి ఏదో ఒకచోటికి చేరేవాళ్లు. సూరీడు రూముకి చేరినవాళ్లు మెస్సుకి పోతూ పోతూ బావాబామ్మర్దుల రూములో వాళ్లని పోగేసుకుని పోగేసుకుని మెస్సుకి చేరేవాళ్లు. అలా అందరం కలిసి ఒకేసారి తినేవాళ్లం అన్నమాట.

ఒకసారి భొజనాల వేళకి నేను, మా రాజేష్ గాడు సూరీడు రూముకి చేరాం. అక్కడ అల్రెడీ మా కిరన్ గాడూ, సజోగ్ గాడు వున్నారు. సజోగ్ గాని సొంత ఊరు కేరళ. శురీడు రూముకి, మెస్సుకి మధ్య వాడి రూం వుండడం వల్ల, వానికి మా వాళ్ల లాగానే క్రికెట్ ఆడాలనే పిచ్చి వుండడం వల్ల, ఇంకా ఇతరత్రా చాలా కారణాల వల్ల వాడు మాతో ఎక్కువగా వుండేవాడు. మేము నలుగురం రూంలోపల కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నాం. బయట మిగిలినవాళ్లు కూడా ఎదో సొల్లు వేసుకుంటున్నారు. ఇంతలో మామధ్య టాపిక్ కేరళ సినిమాలవైపు వెళ్లింది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి. మా రాజెష్ గాడు, కిరన్ గాడు క్లాస్‌మేట్స్. వాళ్లకి సుబి అని ఒక కేరళ క్లాస్మేట్ వుండేవాడు. మా కెరళ సినిమాల టాపిక్‌లో రాజేష్ గానికి ఎప్పుడో ఎదో సందర్భంలో ఆ సుబి గాడు చెప్పిన మాట అన్నడు. అది - "కేరళలో కొన్ని ఏరియాల్లో షకీలా సినిమాలకి ఇంట్లో వున్న మగాళ్లందరూ కలిసి వెళతారు" అని. అంటె, తండ్రీ కొడుకులు, అన్నాతమ్ములూ అలాగంట. వాడు ఆ విషయం పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చెయ్యగానే, స్వతహాగ నాకున్న ఉత్సాహం, ఆవేశం చంపుకోలేక వున్నపళంగా సజోగ్ గాని వైపు తిరిగి "క్యారే సజోగ్, తుం ఔర్ తుమారే పాపా భి ఐసే జాతే క్యా?" అని అడిగేసా. (అంటే తెలుగులో, నువ్వు, మీ నాన్న కలిసి అలాంటి సినిమాలకు వెళతారా అని). పాపం వానికి ఎమనాలో అర్థం కాలేదు. అర నిమిషం పాటు వానికే కాదు, పక్కనున్న ఇద్దరికీ కూడా అర్థం కాలేదు, నా ప్రశ్నకి ఎలా రియాక్ట్ కావాలో. నేనేమో సీరియస్‌గా ప్రశ్నేసి వాడి ఆన్సర్ కోసం వాని వైపే చూస్తున్నా. వాడు ఒక నిమిషం తర్వాత షాక్ నుంచి తేరుకుని "పోరా, అడగడానికి ఇంకేమి దొరకలేదా... ఆకలేస్తోంది, మెస్సుకెళ్దాం పదా" అని హిందీలో చెప్పి బయటికి నడిచాడు. వాని వెనకే మేము కూడా. అప్పట్లో నేనెంత అమాయకంగా వుండెవాన్నంటే, ఆ క్వెశ్చన్‌లో ఎలాంటి మీనింగ్ వుంది అన్నది, రాత్రికి మా రాజేష్ గాడు చెప్పేవరకు అర్థం కాలేదు.

