28 జూన్, 2010

మరో ఆక్సిడెంట్....!!!

అనగా అనగా 2008వ సంవత్సరం జూలై మాసంలో, మా ఆఫీసులో బ్యూటీ కాంటెస్ట్ గెలిచిన తెలుగమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్టు కల కంటూ నిద్రపోతున్న ఒకానొక ఉదయం నాన్న ఫోను చేసి నిద్ర లేపి "ఈ వేకెండ్లో ఇంటికి వచ్చి అఘోరించ"మని ఆర్డర్ పాస్ చేసాడు. సరే అని చెప్పి మళ్లీ ముసుగుతన్నా. నిద్ర లేచేసరికి అఫీసుకు టైమవుతోందనే ధ్యాసే తప్ప నాన్న ఫోన్ చేసిన విషయం అసలు గుర్తే లేదు. షరామామూలుగా ఆఫీసు టైముకి ఒక గంటలేటుగా చేరుకున్నా. పార్కింగ్ దగ్గర నాలాంటి బద్దక బ్రహ్మచారులు చాలామంది ఎదురయ్యారు. అందరం కలిసి లిఫ్ట్‌లో వుండగా ఒకడు అడిగాడు, ఈ వీకెండ్‌లో సినిమాకెళదామా అని . అప్పుడు గుర్తొచ్చింది పొద్దున ఫోనొచ్చిన విషయం. లేదురా, ఇంటికెళ్తున్నా అని చెప్పా. ఆఫీసుకెళ్లిన కాసేపటికే వాడు పింగ్ చేసి మన కంపనీలో కొత్తగా చేరిన పట్నం పోరడు గూడా ఇంటికొస్తుండంటా... ఇద్దరు కలిసి పొండ్రా అని చెప్పాడు. ఆ పట్నం పోరడు నా కోసం వెళ్లేప్పుడు గరీబ్ రథ్ కి తత్కాల్ టికెట్టు తీసాడు. తిరుగు ప్రయాణానికి మాత్రం ట్రెయిన్ టికెట్టు దొరకలేదు. నేను చాలా సార్లు వచ్చా, ధనుంజయ ట్రావెల్సు వాడి సర్వీసు బాగుంటుంది అంటూ అందులో టికెట్టు బుక్ చేసాడు. ఏసిలో చల్లగా పడుకొని క్షేమంగా ఇంటికి చేరాం.

తిరుగు ప్రయాణానికి బస్ టైముకి ఒక పావుగంట ముందు లక్డీకాపూల్ కి చేరుకున్నా. అప్పటికే నా కొలీగు నాకోసం వెయిటింగు. ఏంటి అంటే ధనుంజయ వాడి బస్సు పాడయిందని వేరే బస్సులో టికెట్టిచ్చాడు. వాడే టికెట్టిస్తూ ఆ ట్రావెల్సు ఆఫీసుకి దారి చెప్పాడు. అక్కడికి వెళ్లే సరికి బస్సు రెడీగా వుంది. దాహం వేస్తుంటే వెళ్లి వాటర్ బాటిలు కొందామనుకున్నా. కానీ ఎందుకో ఆ టైములో నా మట్టి బుర్ర పాదరసంలా పనిచేసింది. బస్సెక్కాక వాడు ఎలాగూ ఒకటిస్తాడు కదా అని ఆగిపొయ్యా. బస్సు బయలుదేరగానే బాటిలెప్పుడిస్తాడా అని ఎదురు చూస్తూ కూర్చున్నా. బస్సులో ఆస్తి పంపకాలు చేస్తున్నంత జాగ్రత్తగా సప్లై చేసుకుంటూ వస్తూంటే నా ప్రాణం లేచొచ్చినట్టయ్యింది. ఎలాగైతేనేం, నీళ్లు తాగేసా. ఇంతలో మళ్లీ ఆస్తి పంపకాలు మొదలయ్యాయి. చుస్తే వాడు చేతిలో ఒక కుర్కురే పాకెట్టు, ఒక గుడ్‌డే బిస్కెట్ పాకెట్టు పెట్టి వెళ్లిపోయాడు. అంతే, మనసులో "ధబ్"మని ఒక సౌండ్ వినిపించింది. యెస్... నేను వాడి సర్వీసుకి పడిపొయ్యా.

బస్సు దిగుతూనే బస్సు మీద పేరు చూసా. HKB టూర్స్ అని వుంది. మైండ్‌లో సెట్ అయిపోయింది. ఇక మొదలు... గత రెండు సంవత్సరాలుగా వాడిచ్చే చిప్స్ ప్యాకెట్టు, బిస్కెట్ ప్యాకెట్టులకు కక్కుర్తి పడి ఇంటికి వెళ్లిన ప్రతీసారీ అదే బస్సుకి రావడం మొదలుపెట్టా. ఎంతలా అంటే రిటర్న్ టికెట్ బుక్ చేయమని మా తమ్మునికి చెప్పిన ప్రతీసారీ వాడు దైరెక్టుగా ఆ ట్రావెల్సుకి పోయి బుక్ చేస్తాడు.

