09 January, 2012

నా మొట్టమొదటి వం(పెం)ట

అనగా అనగా, అంటే కొన్ని సంవత్సరాల క్రితం మాట అన్నమాట. మేము ఫ్రెండ్స్ అందరం ఉద్యోగప్రయత్నాల్లోంచి బ్రహ్మిగా రూపాంతరం చెందిన కొన్ని రోజులకి, అందరం కలిసి ఈ సింగిల్ రూముల్లో బతుకు వెళ్లదీయడం దేనికిలే అని ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకుని అక్కడికి మారాం.

మామూలుగానే స్వతహాగా అన్ని బ్యాచిలర్ బ్యాచులకి వుండే అత్యుత్సాహం కొద్దీ కొత్త ఫ్లాట్‌లోకి అడుగుపెట్టే ఒకటి రెండు రోజులముందు అనుకున్నాం. కొత్త ఫ్లాట్‌లో అయినా ఈ మెస్సు ఫుడ్డు మానేసి రోజూ రాత్రి వంట వండుకుందాం. వీలయితే మధ్యాహ్నం బాక్సులు తీసుకెళ్దాం. ఓపిక వుంటే పొద్దున టిఫిన్ చేసుకుందాం. ఇక నుంచి బయట ఫుడ్డు కోసం పైసా కూడా ఖర్చుపెట్టకూడదు అని సవాలక్ష ప్లాన్లు వేసాం. మామూలుగా అయితే ఇది ఎక్కువ కాలం జరగాల్సిన ప్రక్రియ కాదుగానీ, మావాల్ల ఉత్సాహ ప్రదర్షన మూలంగా కొంచం, బయటి ఫుడ్డుమీద ఇంట్రెస్టు పోవడం మూలంగా కొంచెం ఆ అలవాటు అలా సా...గి పోయింది, కొన్ని సంవత్సరాలపాటు.

ఇక అసలు విషయానికొస్తే, మేము ఆ ఫ్లాట్‌లోకి మారిన కొన్నిరోజులకి వినాయకచవితి పండగొచ్చింది. మామూలుగా ప్రతీ చిన్నదానికి ఇంటికి పరిగెత్తే మేము అదేంటోగానీ, ఆ పండక్కి మాత్రం అందరం బెంగుళూరులోనే వున్నాం. అప్పటికే కొన్ని రోజులు రూమ్మేట్సు వండింది తిని బాగా కాకపోయిన, కొద్దిగా బలిసిందేమో, పొద్దున లేవంగానే నాకో వింత ఆలోచన పుట్టింది. రోజు అందరూ కలిసి విడివిడిగా, కలివిడిగా తలా ఒక చెయ్యి వేస్తూ వంట చేస్తే నేను మాత్రం వంట చేసేప్పుడు వాళ్లనీ, తినేప్పుడు టివి ని చూడటం తప్ప వేరే ఏమి చెయ్యట్లేదని బాధేసింది. అలాగే వుంటే ఆ బాధతో డిప్రెషన్‌లోకి పోతానేమో అని భయమేసింది. ఆ తర్వాత ఇంత చెత్తగా ఆలోచిస్తున్నందుకు నామీద నాకే అసహ్యమేసింది (నాక్కూడా అని నాగార్జున లాగా మీరు అనుకోకండే). ఏదో ఒకటి చేసి నేను సైతం అనిపించేద్దామని డిసైడ్ అయ్యా.

డిసైడ్ చేసుడే ఆలస్యం, తెగ ఆలోచించీ చించీ... ప్రసాదం కింద పాయసం చేసి వినాయకుడికి నైవేద్యం పెడదామనే ఆలోచన నా మిత్రగణం ముందుంచా. ఒక్కడు కూడా కనీస స్థాయిలో ప్రోత్సాహం ఇవ్వకపోగా నీకెందుకురా ఈ దూల అని రకరకాలుగా పరిహసించి, నాలో ఆగ్రహ జ్వాలలు రేగేలా నన్ను వుసిగొల్పారు. వీళ్లకి ఎలాగైనా బుద్ది చెప్పాలి, పాకశాస్త్రంలో నేను ఎంతటి ప్రావీణ్యం సంపదించగలనో నిరూపించాలి ఈ మందబుద్దులు గ్రహించేలా చెయ్యాలని కంకణం కట్టుకున్నా. (ఆరోజు చూసిన వినాయక మహత్యం సినెమా డైలాగులు ఇప్పుడు నా మైండ్లో తిరుగుతున్నాట్టున్నాయి. అందుకే, భాష పట్టు తప్పుతోంది). అనుకున్నదే తడవుగా రోడ్డెక్కేసా, పాయసానికి కావాల్సిన వస్తువులు తేవడానికి. అప్పటికే నాకు తెలిసిన పాకశాస్త్రం పుస్తకానికి ఒకసారి దుమ్ము దులిపితే తెలిసింది, పాలు, చక్కెర, సేమియా వుంటే పాయసం చెయ్యొచ్చని.

షాపుకెళ్లాను గానీ, ఏది ఎంత వెయ్యాలో తెలీదు. అర లీటరు పాలు, ఒక సేమియా పాకెట్టు తీసుకున్నా. చక్కెరెంత పడుతుందో తెలీదు. కనుక్కుందామని ఇంటికి ఫోన్ చేసా. నాన్న ఫోన్ తీసాడు. నన్ను అసలు విషయంలోకి దిగనివ్వకుండా స్నానం చేసావా లేదా, గుడికెళ్లావా లేదా అని సిబిఐ రేంజిలో అడిగేసాడు (నేనంటే ఎంత నమ్మకమో, నేనలాంటి పనులు ఎన్ని సార్లు చెప్పినా మర్చిపోతానని). ఈ ప్రశ్నావళిని మధ్యలో తుంచేసి అమ్మకి ఫోనివ్వమన్నా. అమ్మ బిజీగా వుంది, విషయం ఏంటో చెప్పమన్నాడు. పాయసం అయిడియా చెప్పి, చక్కెర ఎంత కావాలి అని అడిగా. ఒక పావుకిలో తీస్కుని ఇంటికి వెళ్లు, అమ్మ ఫ్రీ అయ్యాక ఫోన్ చేయిస్తా అప్పుడు ఎంత అంటే అంత వెయ్యొచ్చు అని నాన్న సలహా ఇచ్చాడు. ఇదేదో బాగుందే అని అలాగే చేసా.

