24 మార్చి, 2010

హాస్టల్‌లో అర్ధరాత్రి

మా ఇంజినీరింగ్ కాలేజీకి హాస్టల్ వుండేది కాదు. ఫస్ట్ ఇయర్‌లో మేము ప్రైవేట్ హాస్టల్‌లో వుండేవాళ్ళం. మా కాలేజీ దగ్గరవున్న లేఅవుట్‌లో అలాంటివి చాలా వున్నాకూడా, మా బ్యాచ్ మొత్తం రెండు హాస్టల్లల్లోనే వుండేది. ఒకటి(నేనున్నది) ప్యూర్లీ అబ్బాయిల హాస్టల్ అయితే ఇంకొకటి అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరికీ (ఒకటే బిల్డింగ్ కాదులెండి. అబ్బాయిలకి రెండు బిల్డింగులు, అమ్మాయిలకు ఒకటి విండేవి). బిల్దింగులు అంటే ఇళ్లని అద్దెకి తీసుకుని వాటిలో హాస్టళ్లు పెట్టేసారు. టాక్స్ కట్టాల్సిన అవసరం లేని బ్రహ్మాండమైన బిజినెస్ అది. ఈ హాస్టళ్లల్లో రాత్రుల్లు మేము చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. మా హాస్టల్ ఊరికి చివరగా, ఎక్కడో విసిరేసినట్టుగా వుండడం మాకు కొంతవరకు కలిసివచ్చింది.

మా హాస్టళ్లో మొత్తంగా ఒక 30 మంది పైనే వుండేవాల్లం. ఒక 20 మందిమి మెయిన్‌రోడ్ నుంచి ఒక 100 మీటర్ల దూరంలో వుండే బిల్డింగ్‌లో వుండేవాల్లం. మిగిలినవాల్లంతా మెయిన్‌రోడ్‌ని ఆనుకుని వున్న బిల్డింగ్‌లో వుండేవాల్లు. ఒక ఏడాది పాటు ఆ హస్టల్లో మేము చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. అప్పట్లో మైసూర్లో పోలీసుల గస్తీ ఎక్కువగా వుండేది. లోకల్ క్లాస్‌మేట్స్ అయితే మాటలతోనే భయపెట్టేవాల్లు - రాత్రి తొమ్మిది తర్వాత రోడ్డు మీద తిరగొద్దు, గరుడ(హైదరాబాద్ లో రక్షక్ లాగ) వాల్లు చూస్తే ఏమీ అడగరు, తీసుకెళ్లి ఠాణాలో కూర్చోబెట్టి పొద్దున పంపిస్తారు అని చెప్పేవాళ్లు. మనం చెప్పిన మాటలు వినే బాపతు కాదు అని అప్పట్లో వాల్లకి తెలీదు పాపం.

మైసూరులో అప్పట్లో రాత్రిపూట గస్తీకి గుర్రాల మీద తిరిగేవారు. ఓసారి అలా పోలీసోల్లు రాత్రి ఒంటిగంటప్పుడు రోడ్ మీద గస్తీ తిరుగుతున్నప్పుడు, అప్పుడప్పుడే ఈల వెయ్యడం నేర్చుకుంటున్న మా రఘుగాడు గట్టిగా ఈల వేసాడు. వానికి రాక రాక గట్టి సౌండ్ రావడం, అర్ధరాత్రి కావడం కలిసొచ్చి ఆ ఈల చాలా దూరం పాకింది. చూస్తున్నంతలో రోడ్ మీద పోతున్న గుర్రాలు మా హాస్టళ్‌వైపుకు తిరిగడం కూడా వెంటనే జరిగిపోయింది. మాకైతే భయం అంటే ఎలా వుంటుందో తెలిసింది. ఏం జరుగుతుందో తెలిసేలోపలే బెటాలియన్ మొత్తం మా బిల్డింగ్ ముందుకొచ్చింది. అప్పుడు మొదలైంది మాకు సినిమా. ఒక ఆరగంట సేపు మేమెవరమో, ఎక్కడినుంచి వచ్చామో మొత్తం ఎంక్వైరీ చేసి అనవసరంగా ఈల వేసినందుకు ఒక క్లాస్ పీకి వెళ్లారు.

గండం గడిచిందని సంతోషపడి ఒకరోజు సైలెంట్‌గా వున్నాం. రెండోరోజు రాత్రి నిద్రపట్టక రెండు గంటలప్పుడు గేటు ముందర టెప్ క్యాచులతో గల్లి క్రికెట్ ఆదుతున్నాం. దానికోసం గేటు దగ్గర ఒక పెద్ద లైటు కూడా పెట్టాం. ఆ లైటు చూసి రోడ్‌మీద వెలుథున్న ఒక ఎన్‌ఫీల్డు బండి లోపలికి తిరిగింది. సీదా వచ్చి మా ముందు బండి ఆపాడు. చూస్తే ఒక పోలీసాయన ఫుల్లుగా మందేసి ఇంటికి పోతున్నవాడు లైటు చూసి మా దగ్గరికి వచ్చాడు. వచ్చినోడు చూసి వెళ్లకుండా నిలబడి తాగింది దిగేదాకా మాకో క్లాసు తీసుకుని పొయ్యాడు. ఆ క్లాసు మధ్యలో బెదిరింపులు కూడా. మళ్లీ ఇలా అర్ధరాత్రి ఆటలాడుతూ కనిపిస్తే అరెస్టు చేసి లోపలేస్తానని వార్నింగు.