ఇది జరిగిన కొన్ని రోజులకే... పరీక్షల వేళ. ఒకరోజు డిన్నర్ తర్వాత, మర్నాడు ఎవరికి ఎగ్జాం లేకపోవడంతో అందరం కలిసి బావాబామ్మర్దుల రూములో కూర్చుని, పడుకొని, వాలిపోయి.... అలా ఎవరికి నచ్చిన పొసిషన్ ఆండ్ ఆంగిల్లో సెటిల్ అయిపోయి సొల్లేసుకుంటున్నాం. తొందరలో ఇంటికి వెళ్లాలి కాబట్టి ఎవరెవరు ఎలా వెళ్దాం అని అక్కడ డిస్కషన్ పాయింట్. మా రాజేషు గాడికి బతుకంతా బస్సు ప్రయాణాలతో గడిచిపోయింది. దాంతో వాడు ఎప్పుడు బెంగుళూర్ దాకా ట్రెయిన్‌లో వెళ్లడానికే ఇష్టపడేవాడు. ఆరోజు డిస్కషన్‌లో కూడా వాడు ట్రెయిన్‌లో పోవాలని అన్నాడూ, ఆస్ యూసువల్‌గా. కాకపోతే అందరం బయలుదేరదామనుకున్నరోజు ఒకరిద్దరికి పొద్దున ఒక పరీక్ష వున్నందువల్లనూ, వాళ్లిద్దరూ హైదరాబాద్ వాళ్లవడం వల్ల, హైదరాబాద్ వెళ్లేవాల్లందరం రెండు గంటల బస్సుకి బయలుదేరాలి అనుకున్నాం. మిగిలినవాళ్లందరూ ట్రెయిన్‌లో వెళ్లాలని ప్లన్ చేసారు. అసలు ఎలా వేళ్లినా మళ్లీ అందరం మజెస్టిక్‌లో కలుసుకోవాల్సినవాళ్లమే. ఎందుకంటే, అందరికీ అక్కడినుంచే వాళ్ల వాళ్ల వూరికి బస్సో, ట్రెయినో పట్టుకునేవారు. ఏరకంగా చూసినా, అప్పట్లో హైదరాబాదుకే ముందు బయలుదేరేవి.

ఈ ప్లాన్ అంతా ముగిసాక, యే ట్రెయినుకు వెళ్లాలి? బెంగళూరు చేరాక రాత్రి బస్సు టైము వరకు ఏమి చేయాలి అని మొదలైంది. అంతా కలిసి టిపు ఎక్స్‌ప్రెస్‌కి బయలుదేరి వెళ్లాలి అనుకున్నారు. మొదట్లో అది 11.20 కి మైసూరులో బయలుదేరి 2.40 కి బెంగళూరుకి వచ్చేది. ఈ డిస్కషన్ జరగడానికి కొన్ని రోజులముందే ఇండియన్ రైల్వేస్ వారు టైంటేబుల్ మార్చారని పేపర్లో చదివా. నాకేమో పేపర్ పట్టుకుంటే ఒక గంటపాటు దాన్నిఆసాంతం చదివే అలవాటు. మా వాళ్లకి ఇంగ్లిష్ పేపర్ ఇస్తే ఫస్ట్ పేజీ, స్పోర్ట్‌పేజీ తప్ప వేరే ఏ పేజీలకు వెళ్లే ఓపిక లేదు. సరిగ్గా అదే ఆలోచించి, మనవాళ్లకి విషయం తెలుసో లేదో అని అందరినీ ఉద్దేశిస్తూ చెప్పా - "టిపు ఎక్స్‌ప్రెస్ టైము మారిందిరా. ఇప్పుడది 11కే బయలుదేరుతుందీ" అని. అప్పటివరకూ సైలెంటుగా వున్న బక్క రవిగాడు ఒక్కసారిగా లేచి నీకిప్పుడు తెలుసా, మాకందరికీ ఎప్పుడో తెలుసు అని గట్టిగా అని నవ్వేసాడు. కానీ, నాకెందుకో అప్పటికి డౌటు వుండేది. వీళ్లకి త్యాఎలీదు అని. కానీ వాని మాటతో అందరూ ఒక్కసారిగా పెద్దపెట్టున నవ్వేసారు. నాకు కాలింది. సరెలే, పిల్లలు తర్వాత ప్రాబ్లెం ఫేస్ చెయ్యకూడదు అని చెప్తే నన్నే గేలి చేస్తారా అని అవేశంగా అడిగేద్దామని రెడీ అయ్యా. మెదడుకు ఆలోచనైతే వచ్చింది కానీ నోటికి ఆవేశం రాలేదు. ఆ క్షణానికి సైలెంటుగా కుమిలిపోయా.