ఇంటికెళ్లి పాలు కాచాను కానీ అమ్మ నుంచి ఫోన్ రాలేదు. ఎలాగూ వెయ్యాల్సిందే కదా అని సేమియా కూడా వెసేసా... అది కూడా ఓ మోస్తరు ఉడికింది(??). ఇంకా అమ్మ నుంచి ఫోన్ లేదు. నాలో ఓపిక లాస్ట్ ఇయర్ సెన్సెక్స్ పడ్డట్టు పడిపోయింది. మళ్లీ ఇంటికి ఫోన్ చేసా. అమ్మ ఇంకా బిజీ అన్నాడు నాన్న. ఇక లాభం లేదని, ఎదురు చూస్తే కిచెన్ లో నిలబడి కాల్ల నొప్పూ తప్ప ఇంకేమి మిగిలేలా లేదని ఆలొచించి తెచ్చిన చక్కెర మొత్తం పాలల్లో వేసేసా. అదేంటో, వేసిన 30 సెకన్లకి అమ్మ ఫోన్ చేసింది. ఎంట్రా అంటే, ఏం లేదు పనైపోయింది అని చెప్పి పెట్టెసా. గిన్నె మీద మూత పెట్టి మొబైల్ లో ఒక గేం ఆడుకున్నా. ఒక రెండు నిమిషాలాగి, గేము అయ్యాక మూత తీసి చూస్తే, సేమియా బ్రహ్మాండంగా వుంది. అవును, సేమియా మాత్రమే వుంది, చుక్క పాలు కూడా లేవు. సర్లే, అందరికీ, గిన్నెలో పోసిచ్చెబదులు, చెంచాతో డైరెక్టు చేతిలో వెయ్యొచ్చు కదా అనుకుని, దేవునికి నైవేద్యం కూడా చూపించేసా.

తర్వాత రుచి చూద్దును కడా, అది పాయసంలా కాక హల్వా లాగ తయారైంది. దాని విషయం తెలిసిన నా రూమ్మేట్సు కనీసం దాన్ని ప్రసాదం కింద కన్సిడర్ చేసి రుచి చూడమన్నా కుడా కుదరదని తేల్చేసారు. తప్పనిసరి పరిస్థితుల్లో అలా నా మొదటి వంట పెంటలోకి చేరింది. అదేంటో, ఇది జరిగి ఇన్నేళ్లయినా కుడా, ఇప్పటికీ మావాళ్లు నేను కిచెన్‌లోకి వెళ్తున్నానంటే జడుసుకుంటారు. సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే, నాకు పెళ్లయ్యాక మావాళ్లు ఈ అనుభవాన్ని కొద్దిగా మసాలా దట్టించి నా భర్యకు చెప్పారు. ఇప్పుడు నేను వంట నేర్చుకుంటా అని చెప్పినా, నా భార్య నన్ను వంటింట్లోకి రానివ్వట్లేదు. వా :-(

27 June, 2011

కత్తిలాంటి సినిమా 180 (ఇది తల తినేసే కత్తి)

విధి విచిత్రమైనది, బలి బాధాకరమైనది. బలవ్వాలని విధి గీత గీస్తే మేకని ఏ మేకల దేవుడూ కాపాడలేడన్నది క(ఖ)ర్మ సిద్దాంతం. ఇది మనుషులకి కూడా వర్తిస్తుందని అదేదో పురాణంలో వుందని ఆయనెవరో భక్తి ఛానెల్లో పోయిన అమావాస్య రోజు అర్ధరాత్రి ప్రోగ్రాంలో చెప్పగా విన్నట్టు ఈరోజు మధ్యాహ్నం కునుకు తీసినప్పుడు కల వచ్చింది. "యెవడ్రా వీడు అర్థం పర్థం లేకుండా వేదాంతం వాగుతున్నాడు...???" అని తిట్టుకున్నా సరే, ప్రస్తుతానికి ఇలా పిచ్చి వాగుడు వాగడం తప్ప నాలుగు మంచి మాటలు రాయడానికి కళ్లుగానీ, వేళ్లుగానీ సహకరించట్లేదు.