ఇలాంటివి చాలా జరిగిన తర్వాత, రాత్రి ఎలా అయినా తిరగడానికి మాకు ధైర్యం వచ్చింది. అలాగే మేము ఎంత తిరిగినా పట్టిచ్చుకోకుండా వుండడానికి పోలీసులకూ ధైర్యం వచ్చింది. ఆర్ధ రాత్రి ఒక కుర్రాడు రోడ్డు మీద తిరుగుతున్నాడు అంటే, పోలీసులు ఆపేవాల్లు కాదు. వాడు ఇంజినీరింగ్ కాలేజీ స్టుడెంటు అని ఫిక్స్ అయిపొయ్యేవాల్లు. ఎప్పుడైనా ఎవరినైనా ఆపి అడిగినా వాళ్లకి ఒకటే సమాధానం వుండేది. "రేపు ఎగ్జాం వుంది, ఫ్రెండు రూములో కంబైండ్ స్టడీ చేసుకుని వెలుతున్నా" అని. ఈ ఏడాది పొడుగూతా ఏం ఎగ్జాములురా అని వాళ్లకి ఎప్పుడూ డౌటు రాలేదో, లేక ఏదో ఒక ఆన్సర్ వచ్చింది కదా అని వూరుకునేవాల్లో తెలీదు. వాళ్లకి ఎం తెలిసిందో కానీ, నేను ఏదో రాద్దామనుకుని మొదలుపెట్టి ఏదో రాసినట్టున్నా. ఎటు నుంచి ఎటు వెలుథున్నానో నాకైతే తెలీట్లేదు.

18 మార్చి, 2010

ప్రాజెక్ట్ పదనిసలు

నేను, మా గల్లీ గాడు (అది మేము వాడికి పెట్టుకున్న ముద్దు పేరు) చచ్చీ చెడీ అష్టకష్టాలూ పడి ఇంజినీరింగ్ చివరి ఏడు కి చేరామా... అని సంతోషిస్తూ 7వ సెమిస్టర్ పరీక్షలు రాసాం. ఇంకొక మూడునెల్లు మనవి కాదనుకొని కష్టపడితే ఆ డిగ్రీ ఏదో చేతిలో పడుతుంది అని ఆనందపడుతూ సెలవులకి ఇంటికివెళ్లా. మా గల్లీగాడు లోకలోడే కాబట్టి వానికి పెద్దగా తేడా ఎమీ పడలేదు లెండి. కానీ వాడే పెద్ద తేడా మనిషి. అందుకే వానికి ఆ పేరు. మా బట్టతల HOD గాడేమో (క్షమించాలి. అలా అలవాటైపోయిన ప్రాణం) 7వ సెమిస్టర్ చివరి పరీక్ష రోజే ప్రాజెక్ట్ సినాప్సిస్ ఇచ్చేయాలని చెప్పాడు. మనకేమో చివరిక్షణంలో ఎవరో ఒకరు గుర్తు చేస్తే తప్ప డెడ్‌లైన్‌లు గుర్తుండని ప్రాణమాయె. చివరి ఎగ్జాం తర్వాత ఎవడో వాని ప్రాజెక్ట్ గురించి చెబుతోంటే నాకు మా ప్రాజెక్ట్ విషయం గుర్తొచ్చి, రూంకి పరిగెత్తుకొచ్చి సినాప్సిస్ రాయడం మొదలుపెట్టా.

మా గల్లీ గాడి పుణ్యమా అని, ఏదో రిఫరెన్సు దొరికి మాకు ఇద్దరికి L&T లో ప్రాజెక్టు దొరికింది. ప్రాజెక్టు వచ్చిన రోజు వెల్లి గైడ్ ని కలవమంటే మేమిద్దరం కి వెళ్లాం. ఆ గైడ్ అక్కడ ఒక డిపార్ట్‌మెంట్‌కి వైస్ ప్రెసిడెంట్ అని మాకు అక్కడికి వెళ్లాక తెలిసింది. పాపం, వయసులో పెద్దాయన కానీ, చాలా కష్టపడేవాడు. మాకు ప్రాజెక్టు గురించి ఏదో కొద్దిగా చెప్పాడు. నేను కష్టపడి దాన్ని గుర్తు చేసుకుని సినాప్సిస్ రెడీ అనిపించా. అది ప్రింట్ తీయించి HOD కి ఇవ్వరా అని మావాడికి చెప్పి నేను బెంగుళూర్‌కి బస్సెక్కా.

ఓ నెల రోజులు ఇంట్లో పండగ చేసుకుని మైసూరుకి వచ్చేసరికి మా గల్లీ గాడు మంగుళూరులో పండగ చేసుకోడానికి వెళ్లాడు. ఎలాగూ వాడు లేడు కదా అని నేను ఓ రెండు రోజులు ఇటు కాలేజీకి, అటు ప్రాజెక్టు కి వెళ్లకుండా రూంలో తొంగున్నా. అప్పుడు తగిలింది, నాకొక పెద్ద షాక్. ఒక క్లాస్‌మేట్ ఒకడు రూంకి వచ్చి ముసలోడు గరం మీదున్నాడు. మీ ప్రాజెక్టు వొప్పుకోడంట అని బాంబు పేల్చాడు. కాలేజీకి వెళ్లి చూస్తే వాడేమో ఇంకా సినాప్సిస్ ఇవ్వలేదూ అంటాడు.(నిజం చెప్పాలంటే, ఆ మాట వినేదాకా నేను వెళ్లేముందు అది రెడీ చేసానన్న విషయం మరిచిపొయ్యా) బయటికొచ్చి మావాడికి ఫోన్ చేస్తే వాడు చావు కబురు చల్లగా చెప్పాడు - "నేను వెళ్లేసరికి బట్టతలోడు చాయ్ తాగడానికి పొయ్యాడు. ఎంతసేపు ఎదురు చూస్తాం, మళ్లీ ఇద్దాం లే అని ల్యాబ్ అటెండర్ బీరువాలో పెట్టి వచ్చేసా" అని. ఏదోలా మా ముసలోడి కాల్లుగడ్డాలూ పట్టుకొని, ఆరోజు సినాప్సిస్ ఇచ్చేసి ప్రాజెక్ట్‌కి ఓకే అనిపించుకున్నా.