ఇంకో వారం తిరిగేసరికి అందరం ఇంటికి వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది. ఎలాగూ వెళ్లేది మధ్యాహ్నం బస్సుకు కదా అని కాస్త బద్దకంగానే వున్నా. నా రూమ్మేటైన రాజేష్ గాడు మాత్రం లేచి బ్యాగ్ సర్దుకుని రెడీ అవుతున్నాడు. టైం చూస్తే ఇంక తొమ్మిది కూడా కాలేదు. అప్పట్లో మేమున్న కాలనీ నుంచి రైల్వే స్టేషన్ కి వెళ్లడానికి 20 నిమిషాలు పట్టేది. "ఎందుకురా అంత కంగారు, ఇంకా చాలాటైం వుంది కదా" అన్నా నేను వానితో. నేను రెడీ కావడం కాదురా, ఇంక మిగిలిన వాళ్లు రెడీ అయ్యారో లేదో చూడాలి. అందుకే రెడీ అయ్యి మనవాళ్ల రూములమీద పడితే అందరినీ టైముకల్లా రెడీ చేయొచ్చు అని చెప్పి భుజానికి బ్యాగ్ తగిలించుకుని బయలుదేరాడు. హ్యాప్పీ జర్నీ చెప్పి తలుపేసుకుని మళ్లీ ముసుగు తన్నేసా. పదింటప్పుడు ఎందుకో తెలివైంది. లేచి పేపర్ చదువుతూ రెడీ అవుతున్నా. రెడీ అవుతూ పేపర్ కూడా చదువుతున్నా. పదిన్నర దాటి పావుగంట అయ్యాక రాజేష్‌గాడు మళ్లీ వచ్చాడు. ఏరా అంటే "అందరూ ఇప్పుడే రెడీ అయ్యారురా. నేను జెర్కిన్ మరిచిపోయా, అది తీసుకెల్దామని వచ్చా"నన్నాడు. ఇంక స్టేషనుకెప్పుడెళ్తార్రా? అని ఆదిగితే ఇంకా అరగంట పైనే టైముంది కదరా, చేరిపోతాములే అన్నాడు. అప్పుడు నేను పేల్చా ఒక న్యూక్లియర్ బాంబ్. అంత టైమెక్కడుందిరా, ట్రెయిన్ 11కే జంపుజిలానీ కదా అని చెప్పా. పాపం, వానికి ఏం చెయ్యాలో, ఏం చెప్పాలో అర్థం కాలేదు.

వాడు షాక్‌నుంచి తేరుకోడానికి రెండు నిమిషాలు పట్టింది. ఆ తర్వాత మా ఇద్దరిమధ్యా చిన్న వాగ్యుద్దం కూడా నడిచింది. ట్రైన్ టైం మారింది అని తెలిసినప్పుడు ఎందుకు చెప్పలేదురా అని వాడు, మొన్న చెబితే తెలుసు అని చెప్పారు కదరా, మళ్లీ మళ్లీ ఎందుకు చెప్పాలిరా అని నేను. చివరికి అందరం కలిసి రెండు గంటల బస్సుకి బయలుదేరాం.

ఇప్పుడు చెప్పండి, ఇందులో నా తప్పేమైనా వుందా...? కానీ ఇప్పటికీ మా బ్యాచు వాళ్లు మాత్రం ఛాన్సు దొరికినప్పుడల్లా, ఇది గుర్తొచ్చినప్పుడల్లా ఆరోజు అందరూ నన్ను టీజ్ చేసిన దానికి ప్రతీకారంగా చివరినిమిషం వరకూ ఆగి అప్పుడు టైం టేబుల్ మారిందని చెప్పానని మళ్లీ మళ్లీ డిసైడ్ అయిపోతున్నారు. కనీసం నా వాదన వినిపించే చాన్సు కూడా ఇవ్వట్లేదు :'(