అదేదో సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం చెప్పినట్టు "కాలం గాలమేస్తే సముద్రంలో ఫిష్షు స్టార్ హోటల్లో డిష్షు అయ్యిందట". మొన్న శనివారం కాలం గాలమేసింది. పొద్దున 11 దాకా సముద్రంలో ఫిష్షులాగా దర్జాగా బతికిన నేను మధ్యాహ్నానికి నక్షత్రాల హొటలో, రోడ్డు పక్కన కబాబ్ సెంటరో తెలీలేదు కానీ, ఏదో ఒక చోట డిష్షు మాత్రం అయిపోయా. ఇంతటి విపత్కర పరిస్థితిలోకి నేను నెట్టబడటానికి కారణం మా యావిడ. తను సిద్దార్థ ఫాన్ కాకపోయినా, నేను నిత్య మీనన్ కి కానీ, ప్రియా ఆనంద్ కి కానీ కనీసం ఎయిర్ కూలర్ కూడా కాకపోయినా, శనివారం పొద్దున ఇంటిపక్కనున్న మల్టిప్లెక్సులో 180 సినిమా చూసి తీరాసిందేనని శుక్రవారం పొద్దున నన్ను ఉపవాసం వుంచి మరీ తీర్మానించేసింది. ఎంతైనా కొత్తగా పెళ్లైంది కదా, కొత్త పెళ్లాన్ని నిరుత్సాహ పరచడం ఎందుకని అత్యుత్సాహం వల్లనో, శనివారం కూడా నాతో ఉపవాసం చేయిస్తే ఆదివారం ఎక్కడ ఆస్పత్రిపాలు కావాల్సి వస్తుందో అన్న భయం వల్లనో, నిత్య మీనన్ ని చూసి తరిద్దామనే ఆశ వల్లనో తెలీదు కానీ, అన్నా హజారే ముందు కాంగ్రేసు వాళ్లలాగా డబుల్‌గేములాడకుండా బుద్దిగా తన డిమాండ్లకి వొప్పుకుని తల వంచి మానిటర్‌లోకి చూసి టికెట్లు బుక్ చేసా. శనివారం ఉదయం 11 గంటల ఆటకి నా మెదడు బ్లాంకైపోవాలని అలా డెసిషన్ తీసుకోబడింది.

ఇక సినిమాలోకొద్దాం... టైటిల్సు పడుతూంటే హీరో డల్‌గా కాశీలో బోటుయాత్ర చేస్తాడు. గంగలో మునిగి తేలాక వొడ్డుకున్న సాధువు నూరేళ్లూ బతకమని దీవిస్తే ఓ పిచ్చి చూపు చూస్తాడు. రెండు నిమిషాలయ్యాక ఓ చిన్నపిల్లాడిగురించి నోటి మాటకి, ముఖ కవళికలకి సంబంధం లేకుండా ఒక ముసలాయన చెప్పిన మాటలతో టైటిల్సు ముగుస్తాయి. ఇదంతా కథకి ముందుమాట లాంటిదన్నమాట. కాశీలో కలిసిన బుడ్డోడు ఒక్క క్షణంలో మన హీరో ఆలోచనా విధానాన్నే మార్చేస్తాడు. ఆ కొత్త థాట్ ప్రాసెస్‌ని వంటబట్టుచ్చుకున్నా హీరోగారు, బుడ్డోడి పేరు పెట్టుకుని రాజధానికి చేరుకుని 20 సందులు, 40 గొందులు తిరిగేసి ఒక పేపర్ బాయ్ సహాయంతో ఒక ఇల్లు అద్దెకు తీస్కొని ఆరు నెలలపాటు ముందే రెంటు ఇచ్చేసి దిగిపోతాడు. కనిపించిన ప్రతీవాళ్లకూ సాయం చేసేస్తూ వుంటాడు. అలా సాయం చేస్తూ నిత్య మీనన్‌తో దోస్తీ చేస్తాడు. తర్వాత ఇంటి ఓనర్‌కి కూడా సాయం చేస్తాడు. ఫైనల్‌గా నిత్య హెల్పుతో పేపర్ బాయ్‌లందరికీ చదువుకునే ఏర్పాటు చేస్తాడు. ఇదే టైములో నిత్య మేడంగారు హీరోకి ప్రొపోజ్ చేస్తే ఏమీ చెప్పకుండా ఊరొదిలి వెళ్లిపోదామని డిసైడ్ అయ్యి వెళ్లి బస్ ఎక్కితే, దాన్ని ఫాల్లో చేస్తూ అక్సిడెంట్ చేస్కొని నడ్డి విరగ్గొట్టుకుని హాస్పిటల్ బెడ్డెక్కుతుంది. తనని అమెరికా తీసుకెళ్లి ఒకప్పుడు హీరో డాక్టర్‌గా పని చేసిన హాస్పిటల్‌లో ఆపరేషన్ చేయించి బతికించడం మూలకథ.

దీనికున్న ఒకే ఫ్లాష్‌బ్యాక్ ని ముక్కలు ముక్కలు చేసి తీన్‌మార్ తరహాలో చూపించాడు. అందులో సిద్ధార్థకి ప్రియా ఆనంద్‌తో లవ్వు, మ్యారేజీ, శోభనం అన్నీ అయ్యాక, మనోడికి ప్రేమాభిషేకంలో అక్కినేనికి వున్నట్టు మందులేని క్యాన్సర్ వుందని తేలడం, మనోడి ముందు నీగ్రో వేషంలో చావు కనబడటం, చస్తున్నానని పెళ్లాన్ని భయపెట్టడం, కంగారులో ఆ పిల్ల ఏమన్నా దానికి పెడర్థాలు అర్థం చేసుకుని సతాయించడం, ఇత్యాది కొన్ని సీన్ల తర్వాత పెళ్లానికి చచ్చాననే బిల్డప్ ఇచ్చి వచ్చి కాశీలో మునగటం.... ఇదీ కథ. సినిమా మొత్తమ్మీద ఆకట్టుకున్నది ఫొటొగ్రఫీ. చాలా బాగుంది. ప్రథమార్థం పర్లేదనిపించినా ద్వితీయార్ధం మాత్రం టార్చర్ చూపించాడు. ఎంతసేపూ ఏడుపులూ పెడబొబ్బలూ. కొంత సేపైతే హీరో మరీ ఆడవాళ్లలాగా (స్త్రీ లోకం క్షమించాలి) నస పెట్టినట్టు అనిపిస్తుంది. దీనికి తోడు సెకండ్ హాఫ్ అంతా ఒక ఆరడుగుల నీగ్రోని యమదూత లాగా చూపడం, వాడు కనపడినప్పుడళ్లా హీరో చస్తానని భయపడటం. సినిమాలో కామెడీ అనేది ఎక్కడా లేదు. అక్కడక్కడా మెయిన్ కారెక్టర్లు వెసిన ఒకటి రెందు చిన్నా చితకా జోకులు తప్ప మంచిగా నవ్వుకునే మ్యాటర్ ఒక్కటి కూడా లేదు. ఇక సంగీతం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సినిమా చూసేప్పుడు ఒకే ఒక్క పాట బాగుందనిపించింది. కానీ అది ఏ పాటో కూడా నాకు గుర్తులేదు. మిగిలిన పాటలు అసలు ఎందుకొచ్చాయో అర్థం కాదు. రెండు పాటల్లో అసలు లిరిక్ అర్థమై చావలేదు. పాపం, సంగీత దర్శకుడు సినిమా హిట్ అవ్వడం కోసం న్యూమరాలజీని నమ్మినట్టున్నాడు. శరత్ అన్న తన పేరుని అష్ఠ వంకర్లు తిప్పి Sssherrath అని వేసుకున్నాడు. అది చూడగానే మన శరత్ 'కాలమ్' శరతన్నయ్య ఎలా ఫీలవుతాడో అనిపించింది.