L&T లో మా ప్రాజెక్ట్ గైడ్ గురించి చెప్పా కదా, ఆయన ఎప్పుడు చూసినా ఫుల్ బిజీగా వుండేవాడు. ఆయన్ని కలవాలీ అంటే, ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకుని పోవాలి. అదికూడా ఒక టీం కి వారంలో ఒకేసారి ఇచ్చేవాడు. ఒక వారంలో ఇచ్చిన పనిలో చిన్న డౌట్ వచ్చినా కూడా మళ్లీ వారం దాకా ఆగాల్సిందే. అలాంటి సమయంలో ఒకసారి మేము వరుసగా రెండు వారాలు అసలు అపాయింట్‌మెంట్ గురించే ఆలోచించలేదు. సడెన్‌గా ఒకరోజు మా ముసలోడు ప్రాజెక్ట్ స్టేటస్ అడిగితే అప్పుడు అపాయింట్‌మెంట్ గురించి గుర్తొచ్చింది. బేసిక్‌గా నేనొక సోంబేరి వెదవని కాబట్టి ఆ పని మా గల్లీగానికి అప్పజెప్పా. కానీ మావాని గురించి తెలుసు కదా... వాడు రెండు రోజుల తర్వాత ఫోన్ చేసి "అపాయింట్‌మెంట్ దొరికింది. రేపు పొద్దున మా ఇంటికి వచ్చెయ్, ఇద్దరం కలిసి వెళ్దాం" అన్నాడు. నేను హుషారుగా మరుసటి రోజు వెళ్లా. తీరా దగ్గర బ్నడి ఆపాక మావాడు బాంబు పేల్చాడు నేను అపాయింట్‌మెంట్ తీసుకోలేదూ అని. ఇప్పటికైనా మించింది లేదు, ఇంటికి వెళ్లి మళ్లీ రేపు అపాయింట్‌మెంట్ తీస్కొని వద్దామురా అని నెత్తి నోరు కొట్టుకున్నా. అయినా వాడు వినకుండా నన్ను లోపలికి లాక్కెళ్లాడు.

BP ఎలా వుంటుందో ఆ రోజు చాలా దగ్గరినుంచి చూసా. చెప్పాపెట్టకుండా వచ్చామని మొత్తం ఫ్లోర్ అంతా వినపడేలా అరుపులు. మాకు ఆరోజు అర్థం అయ్యింది, అన్ని రోజులు మేము ప్రాజెక్ట్‌లో ఎన్ని తప్పులు చెసామో...!!! ఆయనుకున్న ఓపిక కూడా మాకు అప్పుడే తెలిసింది, ఆ తప్పులను ఆయన ఎలా కరెక్ట్ చేయించారో ఆలోచించాక. ఆతరువాత, మళ్లీ మేము అపాయింట్‌మెంట్ తీసుకోకుండా ఆయన దగ్గరికి వెల్లలేదు. తప్పులు కూడా చెయ్యలేదు. ఫోన్ చెయ్యడానికి ముందే మేము చేసిన పని ఒకటికి రెండూ సార్లు క్రాస్‌చెక్ చేసుకుని అపాయింట్‌మెంట్ తీసుకునేవాళ్లం.

మొత్తానికి ప్రాజెక్ట్ ఒడగొట్టాం. ఫైనల్‌గా సర్టిఫికేట్ ఇచ్చేరోజు మాత్రం మేము అనుకున్నదానికి పూర్తి భిన్నంగా జరిగింది. మమ్ములని కూర్చోబెట్టి లైఫ్ ని ఎంత సీరియస్‌గా తీసుకోవాలో, ప్రాధాన్యతా క్రమాలు ఎలా నిర్ణయించుకోవాలో చెప్పారు. ఇంజినీరింగ్ స్టుడెంట్ లైఫ్‌కి, ఇంజినీర్ లైఫ్‌కి తేడా ఏంటో చెప్పారు. ఫైనల్‌గా ఒక కాఫీ పోసి పంపారు. ఇదీ క్లుప్తంగా మా ప్రాజెక్ట్ కథ. ఏదో చెప్పాలనుకుని మొదలు పెట్టా, ఏదో చెప్పి ముగించేస్తున్నా. మిగిలిన విషయాలు మల్లెప్పుడైనా చెప్పుకుందాం.

16 మార్చి, 2010

ఉగాది శుభాకాంక్షలు

వికృతి నామ సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు.

ఏమిటో, ఇన్ని రోజులు ఉగాది వచ్చినప్పుడల్లా ఏదో ఒక నోరు తిరగని పేరు చెప్పేవారు. ఈసారి మాత్రం, చిన్నప్పుడు తెలుగు క్లాస్‌లో నేర్చుకున్న ప్రకృతి కి వున్న "వికృతి" పేరు రావడం కొంత ఈజీ. కాకపోతే, పేరులో కొంత నెగెటివ్ టచ్ వుంది. అది, సాయంత్రం జరిగే పంచాంగ శ్రవణం లో వుండదని ఆశిద్దాం.

ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు అందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ధనధాన్యాలు మరియు ఐశ్వర్యాభివృద్ది పొందాలని కోరుకుంటూ... మరోసారి, ఉగాది శుభాకాంక్షలు.

15 మార్చి, 2010

తెలివి-అతితెలివి

మా సూరీడు చాలా తెలివైనోడు. ఒక్క తెలివైనోడే కాదు... బాగా లోకజ్ఞాణం వున్నోడు. మేధావి కూడా. వాడు ఎలాంటివాడంటే, వాడు లేకుంటే మా కాలేజ్‌డే ఫంక్షన్ కి స్టేజీ పనులు కాదు కదా, కనీసం ప్రోగ్రాములు చేసేవాళ్ల లిస్టు కూడా రెడీ కాదు. అంతలా అన్ని పనులూ నెత్తినేసుకుని చూసుకునేవాడు. సమాజసేవ అంటే వానికి పిచ్చి. చదువులో టాపర్(సరస్వతీదేవి దయవల్ల మావాడు లెక్కలని కూడా భట్టీయం వేయగలిగేవాడు). అంతెందుకు, అసలు 35 ఏళ్ల టీచింగ్ కెరీర్‌లో మా కాలేజ్ ప్రిన్సిపాల్ అలాంటి స్టుడెంటుని అంతకు ముందు చూల్లేదు. (నిజ్జ్యొం. కావాలంటే వాడు అమెరికాలో ఎమ్మెస్ చెయ్యడానికి అక్కడి యూనివర్సిటీ కి పంపిన SOP చూడండి. కింద, మా ప్రిన్సిపాల్ సంతకం, స్టాంపుతో సహా వుంటుంది.)

వానికి ఇంత టాలెంట్ ఎలా వచ్చిందా అని ఆలోచిస్తున్నారా.....? కష్టపడకండి. నేను చెబుతా. వాడు 1వ క్లాసులో రేడియో విప్పి చూసాడు. 3వ క్లాసులో టెలివిజన్ సెట్టు కూడా విప్పేసాడు. (నిజ్జ్యొం, ఇది కూడా SOP లోనే చూసా). మావాడు జీవితంలో సాధించిన మొదటి ఘనత, 5వ క్లాసులో కంప్యూటర్ ని విప్పడం. (బహుశా, ఇక్కడే దొరికాడనుకుంటా. లేకపోతే, 1990లో పిల్లలు పీకి పందిరేసేటన్ని కంప్యూటర్లు ఇండియా లో వున్నాయా అని). ఇంతటి మేధావి కాబట్టే, ఇంజినీరింగ్ ఆఖరిఏడు లోకి రాకముందే భవిష్యత్తుకు దిశానిర్దేశం కానిచ్చాడు. అమెరికా లొ ఎమ్మెస్ చేసి, వీలయితే పీ హెచ్ డీ చేసి, వానంత తెలివి వున్న వాళ్లందరినీ అక్కడికే లాగేసుకుని, ఆ పాప్యులారిటీ తో అక్కడే రాజకీయాల్లోకి దిగి, ఏ సెనేటరో అయిపోయి ఇక్కడి ఈనాడు పేపర్లో పడాలని ప్లాన్ చేసాడు. కానీ, పాపం. వీడు అప్లై చేసుకున్న ఏదో యూనివర్సిటీ వాడు మనవాడి అతితెలివిని పట్టేసాడు. పెట్టేసినోడు పట్టేసినట్టు వూరికే వుండకుండా, ఏదో ఘనకార్యం చేసినవాడిలా ఇందులో నిజమెంత అంటూ మా ప్రిన్సిపాల్ కి ఓ లెట్టర్ రాసి పడేసాడు. ఇక్కడే, పాపం, మా వాడి (డామిట్)కథ అడ్డం తిరిగింది. ఇంకేముంది... కాలేజీ ప్రిన్సిపాల్ పుణ్యమా అని, దేశం దాటి పోవాల్సిన ఒక అతితెలివి మేధావి ఇంజినీరింగ్ పూర్తయితే చాలు అని వీసా ప్రయత్నాలు ఆపేసాడు.

బోస్టన్ లో సెనేటర్ కలలు కన్న ఒక యువకిషోరం, బెంగుళూరులో సాఫ్ట్‌వేరులో సెట్టిల్ అయ్యాడు. దేశంలో అతితెలివిపరుల కౌంటు ఒకటి పెరిగింది.