పోయిన వీకెండ్‌లో ఇంటికి వెళ్లేపుడు మా తమ్మునికి టికెట్ బుక్ చేయమని చెప్పినప్పుడు ఎందుకో ఎదో తేడా కొడుతున్నట్టనిపించింది. ఎప్పుడూ లేనిది, బస్సులో చిట్టచివరి సీటు దొరికింది. ఏవో కొన్ని అపశకునాల మధ్య బస్సెక్కా. తొమ్మిదింటి బస్సు తొమ్మిదిన్నర కి బయలుదేరింది. ఎప్పుడూ లేనిది ఇలా లేట్‌గా స్టార్ట్ అయినప్పుడు ఇంకేదో తేడా అనిపించింది. కానీ వాడు వేసిన రంగ్‌దే బసంతి సినిమా ఆ ఆలోచనలని దగ్గరికి రానివ్వలేదు. సినిమా అయిపోయాక కిటికీలోంచి పక్కకి చూస్తే, బస్సు జడ్చర్ల దాటింది. రోడ్డు సూపర్‌గా వుంది. బస్సు మూడంకెల స్పీడుతో పరుగెడుతోంది. ఆహా!!! చిన్న కుదుపు కూడా లేకుండా ప్రయాణం సుఖంగా వుంది. సింబాలిగ్గా "గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, ఫుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే" అంటూ పాట వినిపిస్తోంటే నిద్రలోకి వెళ్లిపోయా. లేని అలవాటు.... మధ్యలో తెలివైంది. టైము చూద్దామనిఫోను తీస్తే స్విచ్చాఫ్ అయ్యింది. సరె అనుకొని మల్లి అలా నిద్రలోకి జారుకుంటున్నా. అంతలోనే పెద్ద కుదుపు... ఏమిజరిగిందో తెలిసేలోపల ఒక నాలుగైదు సార్లు ఎగిరి పైన లగ్గేజ్ షీల్డ్‌కి తగిలి కింద పడ్డా. సడ్డెన్‌గా బస్సు ఆగిపోయింది. రెండు నిమిషాలు సైలెంటుగా వున్నా. తల పైన అన్ని సార్లు తగలడంతో మైండ్ బ్లాకై, రెడ్డై, పింకై, బ్లూ అయి, మల్లీ నార్మల్‌కి వచ్చేసరికి రెండు నిమిషాలు పట్టింది మరి. ఆ రెండు నిమిషాలు గడిచాక విషయం అర్థం అయ్యింది.

వెంటనే నాలో ఆవేశం ఉప్పొంగింది... " దీంతల్లి... దేత్తడి పోచమ్మ గుడి... ఎవడ్రా ఆ డ్రైవర్‌గాడరోయ్...!!!" అంటూ అవేశంగా లేచా. లేచిన మరుక్షణం నా ఆవేశం చల్లారిపోయింది. ఎందుకంటే, మూడూ సీట్ల ముందు నిలుచున్నవాడు మసకగా కనిపించాడు... ఇంక డ్రైవర్ గాడేమి కనిపిస్తాడు నా బొంద. కానీ, అప్పటికే నాలో నిద్రపోతున్న మేధావి చటుక్కున లేచేసాడు. అతడు సినిమాలో ప్రకష్ రాజ్ లాగా ఇన్వెస్టిగేట్ చెయ్యడం మొదలుపెట్టాడు. అప్పుడు తెలిసింది... ఒకటి, నా కళ్లద్దాలు మిస్సింగ్. రెండు, నా ముందున్న సీట్లన్నీ నాకంటే ఒకమెట్టు కింద వుండాలి. కానీ అందరూ మూడూ సీట్ల ముందున్న వాడు మూడు మెట్ళ కిందున్నాట్టు కనిపించాడు... అంటే, బస్సు రోడ్డు మీడ లేదు. ( నా బొంద, బస్సు రోడ్డు మీద వుంటే, ఇన్ని కష్టాలు ఎందుకు??) మూడూ, రోడ్డు మీద పోతున్న వెహికిల్స్ అన్నీ మా కంటే ఎత్తులో వున్నాయి... అంటే, రోడ్డు పక్కన గుంతలో వున్నా. ఎవరికి వారు అద్దాలు పగలగొట్టాలని చూస్తున్నారు. కొందరు ఇంకా షాక్ నుంచి తేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కుదుపులకి సీట్లల్లోంచి ఎగిరి కింద పడ్డవారు ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయో చూసుకుంటున్నారు. అసలెక్కడున్నామా అని చుట్టూ చూసా. కొంత దూరంలో రైలు వెళుతూ కనిపింది... అంటే పెనుగొండ దగ్గర్లో వున్నా అని అర్థం అయ్యింది. అంతసేపు, కిటికీలోంచి బయటకు పైకి చూసిన నేను ఒక్కసారిగా కిందకి చూసి షాక్ అయ్యా. పక్కనే పెద్ద కుంట. ఏ కొంచం తేడా జరిగినా బస్సు ఆ కుంట లో పడి మునిగేది. అంటే, బస్సులోంచి చూసినప్పుడు నాకు కుంట గురించి పెద్దగా తెలీలేదు... కాని పోలిసులొచ్చి బస్సు దించాక వాళ్లు ఎలా జరిగిందో ఇన్వెస్టిగేట్ చేసేప్పుడూ పక్క కుంట చూపించి చెప్పారు... అందులో పదుంటే బస్సు మునిగేది, ఎవరూ బతికేవారు కాదూ అని.