దీనికి కొసమెరుపేంటంటే, అదే రోజు సాయంత్రం మా GD గాడు ఒక సంక్షిప్త సందేశం పంపాడు - "Don't dare to watch 180" అని. "Watched" అని నేను పంపిన రిప్లై కి సమాధానంగా "నా ప్రగాఢ సంతాపం" అని సమాధానమిచ్చాడు.

02 May, 2011

భాగ్యనగరం బాగుపడనుందా...?

మొన్న శనివారం నాడు చెమటోడ్చి కష్టపడి కంపనీని పైకి తీసుకొద్దామనే దురాలోచనతో ఆఫీసుకొచ్చా. యథాలాపంగా పని మొదలుపెట్టి, మధ్యలో మన తెలుగు మీడియా కడప ఎన్నికల మీద ఎలా కోడై కూస్తోందో చూద్దామని రెండు మూడు సైట్లు ఓపెన్ చేస్తే ఒక కత్తిలాంటి వార్త కనబడింది. మజ్లిస్ చిన్న వారసుడు అక్బరుద్దీన్ మీద దాడి. ఒక్కసారి మనసంతా సంతోషంతో ఉప్పొంగింది.

మామూలుగా మన మీడియాకు చాలా విషయాలు కనపడవు. కానీ, ఏదో ఒకటి అయినప్పుడు మాత్రం మొత్తం విషయం బయటికి లాగేస్తారు. ఈ వార్త చూడగానే నాకు గుర్తొచ్చిన మొదటి మనిషి కృష్ణ యాదవ్. ఈ పేరు చాలా మందికి గుర్తుండకపోవచ్చు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసిన మొదటి నాలుగేల్లు మంత్రిగా చేసిన భగ్యనగరపు నాయకుడు. మంత్రిగా చేసినా కూడా సందు గొందుల్లో వుండే సొంతిల్లు వదిలి అధికార నివాసంలోకి రాకపోతే అందరూ అది తనకు తన నియోజకవర్గం మీద, ఆ ఏరియాతో వున్న అనుబంధం వల్ల అని అనుకున్నారు. అలా అనుకునేలా చేసింది కూడా మీడియానే. స్టాంప్ పేపర్ల కుంభకోణంలో దొర గారిని అరెస్టు చేసిన తర్వాత అయ్యవారి చరిత్ర తోడిన మీడియా తేల్చిందేమిటంటే, అన్నగారు ఆ ఇల్లు వదలంది తన రౌడీ రాజ్యాన్నీ సజీవంగా నిలుపుకునేందుకు, అంతర్గత వ్యవహారాలు నెరిపేందుకు అని. మొన్నటికి మొన్న ప్రపంచ స్థాయి కంపనీని నడుపుతున్నాడని రామలింగరాజుని ఆకాశానికెత్తిన మీడియా, సత్యం కుంభకోణం బయటపడ్డ వారంలోపు రాజుగారు జీవితకాలంలో చేసిన ప్రతీ చిన్న తప్పునూ వెలికితీసి ఎండగట్టింది.

పాతబస్తీలో జరిగే చాలా విషయాలు బయటికి పొక్కవని నా ప్రగాఢ నమ్మకం. అందుకు ముఖ్య కారణం అక్కడ బలంగా వున్న మజ్లిస్. పార్టీ పేరు చెప్పి, పార్టీ పెద్దల పేర్లు చెప్పి అక్కడ ఎన్ని సెటిల్‌మెంట్లు జరిగాయో, జరుగుతున్నాయో బయటికి పొక్కదు. పైగా వారికి మన సూడో సెక్యులర్ పాలకుల అండ వుండనే వుంది. నిజం చెప్పాలంటే, రెండెళ్ల కింద జరిగిన ఎన్నికల వరకూ నాకు ఒక అభిప్రాయం వుండేది. అక్బర్ యెదవ కానీ, అసద్ మంచోడేమో అని. ఎంతైనా ఫారెన్‌లో చదువుకొచ్చాడు కదా, చదువు మధ్యలో వదిలేసి చిల్లరగా తిరిగిన తింగరోనికంటే మర్యాదగా వుంటాడు అని అనుకునేవాన్ని. కానీ, మొన్న ఎన్నికలవేళ అసద్ చేసిన వీరంగం చూసి రోత పుట్టింది. చదువుకున్నవాడే అలా చేస్తే ఇంక రాజకీయాలు ఎటు పోతున్నాయ్ అని ఆవేదన కలిగింది. వీడే ఇలా వుంటే, చదువు మధ్యలో మానేసిన అక్బర్ ఎలా వుండాలి...? గూండాగిరి, రాజకీయం, సెటిల్‌మెంట్లు అంటూ నేర ప్రపంచంలో ఎంత లోతువరకు దిగి వుంటే పబ్లిగ్గా చంపే ప్రయత్నం చేయాలి...?