11 మార్చి, 2010

చిరంజీవి Vs పవన్ కళ్యాణ్

మా బ్యాచ్‌లో వున్న 20 మందిమి కలిసి ప్రతి 2 నెలలకొకసారి పార్టీ చేసుకునేవాళ్లం. ఆ మధ్యలో పుట్టినరోజు వచ్చినవాళ్లు ఆ పార్టీ కి స్పాన్సర్స్ అన్నమాట.(అఫ్‌కోర్స్, ఎంత స్పాన్సర్ అనే మాట వాడినా, పార్టీ ఇచ్చిన వాళ్లకి గిఫ్ట్‌లు పోయేవి లెండి.) మేమున్న లేఅవుట్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో బెంగళూరు రోడ్‌లో పల్లవి ధాబా అని వుండేది. అదే మాకు పార్టీ స్పాట్. మేము ఇరవై మందిమి వెళ్లేవాళ్లం. పార్టీ మొదలైన దగ్గరినుంచి అయిపోయేవరకు మా గొంతులు పోయేలా అరుచుకోవడానికీ, కొట్టుకోవడానికీ మాకు ఒక టాపిక్ కావాలి. అదేమిటో గానీ, ప్రతీసారీ ఒకే టాపిక్ వచ్చేది. అదే చిరంజీవి Vs పవన్ కళ్యాణ్. ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప అను మేము కొట్టుకునేవాళ్లం. వాల్లు మాత్రం బాగానే వున్నారు, అది వేరే విషయం. ఇప్పటికే మీకు ఒక డౌటు వచ్చింటుంది... మేము ఎంత వెదవలం కాకపోతే ఈ టాపిక్ పెట్టుకుంటాం అని... కాని పార్టీ అన్నాక వాదులాట వుండాలి కాబట్టి ఏదో ఒకటి అని స్టార్ట్ చేసేవాళ్లం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మా ఇరవై మందిలో 17 మంది చిరంజీవి ఫ్యాన్స్.(వీల్లలో కొందరు బాలకృష్న ఫ్యాన్స్ కూడా వున్నారు, కాని ఆ టైంలో చిరంజీవి ఫ్యాన్స్ అవతారం ఎత్తేవాళ్లు. వీళ్ల గురించి మళ్లీ మాట్లాడుకుందాం.) ఒకడు రజనీకాంత్ ఫ్యాన్, ఇంకొకడు నాగార్జున ఫ్యాన్. మిగిలిన ఒక్కడు మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్... యస్స్, మీరు కరెక్టే. నేను అప్పట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్‌ని.

చెప్పాలంటే మొదట్లో నేను పవర్‌స్టార్‌కు అంత పెద్ద ఫ్యాన్ ను కాదు. కాని, నేను హైదరాబాద్ లో లాంగ్ టరం చేసే రోజుల్లో సంధ్య థియేటర్ మీద చేసిన దాడుల గురించి తెలిసిన మిత్రులంతా కలిసి నన్ను పవన్ కళ్యాణ్ కు వీరాభిమానిని చేసేసారు. మొదట్లో నాకు చిరంజీవి అంటే ఇంత వ్యతిరేకత లేదు. ఎక్కడో ఒక మూల కొద్దిగా ఇష్ఠం వుండేది అనుకుంటా. కానీ రెండు విషయాలు నాలో చిరంజీవి అంటే వ్యతిరేకతను పెంచాయి.

1. ఇది ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు కానీ, అప్పట్లో ఏదో మ్యాగజైన్ లో చదివాను. "అన్నయ్య" వంద రోజుల ఫంక్షన్లో చిరంజీవి మట్లాడితూ "ఈ సినిమా వేరే వాల్లు చేసుంటే ఇన్ని రోజులు ఆడేది కాదు... ఒక 50 రోజుల సినిమా. కానీ నేను చెసిన సినిమా కబట్టి 75 రోజులు ఆడుతుంది అనుకున్నా. కానీ ఫ్యాన్స్ ఆడించడం వల్ల 100 రోజులు ఆడింది....." అంటూ ఇంకా చాలా మాట్లాడినట్టు చదివా. అది చదవగానే, రెకార్దుల కోసం అలా ఆడించడం వెనుక చిరంజీవి ఎంకరేజ్‌మెంట్ వుంది అని నాకు అర్థం అయ్యింది. నేను తప్పుగా అర్థం చేసుకుని వుండవచ్చు, కానీ అప్పుడే నాకు చిరంజీవి అంటే వున్న కొద్ది ఇష్ఠం కాస్తా పొయ్యింది.

2. ఇంద్ర సినిమా. సినిమా బాలేదు అని నేను అనను. కానీ చిరంజీవి ఆ సినిమా చెయ్యకూడదు అనేది నా వాదన. అప్పటికే చిరంజీవికి వున్న క్రేజ్, స్టార్‌డం చూసుకుంటే ట్రెండ్‌సెట్టర్ సినిమాలు తీయాల్సిన చిరు హిట్ కోసం ఆల్రెడీ సెట్ అయివున్న ఫాక్షన్ అనే ట్రెండ్ ఫాల్లో అయ్యాడు. ఆ ట్రెండ్ కూడా అప్పుడు అదే రేంజ్‌లో వున్న బాలకృష్ణ సెట్ చేసింది. ఇన్ని సంవత్సరాల స్టార్‌డం, మాస్ అభిమానగణం వుండి, కలెక్షన్ల పరంగా తెలుగు సినిమా స్టామినా మార్చిన హీరోగా పేరుండి, కేవలం ఒక్క హిట్ కోసం వేరొకరు సెట్ చేసిన ట్రెండ్‌లో వెల్లడం తప్పు అని నా వాదన.