బెంగుళూరుకొచ్చాక అక్సిడెంటు గురించి మొత్తం మా రాజేష్ గాడికి చెప్పా. ఎలా జరిగింది, చుట్టు పక్కల పరిస్థితి.. అంతా చెప్పాక వాడన్నాడు, అంత మందిలో ఎవడో ఒక్కడు మంచి అదృష్టవంతుడు రా.. ఆ అదృష్టమే మిమ్మల్నందరినీ కాపాడిందీ అని. నాకు కూడా నిజమే అనిపించింది... ఆ అదృష్టవంతుడెవరో నాకు తెలీదు, కానీ ఆ బస్సే ఎక్కినందుకు, తెలిస్తే వెళ్లి ఒక పెద్ద థాంక్స్ చెప్పి ఫుల్ బాటిల్ మందు, అంచుకోడానికి తందూరి, డిన్నర్ కి బిర్యాని స్పాన్సర్ చేసేవాన్ని. కావాలంటే బెన్సన్ & హెడ్జెస్ సిగరెట్లు కూడా. ఆ అదృష్టవంతుడెవరో తెలిస్తే కాస్త చెప్పండీ ప్లీజ్.

04 జూన్, 2010

ఇల్లు కట్టనక్కర్లేదు... కష్టాలు తెలియడానికి!!!

ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారంట పెద్దలు... వాళ్లెవరో నాకు తెలీదు. తెలిసుంటే, వాళ్లని నా తమ్మునికి అప్పజెప్పేవాన్ని. ఎందుకంటారా...

ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం చాలా కష్టంతో కూడుకున్న పనులని పెద్దోళ్లు చెప్పిన సామెత అర్థం. కాని, కష్టం రుచి చూడడానికి ఇల్లు కట్టనక్కరలేదని, కట్టిన ఇల్లు కొన్నా చాలని ఈ నెల రోజుల జీవితం కొత్త పాఠం నేర్పింది. పొద్దున్నే కొత్త ఇంటిదగ్గరికి వెళ్లి పని ఎలా నడుస్తుందో చూడటం, పని వాళ్లకు ఏమేమి కావాలో అవన్నీ ఇప్పించటం, దగ్గరుండి చేయించటం, ఆఫీసుకి వెళ్లిరావటం, మళ్లీ రాత్రికి ఇంట్లో పని వాళ్లతో పని చేయించడం... గత నెలరోజులుగ ఇదే పని. అందుకే అన్నాను... ఇల్లు కట్టక్కర్లేదు... కొంటే చాలు. ఇంటీరియర్సు చేయించడానికే ఇంత కష్టమయితే, ఇంక ప్లాటు కొని, ఇల్లు కట్టించాలంటే... అమ్మో, మా తమ్ముడు నన్ను చంపేసేవాడు. ఎందుకంటే, పైన చెప్పిన పనులన్నీ నేను చూసా. వాడు చేసాడు, చేయించాడు. మనకున్న బద్దకానికి, సోమరితనానికి (ఈ రెండింటిలో ఎదో తేడా వున్నట్టు!!!) వాడు నెలలో చేయించినపని నేను చేయించాలంటే కనీసం ఒక త్రైమాసికం పట్టేది. సరె, పడితే పట్టింది కానీ, పనిలో క్వాలిటీ మాత్రం వాడిపనిలా వుండేదికాదు. చాలా తక్కువగా వుండేది.

ఎదైతేనేం, మొత్తానికి గృహప్రవేశం జరిగిపోయింది. దీనివల్ల నేను నేర్చుకున్న ఇంకొక పాఠం ఏమిటంటే, గృహప్రవేశం అనుకున్నంత వీజీ కాదు. అయినా, గృహప్రవేశాలకి తెల్లవారుఝాము ముహూర్తాలే ఎందుకు వస్తాయో... :'(