నాకేమో ఈపాటికే అక్బర్ చచ్చుంటాడని అనుమానం. వెంటనే చంపేస్తే పాతబస్తీలో శాంతిభద్రతల సమస్య వస్తుందేమో అన్న అనుమానంతో సర్కారు వెంటిలేటర్లమీద బతికిస్తోందని అనిపిస్తోంది. ఏతా వాతా, ఇప్పుడు వీడు చస్తే, దర్యాప్తు ముసుగులో పోలీసులు నిజాలు చెప్పడానికి ప్రభుత్వం వొప్పుకోకున్నా, ఈ కుటుంబం పాతబస్తీలో ఎలాంటి సంస్కృతిని పెంచి పోషించిదనే విషయాన్ని మీడియా అయినా బయటికి తెస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నా. భాగ్యనగరం బాగుపడాలంటే, పాతబస్తీలో మతం చాటున కొంతమంది నరనరాల్లో పాతుకుపోయిన విష సంస్కృతి పోవాలంటే, ఈ కుటుంబం అక్కడ రాజకీయంగా తుడిచిపెట్టుకుపోవాలని నా విశ్వాసం.

అందుకే ఆలోచిస్తున్నా... అక్బర్ పోతాడా...? మీడియా అతని చరిత్రనూ, అన్న, తండ్రుల చరిత్రనూ తవ్వుతుందా...? భాగ్యనగరం బాగుపడబోతోందా....???

15 October, 2010

మీటింగ్‌లో నిద్రపోతే....?

పోయిన వారం నాకు ఆఫీసులో ఒక మీటింగ్ జరిగింది. అది కూడా లంచ్ అవ్వగానే పెట్టారు. మా టీం అంతా కలిసి లంచ్ చేసాం. ముందురోజు డిన్నర్ సరిగా చెయ్యకపోవడం వల్లనో, లేకపోతే ఆరోజు పొద్దున బ్రేక్‌ఫాస్ట్ చెయ్యకపోవడం వల్లనో, కాదంటే లంచ్ రుచిగా వుండడం వల్లనో తెలీదు కానీ భీభత్సంగా కుమ్మేసా. ఇంకేముంది, నిద్ర తన్నుకురావడం మొదలైంది. డెస్కు దగ్గరికెళ్లి కాసేపు నిద్ర పోదామని ఆలోచిస్తూ మెల్లగా కేఫిటేరియాలోంచి బయటకు వస్తూంటే మా లీడ్ పద్మజ గారు గుర్తు చేసారు "పెద్ద తలకాయల"తో మీటింగ్ వుంది కదా ఇప్పుడు అని. అందరం కలిసి మీటింగ్ వున్న ఆడిటోరియంలోకి వెళ్లాం. అప్పటికే మీటింగ్ స్టార్ట్ అయిపోయింది. హాల్లో ఒక 100 వరకు కుర్చీలు వేసారు. చివర్లో అన్నీ నిండుగా వున్నాయి. కూర్చోడానికి ఎక్కడా ప్లేసులేదని కుర్చీల వెనకాల స్నాక్సు కోసం వేసిన టేబుల్స్ మీద కూర్చున్నాం అందరం. ఒక రెండు నిమిషాలు ప్రశంతంగా కూర్చుని ఇలా సెటిల్ అయ్యానో లేదో ముందు నుంచి నా పాలిటి లేడీ విలన్ లేచి మట్లాడుతున్న జెంటిల్‌మాన్ దగ్గర మైకు లాక్కుని "వెనక టేబుల్సు దగ్గర సెటిల్ అయిన వాళ్లందరూ ముందుకు వస్తె అక్కడ కుర్చీలు ఖాళీగా వున్నాయి రండి" అని ఆహ్వానించింది. మనకి బాడ్ టైం స్టార్ట్ అయ్యింది.

అప్పుడు కదిలి చూస్తే మనకంటే లేటుగా మీటింగుకి చాలామందే వచ్చారు.అందరం కలిసి ముందుకు వెళ్లాం. అందరం ఒక వరుసలో కూర్చున్నాం. గోడ వైపు మా లీడు, పక్కన మా టీమువాళ్లు, చివర్లో... దారికి దగ్గరగా నేను. తీరా చూస్తే నేను కూర్చుంది రెండో వరుసలో. మొదటి వరుస నా ఖర్మ కాలి ఖాళీగా వుంది. అంతా బాగానే వుంది కానీ మా ప్రవీణ్‌గాడు కనపడట్లేదేంటి చెప్మా అని వెనక్కి చూసా. నా వెనక వరుసలో రెండు కుర్చీల అవతల ప్రవీణు, వాని వెనకాల నా మేనేజరూ కూర్చున్నారు. అప్పుడే నాకు కుడి కన్ను అదిరింది, అంటే సిక్స్త్ సెన్స్ పనిచేసింది. కానీ దాన్ని పట్టించుకునే మూడ్‌లో ఆ క్షణంలో నేను లేను.