ఈ రెండు విషయాలను పక్కన పెడితే, మా చిరు Vs పవన్ గొడవల్లో చాలా పాయింట్లు వచ్చేవి. ఏ పార్టీ అయినా చివరకు గొడవ మాత్రం ధాభా వాడు మమ్మల్ని వెళ్లిపొమ్మనేంతవరకూ జరిగేవి. ఆ మధ్యలో కోపాలకు పోయి ఆవేశంతో కొట్టుకోవడాలూ, బాటిల్సు పగులగొట్టి ఒకరి మీదకి ఒకరు పరుగు తీయడాలు.... అదో వింత సరదా. ఈ మధ్యలో ఇద్దరు మాత్రం ఈ గొడవేది పట్టనట్టు వేరే పని మీద వుండేవాళ్లు. వాల్ల పని అంతా మా దగ్గర ఆర్డర్ తీస్కోవడం, ధాభా వానికి ఇవ్వడం... మళ్లీ ఆర్దర్ ఇచ్చినవన్నీ వచ్చాయో లేదో చూసుకోవడం. ఇదంతా ఇప్పుడు గుర్తుచేసుకోగలనే కానీ మళ్లీ సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే, ఇప్పుదు మల్లీ ఆ ఇరవై మందీ కలవరు. ఒకవేళ సగం మంది కలిసి వెళ్లినా, ఆ అన్నదమ్ముల గొడవలెందుకురా టైం వేస్టూ అని కన్‌క్లూడ్ చేసుకుని, పెళ్లి అయినవాల్లంతా కలిసి బ్యచిలర్ల బుర్ర తినే ప్రోగ్రాం పెడతారు. ఇక్కడ వాల్ల తప్పు కూడా లేదు లెండి. వాల్ల వాదన కూడా కరెక్టే. "Happyness is not the only virtue in life" అని చెప్పి, కష్టాల కడలిని ఈదడానికి తోడు రమ్మంటారు..... అతితెలివి అంకుల్సు.

10 మార్చి, 2010

పరిచయం

నేను ఇంజినీరింగ్ మైసూర్ లో చేసాను. మా కాలేజీ ఊరి అవతల వుండేది. మేము వున్న లేఅవుట్ అప్పట్లో మైసూరు కు చివరి సెంటరు. ఆ ఏరియా దాటితే అంతా చెట్లు పుట్టలతో వుండేది. మా బ్యాచ్ లో 20 మందిమి తెలుగు వాళ్లం. రెండు ప్రైవేట్ హాస్టల్స్ లో అందరం వుండేవాళ్లం. ఆ 20 మందిలో ఎక్కువ మందికి ముందే హాస్టల్ జీవితం అలవాటు. నాలాంటి ఒక ఐదారుగురికి మాత్రం అది కొత్త.

రెండు విషయాల్లో మాత్రం అక్కడ అందరికీ కొత్తే. ఒకటి భాష అయితే రెండోది స్వాతంత్ర్యం. చాలా మంది ఇంటర్ హాస్టల్లో చదివినా కూడా అక్కడ ఎంత స్వాతంత్ర్యం వుంటుందో అందరికీ తెలిసిందే. ఈ రెండు విషయాలే మా అందరినీ బాగా దగ్గర చేసాయి. ఇంజినీరింగ్ అయిపోయి దాదాపు ఏడేళ్లు అయినా కూడా ఇప్పటికీ ఒక పది మందిమి రెగులర్ గా టచ్ లో వున్నాం. ఏ ఒకేషన్ వచ్చినా ఇప్పటికీ ఆ పది మందిమి మాత్రం తప్పకుండా కలుసుకుంటాం. అన్నీ ఒక వరుసలో కాకపోయినా, గత పదేళ్లలో మా మధ్య జరిగిన సరదా సంగతులు, మేం పంచుకున్న మధురానుభూతులు ఈ లేబుల్ కింద పోస్టు చేస్తాను.

సరదాగా సాగిన జీవితాన్ని మరింత సరదాగా గుర్తు చేసుకుందాం... మెల్లమెల్లగా, కొద్దికొద్దిగా.... కానీ మొత్తంగా!!!

09 మార్చి, 2010

పరువు పోయింది

అవును. పరువు పోయింది. విద్యాధికులు, మేధావులతో నిండి వుండే పెద్దల సభగా చెప్పుకోబడే ఎగువ సభ (రాజ్య సభ) పరువు పోయింది. పరోక్ష ఎన్నికలు, వాటి వల్ల వచ్చే పదవులు రాజకీయ ఉద్యోగాలు సృష్టంచడానికేనని రాజకీయ పక్షాలు మరోసారి నిరూపించాయి. ఈ మాట నిరూపించుకునే ప్రయత్నం లో మన గౌరవనీయులైన సిగ్గు లేని రాజకీయ వుద్యోగులు అంతర్జాతీయ అవనిక పై భారతావనికి ఒక మాయని మచ్చను అంటగట్టారు.

మహిళా దినోత్సవం రోజున మహిళా బిల్లును ప్రవేశపెట్టే సమయంలో పెద్దల సభలో కొందరు పెద్దలు ప్రవర్తించిన తీరు కేవలం ఆ సభ పరువునే కాదు, మొత్తం భారతీయ పార్లమెంటరీ వ్యవస్థ పరువునే మంట గలిపేసింది. ఈ తరహా విన్యాసాలు దిగువ సభలో జరిగితే ఇంతగా ఆలోచించేవాల్లం కాదు. ఎందుకంటే, వాళ్లు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన మన ప్రతినిధులు. వీళ్లు మైకులు విరగ్గొట్టకుండా, బిల్లు పేపర్లు చించేయకుండా ప్రశాంతంగా చర్చిస్తే ఆ తర్వాతి ఎన్నికల్లో మళ్లీ మనం ఓట్లేస్తామా...? అస్సలు వెయ్యం. ఆ విషయం వాళ్లకు కూడా తెలుసు. అందుకే వాళ్లు అలా చేస్తారు. మనం చూస్తాం. మనం అలా అడ్జస్ట్ అయిపొయ్యాం. కాని, పెద్దల సభ అంటే, ఇప్పటికి నాలాంటి అమాయకులకి ఎక్కడో కొద్దిగా నమ్మకం మిగిలింది. రాజ్యసభ అంటే పెద్దరికానికీ, హుందాతనానికీ ప్రతినిధిగా వుండాలనీ, వుంటుందనీ జనాల్లో వున్న నమ్మకాన్ని ఈరోజు మన రాజకీయ పార్టీల పుణ్యమా అని మన రాజకీయ వుద్యోగులు మానభంగం చేసేసారు.