ఒక అయిదు నిమిషాలయ్యింది. అప్పటిదాక మట్లాదుతున్న పెద్దాయన స్పీచుకూడా అయ్యింది. మమ్మలని ముందుకు పిలిచిన నా లేడీ విలన్ లేచి ఏదో గేం అంటూ నేను రెండో తరగతిలో వుండగా ఒక ఈమెయిల్‌లో వచ్చిన ఫొటో చూపింది. చాలా కాఫీ గింజల మధ్య ఒక మనిషి ఫేసు వుండే ఫొటో అది. ఆ ఫొటో చూపగానే ఆమెకో ఫోన్ వచ్చింది. మమ్మల్నందరినీ లైన్‌లో వుండమని చెప్పి ఆమె మాత్రం మాట్లడ్డానికి బయటికెళ్లింది. ఒక అయిదు నిమిషాల తర్వాత వచ్చి కొన్ని క్వెశ్చన్స్ వేసింది. అదేంటో, నాకు తప్ప అక్కడ ఎవ్వరికీ ఆన్సర్స్ తెలీవనుకుంటా. నేను తప్ప ఎవ్వరూ జవాబు చెప్పలేదు. నాకూ, నా విలన్ కు మధ్య డిస్కషన్ ఇలా జరిగింది.

విలన్: ఈ ఫొటోలో వున్నదేంటి...?
నేను: కాఫీ గింజలు.
విలన్: గుడ్. నువ్వు లేచి నిలబడు.
నేను: (లేచి నిలబడ్డా)
విలన్: దీనితో ఏం చెయ్యొచ్చు...?
నేను: ఫొటోనయితే సిస్టంలో వాల్‌పేపర్ గా పెట్టుకోవచ్చు. గింజలతో అయితే కాఫీపొడి చేసి దానితో కాఫీ చేసుకుని తాగొచ్చు. ఒక అయిదు నిమిషాలు టైమిస్తే ఇంకేమైనా చెయ్యొచ్చేమో గూగుల్ చేసి చెప్తా.
విలన్: బ్రహ్మాండం. అసలు నీలాంటి వానికోసమే నేను ఎదురుచూస్తున్నా. నీ అంత ఇంటెల్లిజెంట్ లేక ఇన్ని రోజులు మా మీటింగ్స్ అన్ని తెగ బోరు కొడుతున్నాయి. ఇంకొక్క ప్రశ్న వుంది, దానికి కరెక్ట్ అన్సర్ చెప్తే నీకొక సర్‌ప్రైజ్ గిఫ్ట్.
నేను: డౌటొద్దు. గిఫ్ట్ నాదే. నువ్వడుక్కో.
విలన్: కాఫీ స్పెల్లింగ్ ఏంటి...?
నేను: కే ఏ యూ పీ హెచ్ వై

అంతే, గిఫ్టు నాదైపోయింది. ఆడిటోరియం అంతా చప్పట్లతో దద్దరిల్లింది. ఆ చప్పట్లమోత నా చెవుల్లో గింగిరాలు తిరుగుతూంటే తల విదిలించా. చూస్తే నేను కూర్చొనే వున్నా. విలన్ ముందు కనపడలేదు. కానీ చప్పట్లు మోగుతున్నాయి. వెనక్కి తిరిగి చూస్తే విలన్ వేరేవాళ్లకి గిఫ్ట్ ఇస్తోంది. మనం రికగ్నైజ్ చెయ్యక కానీ, తర్వాత మా ప్రవీణ్ కి కూడా ఒక గిఫ్టొచ్చింది. అది నాకు మీటింగయ్యాక తెలిసొచ్చింది. పాపం, వానికి గిఫ్టొచ్చినప్పుడు నేను చప్పట్లు కొట్టలేదని ముందు ఫీలయ్యాడు కానీ తరువాత అర్థం చేసుకున్నాడు.

మళ్లీ స్పీచులు మొదలయ్యాయి. ఇంక నన్నడక్కండి. ఎంత మంది వచ్చారో, ఎంత సేపు దంచారో, గంటన్నర ఎలా గడిచిందో నాకైతే తెలీదు. మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు వెనక్కి తిరిగి చూస్తే మా ప్రవీణుడు వెటకారంగా ఒక స్మైల్ పడేసాడు. (అంటే నేను నిద్ర పోతున్నానన్న విషయం వాడు పట్టేసాడు) నేను అలా వెనక్కి తిరిగిన ప్రతీసారీ నన్ను ఎవరో తట్టినట్టనిపించే చూసాను. అది వేరే విషయం. రెండోసారి చూసినప్పుడు అనిపించింది... నా పక్కన కూర్చున్న వినోద్ నన్ను తడుతున్నాడు అని. ఎందుకైనా మంచిది కంఫర్మ్ చేసుకుందామని అడిగా "నీకు కాలేజీ రోజుల్లో నిద్రపోతున్న వాళ్లని లేపే అలవాటు బాగా వుండేదా...?" అని. 'యెప్పీ' అని స్టైల్‌గా చెప్పాడు.

అలా అలా మీటింగ్ అంతా అయిపోయి బయటికొచ్చాక తెలిసింది ఏమీ అంటే, చివర్లో మాట్లాడిన మాస్టారు అందరికంటే పెద్దతలకాయంట. జోకులు కూడా బాగా పేల్చాడంట. నన్ను ఆఅహించిన నిద్రాదేవత విశ్వరూపాన్ని కూడా చూసాడంట. మా ప్రవీణడు చెప్పాడు... "ఆ పెద్దతలకాయ ప్రతీ జోకుకి జోకుకి మధ్యలో నీవైపు కంఫ్యూజింగ్‌గా చూసాడు. అందరి నవ్వులకి నువ్వు తల విదిల్చి నవ్వుతుంటే అది వేసిన జోకుకి నవ్వావో, వేయబొతున్న జోకుని ఎక్స్‌పెక్ట్ చేసి నవ్వావో అర్థం కాక.. పాపం" అని.