పొలిటికల్ ఎంప్లాయ్‌మెంట్ పేరు మీద రాజ్యసభను మరో లోక్‌సభ చేసిన పార్టీల తప్పా, లేక రాజ్యసభ విలువ తెలియకుండా వెళ్లి దాని పరువు తీసిన సభ్యుల తప్పా అని ఆలోచిస్తే.... నాకు తట్టిన ఆలోచన మాత్రం ఇది ముమ్మాటికీ పార్టీల తప్పే. ఫ్రజాబలం లేకో, మరేదో కారణం వళ్లో ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజాసేవకు నోచుకోని మేధావి వర్గం సేవలను ప్రజాసేవకు వినియోగించుకోవాలనే సదుద్దేశం తో మన రాజ్యాంగం నెలకొల్పిన విధానమే రాజ్యసభ. ఆ సభ విలువ తెలియనివాళ్లనీ, ఆ సభలో సభ్యత్వం పొందే అర్హత లేనివాల్లనీ కేవలం డబ్బు కోసమో లేక పార్టీ ఫండ్ కోసమో లేక మరేదో ప్రయోజనం ఆశించో రాజ్యసభకు పంపిన పార్టీలదే ఇక్కడ తప్పు.

గతాన్ని చూస్తే, ఈ సభ తన మర్యాదను ఏనాడూ ఇలా పోగొట్టుకోలేదు. ఇంకా చెప్పాలంటే, గత ప్రభుత్వాలు దాని ప్రతిష్ఠను పెంచాయి. దానికి స్వచ్చమైన ఉదాహరణ మన జాతీయ విత్త మంత్రివర్యులు శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు. ప్రణబ్ రాజకీయ జీవితాన్ని పరికిస్తే, 1969-1987 మరియు 1993-2004 మధ్య కాలంలో రాజ్యసభ సభ్యునిగా సేవ చేసారు. చాలా మంది ఈయనని సోనియా కోటరీగానే అనుకుంటారు. కానీ, చాలా మందికి తెలియని విషయం ఒకటుంది. 1982-84 మధ్య కాలంలో కూడా ఈయనే మనకు విత్తమంత్రి. ఆ సమయంలో, అంటే, 1984 లో "యూరోమనీ" అనే పత్రిక వారు ప్రణబ్ ని ప్రపంచంలో అత్యుత్తమ ఆర్థిక మంత్రిగా ప్రకటించి గౌరవించారు. దానికి ఒక కారణం కూడా వుంది. 1981లో (అనుకుంటా) భారత ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి తీసుకున్న అప్పులో చివరి వాయిదా అయిన 1.1 బిలియన్ డాలర్లను 1984లో తీసుకోవలసివుండగా, ఆ సమయంలో ఈయన తీసుకున్న నిర్ణయాల ఫలితంగా మన ప్రభుత్వం ఆ సొమ్మును, అనగా అప్పును, తీసుకోలేదు. ఇలాంటి మేధావుల సేవలను కోల్పోరాదనే సదుద్దేశంతో మన రాజ్యాంగం మనకిచ్చిన రాజ్యసభ అనే మహోత్తరమైన విధానానికి తిలోదకాలిస్తూ ఆ సభా మర్యాదను మంటగలిపే రౌడీరాజులను సభ్యులుగా చేసిన మతి లేని, సిగ్గు విడిచిన ముగ్గురు యాదవ కుల తిలకులకు ఇవే నా జోహార్లు.

04 మార్చి, 2010

ఆంగ్లం - సంగీతం

నేను 7వ తరగతి లో వుండగా అనుకుంటా, మంథని లో సంగీత పఠశాల స్టార్ట్ అయ్యింది. 8వ తరగతి లో వుండగా నేను, ఇంకో ఇద్దరు స్నేహితులు మ్రుదంగం క్లాసులో చేరాం. అదే సమయం లో ఇంగ్లిష్ గ్రామ్మర్ కోసం కూడా ఇంట్లో వాళ్లు మా ముగ్గురికీ ట్యూషన్ పెట్టించారు. ఇక రోజూ మాది ఒకే దినచర్య అయిపోయింది. సాయంత్రం స్కూలు నుంచి రాగానే ఇంత తినడం, తయారవడం, సైకిల్లేసుకుని బయట పడటం. ముందుగా ఇంగ్లిష్ ట్యూషన్ కి వెళ్లడం, అది అయ్యాక సంగీత పఠశాల కి వెళ్లడం. రెండూ అయ్యాక ఇంటికి చేరడం. ముందు కొన్నాల్లు బాగానే గడిచింది. తరువాతే, (డామిట్) కథ అడ్డం తిరిగింది.

ఇంగ్లిష్ ట్యూషన్ బాగానే జరిగేది. పేరు గుర్తు లేదు కానీ, ఆ పంతులు మాచేత WREN & MARTIN పుస్తకాన్ని కొనిపించి, అదే పుస్తకంలోంచి నేర్పించేవారు. ఏ మాటకామాటే చెప్పుకోవాలి గానీ, నేను ఈమాత్రం ఇంగ్లిష్ మట్లాడుతున్నానంటే అది ఆ ట్యూషన్ మహిమే. ఆ పుస్తకం అయ్యేంత వరకు మేము ముగ్గురం ఆ ట్యూషన్ కు రోజూ వెళ్లాము.(అక్కడ మేము ముగ్గురమే స్టుడెంట్సు, అది వేరే విషయం).