అసలు పోస్ట్ లంచ్‌లో ఇలాంటి మీటింగ్స్ పెట్టేదే సుఖంగా నిద్ర పోవటానికి నా ఫీలింగ్. అలాగే ఈరోజు కూడా ఒక మీటింగ్ పెట్టారు, తెల్లవారుఝామున ఎనిమిదిన్నరకి. దానికితోడు మాటీమువాళ్లందరికీ ఈ మొదటిబెంచీలో కూర్చునే అలవాటు ఏంటో అర్థం కాదు. వెనక కొన్ని సీట్లు ఖాళీగా వున్నాకూడా వెళ్లి మళ్లీ రెండో వరసలో కూర్చున్నారు. అందులో మొదటి స్లైడ్‌లోనే దయచేసి గురకపెట్టొద్దు అని చెప్పారు. అంటే సైలెంటుగా నిద్ర పోవచ్చనే కదా. మరేంటి, ఆ స్లైడ్ చుస్తూనే మా టీమువాళ్లంతా నవ్వుతూ నావైపు చూసారు....?

12 October, 2010

తొక్కలో జీవితం... ఇంతేనా... ఇంకేం లేదా....?

ఇండియాలో వున్నప్పుడు లైఫ్ చాలా బాగుండేది. వీక్ డే లో అయితే తెల్లవారుఝామున (నా ఫ్రెండ్సు అది తెల్లవారుఝాము కాదు, పొద్దున అంటారు. మీరు నమ్మొద్దు) లేచి తయారయ్యి ఆఫీసుకి వెళ్లి లంచవర్లో ఏ చెత్తో తినేసి, సాయంత్రం ఇంకేదో గడ్డి తినేసి రాత్రి వరకు చెమటోడ్చి(?) పని చేసి మధ్యలో బ్లాగులు చదువుతూ, అప్పుడప్పుడు కామెంట్లు పెడుతూ, ఓపిక వుందని అనిపించినప్పుడు పోస్టులు వేస్తూ టైంపాస్ చేసేవాన్ని. ఇక వీకెండైతే పండగే. మరీ తెల్లవారుఝామున లేవాల్సిన పని లేదు కాబట్టి కాస్త పొద్దెక్కాక లేచేవాన్ని (దీన్ని నా ఫ్రెండ్సు మధ్యాహ్నం అంటారు. ఆస్ యుజువల్ గా మీరు నమ్మినట్టు నటించండి, కానీ నమ్మొద్దు). ఫ్రైడే నైటు పార్టీ, శనివారం రాత్రి గాలి తిరుగుడు, ఆదివారం రాత్రి సినిమా.... ఇలా సరదాగా సాగిపోయేది. ఒకరోజు మామూలుగా ఆఫీసుకి వెళ్లి బ్లాగులు చదువుతుంటే మధ్యలో ఒక ఫ్రెండు పింగ్ చేసాడు. మాటల మధ్యలో "విధి చాలా బలీయమైనది. అది మనం కోరుకున్నదానికి సరిగ్గా అప్పోసిట్ గా చేస్తుంది" అని అన్నాడు. వాడు ఏ క్షణాన అన్నాడో గాని, అన్నాక రెండు రోజులకి నా మేనేజర్ పిలిచి నువ్వు ఫారిన్ వెళ్ళాలి, అన్ని రెడీ చేసుకో అని చెప్పాడు.

ఫారిన్‌లో ఎలా వుంటుందో ఆల్రెడీ ఆన్సైటుకెళ్లొచ్చిన వాళ్ల దగ్గర చాలా విన్నాను కాబట్టి, దానికి తగ్గట్టుగానే చాలా ప్లాన్స్ కూడా వేసుకున్నా... ఇక్కడికొచ్చాక జిమ్ముకెళ్లి పొట్ట తగ్గించాలి, వీలైతే 8 ప్యాక్, లేదంటే 6 ప్యాక్ అయినా పెంచేసి, మల్లి బెంగళుర్ లో ఆఫీసుకెళ్లే రోజు కి మొత్తం అవుట్ లుక్ ని మార్చేసి, అమ్మాయిలందరికీ షాక్ ఇచ్చి... అబ్బో... చాలా చాలా వూహించేసుకున్నా. కానీ, విధి చాలా బలీయమైనది. నా బద్దకం అంతకంటే బలమైనదన్న విషయం నాకు ఇక్కడికొచ్చాక అర్థం అయ్యింది. నేను ఇక్కడుండేది మూడు నెల్లు. అందులో నెలన్నర నాకు జిం ఎక్కడుందో కనుక్కోవడానికే పట్టింది. ఇంక అందులో కార్డ్ తీసుకోవాల్సిన ప్రాసెస్ తెలుసుకోవడానికి ఇంకో 2 వీక్స్. మిగిలింది ఒక్క నెల. ఈ ఒక్క నెలలో మనం జిం లో చేరి సాధించగలిగేది ఏం లేదని నాకు నేను అనుకుని జిం గురించి ఆలోచించడం మానేసి, తిరిగి, చూసి, చుట్టెయ్యాల్సిన ప్లేసుల గురించి రీసెర్చ్ చెయ్యడం మొదలెట్టా.

ఇప్పుడు చూస్తే ఒకరోజు లావు పెరిగాననిపిస్తుంది. ఒకరోజు బరువు తగ్గాననిపిస్తుంది. మొన్న వెయిట్ చూసుకుంటే 4 కిలోలు తగ్గానని చెప్పింది. నిన్న పాంట్ వేసుకుంటే ఇదివరకట్లో బాగుందనిపించింది ఇప్పుడు టైటయినట్టు అనిపించింది. ఇంత కంఫ్యూజన్ ఏంటో అర్థం కావట్లేదు. ఇంటికెళ్లాక బంధు మిత్ర సకుటుంబ సపరివారమంతా ఏమంటారో చూస్తే అప్పుడు కానీ అర్థం అయ్యేలా లేదు అసలు నా పరిస్థితి ఏంటో.

సరే, ఇక విషయానికి వస్తే, ఫారిన్ లో లైఫ్ అంటే ఏంటో అనుకుంటాం కానీ, బొత్తిగా నిస్సారమైన బతుకులాగుంది. వీక్‌డే లో బతుకు అంతా పొద్దున లేచి సద్ది సర్దుకుని స్నానం చేసి ఆఫీసుకెళ్లడం, పని చేస్తూ చేస్తూ మధ్యలో ఆ సద్ది లాగించేసి మళ్లీ పని చేసీ చేసీ ఇంటికి రావడం, ఇంత వండుకుతిని మళ్లీ పొద్దున్నే లేచి ఆఫీసుకెళ్లాలి అని తిట్టుకుంటూ నిద్ర పోవడం. అంటే వీకెండులో జీవితం ఏదో నక్క తోక తొక్కిందా అంటే అదీ లేదు. ఏదైన ప్లేసు చూడటానికి పోతే అక్కడ తిందామంటే పిజ్జాలు బర్గర్లు తప్ప ఇంకేమీ దొరకదు. వాటికి వీళ్ల పేర్లు కూడా వింతగా పెడతారు. మావాడు ఒకడు వచ్చిన కొత్తలో పెప్పరోనీ అంటే పెప్పర్ ఆండ్ ఆనియన్ మిక్ష్చర్ అనుకున్నాట్ట. రెండు మూడు సార్లు తిన్నాక ఎవడో చెప్పాడంటా అది బీఫ్ అని. దెబ్బకి వాడు బయటికి వెళ్తే మాంసం తీసుకోవడం మానేసాడు. ఎక్కడికెళ్లినా మీట్ లేకుండా మీదగ్గర ఏముంది అని అడగటం మొదలెట్టాడు.

బెంగళుర్‌లో వున్నప్పుడు ప్రతీ ఆదివారం రాత్రి పక్కనే వున్న తిరుమల థియేటర్ కి వెళ్లేవాన్ని. అక్కడ ఏ సినిమా ఆడితే అది చూసి వచ్చేవాళ్లం. ఇక్కడ ఒక సినిమ చూడాలంటే ఎక్కడికో వెళ్లాలి. అది కూడా ఎదన్నా రెండు మూడు షోలుంటే నచ్చిన టైములో వెళ్లే ఆప్షన్ లేకుండా రోజుకు ఒక్క షో వేసి మూసేస్తున్నారు(తెలుగు అయితే). థియేటర్‌లో స్క్రీను, సౌండ్ ఎఫెక్ట్సు మాత్రం మన తిరుమల లోనే చాలా బెటర్. అసలిదంతా ఎందుకొచ్చిందంటే, నిన్న బెంగళూర్‌లో వున్న ఒక ఫ్రెండుతో మాట్లాడుతూంటే అడిగాడు... ఇక్కడికీ, అక్కడికీ లైఫ్‌లో వున్న తేడా ఏంటి అని. ఆక్సిడెంటల్‌గా నా నోట్లోంచి ఒక అద్భుతమైన పోలిక వచ్చింది. అది అందరికీ చెబుదామని మొదలెట్టా.

ఇండియాలో ఇది బాలేదు, అది బాలేదు అది తిట్టుకుంటూ, ఫ్రీడం లేదని బాధ పడుతూనే మనకు నచ్చినట్టుగా వుంటాం. ఇక్కడైతే ఇన్‌ఫ్రాస్ట్రక్చరూ, ఫెసిలిటీసు అన్నీ బాగున్నాయని మెచ్చుకుంటూ, ఫ్రీడం వుందని చంకలు గుద్దుకుంటూ ఎవడో రాసిన రూలు బుక్సుని ఫాలో అవుతూ బతికేస్తున్నాం.

ఇక్కడ ఇంకో విషయమేమిటంటే ఇక్కడ మనకు నచ్చిన కొన్ని విషయాలు ఇక్కడివాళ్లకు నచ్చకపోవడం. టొరొంటోలో అండర్‌గ్రౌండ్ ట్రాన్సిట్ వుంది. మొదటిసారి చూసినప్పుడు అది నాకు చాలా బాగా అనిపించింది. ఎంత బాగా చేసారో కదా అని పక్కవానితో అన్నా కూడా. రెండు వారాల్లో ఇక్కడ మేయర్ ఎలక్షన్స్ వున్నాయి. ఆ ఎలక్షన్స్ గురించి పేపర్లల్లో వచ్చే ఆర్టికల్సు, ఇక్కడివాల్లతో డిస్కషన్సూ అన్నీ కలిపితే నాకు అర్థం అయ్యిందేమిటంటే మనం మన సిస్టం మీద ఎలా అసంతృప్తితో వున్నామో అలాగే వీళ్లు కూడా వీళ్ల సిస్టం మీద అసంతృప్తితో వున్నారు. సబ్‌వే సిస్టం లో వీళ్లకు లోపాలు కనిపిస్తున్నాయి. వాటిని క్లియర్ చేసేవానికి వోటేస్తారంట. ఈరోజు మధ్యాహ్నం ఒక ఫ్రెండ్ అడిగాడు... ఇక్కడికొచ్చిన రెండు నెలల్లో ఏమేమి తెలుసుకున్నావురా అని... నేను తెలుసుకున్నది మాత్రం ఒక్కటే. అది - పక్కింటి పుల్లకూరకి రుచెక్కువ. మనకి వీళ్లది నచ్చింది, వీళ్లకి ఇంకేవరిదో నచ్చింది, వాళ్లకి ఇంకొకరిది.