ఇక సంగీతం విషయానికి వస్తే, మొదట్లో అక్కడ ఒక మ్రుదంగం మాస్టారు వుండేవారు. ఆయంటే అందరికీ గౌరవం వుండేది. కానీ ఆయనకి వరంగల్ అంటే ఇష్టం వుండేది. ఆ ఇష్టం తోనే ఆయన వరంగల్ కి ట్రాన్స్ ఫర్ చేయించుకుని వెళ్లిపోయారు. అందరూ చాలా బాధ పడ్డారు. నేను కూడా!!! (తొక్కలో బాధ. నేను ఆయన దగ్గర నేర్చుకున్నది రెండు వారాలు. ఆ రెండు వారాల్లో నేర్చుకున్నది, ఒక్క పాఠం. ఈమాత్రానికే బాధ పడితే, నా లైఫ్ అంతా ట్రాజెడీ గానే వుండేది. ఏదో, పక్కనున్న వాళ్ల కోసం కొంచెం సైలెంట్ గా వున్నా.. అంతే.) కానీ, ఆయన వెళ్లాక వచ్చిన కొత్త మాస్టారు ఆ పాత మాస్టారు చెప్పిందంతా వేస్టు అని కొత్తగా చెప్పడం మొదలు పెట్టారు. కొత్త పాఠాలు ఎలా వున్నా, పాత మాస్టారు చెప్పింది వేస్టు అనేసరికి చాలా మందికి ఎక్కడో కాలింది. (నాక్కూడా కాలింది. కానీ రీజన్ మాత్రం వేరు. ఏదైనా ఒక్కసారి చెప్పగానే పట్టేసి నేర్చేసుకోవాలని ఎక్స్ పెక్ట్ చేసేవాడు. నాకు అంత తెలివి లేక రోజూ తిట్లు తినేవాన్ని. అందుకు నాకు కాలింది.)

అప్పట్లో అందరికీ ఒక అలవాటు వుండేది. క్లాస్ అయ్యాక, బయటకి వచ్చి చెప్పులు వేసుకుంటూ "వెళ్లొస్తాం మాస్టారూ" అని చెప్పేవాళ్లం. (బహుశా అది RSS వారి శిశు మందిర్ నుండి వచ్చిన అలవాటు అనుకుంటా. ఆ క్లాసులో ఎక్కువ మంది శిశు మందిర్ పూర్వ విద్యార్థులే.) ఒక రోజు అనుకోకుండా నేను రమణ గారి "బుడుగు" స్టైల్ లో "ఒరేయ్ మాస్టారూ, వెళ్లొస్తానురా" అన్నాను. అది ఆ మాస్టారి చెవిన పడింది. అంతే, ఆ మాస్టారు నన్ను చుస్తూ, ఒరేయ్, నువ్విలా రారా అన్నాడు. మెడకాయ మీద తలకాయ వున్నవాడెవడైనా వెళ్తడా...? నేను కూడా అంతే. పరుగు లంకించుకున్నాను. నా పుణ్యమా అని, నాతో వున్నందుకు నా ఫ్రెండ్సు కూడా పరుగెత్తక తప్పలేదు. మళ్లీ మూడు నెలల పాటు మేము ముగ్గురం సంగీత పఠశాల కి వెళ్లలేదు. అఫ్ కోర్స్, మూడు నెలల తర్వాత ఆ పాఠశాల ప్రిన్సిపాల్ వచ్చి మీ వాడు రావట్లేదండీ అని ఇంట్లో చెప్పాక వెళ్లక తప్పలేదు.

కానీ, లైఫ్ లో మొదటిసారి బంక్ కొట్టడం అలవాటైంది. ఆ మూడు నెలలు బంక్ కొట్టి రోజూ గ్రౌండ్ లో ఆడుకోవడం లో కూడా ఒక థ్రిల్ వుండేది.

03 మార్చి, 2010

గంగాధర్ సారు బడి

నా 6, 7, 8 తరగతుల చదువు కరీంనగర్ జిల్లా, మంథని టౌన్ లోని UPS లో జరిగింది. (ఇప్పుడు ఆ బడిని ZPP స్కూలు గా మర్చారు. అది వేరే విషయం.) అప్పట్లో ఆ స్కూలు ని UPS అనే కంటే అందరూ గంగాధర్ సార్ బడి అని పిలిచేవాల్లు. ఆయన ఆ స్కూలు కి హెడ్ మాస్టర్ గా చేసేవారు. ఆయనంటే స్కూల్లో అందరికీ హడల్. ఆ రోజుల్లో అంతగా ఎందుకు భయపడ్డామో ఇప్పటికీ నాకు అర్థం కాదు. ఎందుకంటే, ఆయన ఏనాడూ ఎవరినీ కొట్టడం నేను చూడలేదు. ఆ బడికి ఆ పేరు రావడానికి కారణం అక్కడ ఆయన ఎక్కువ కాలం పని చేసి వుండడమే. ఆయన అదే స్కూల్లో హెడ్ మాస్టర్ గా వున్నప్పుడు అక్కడ చదువుకున్న వాల్లే మళ్లీ ఆ బడికి టీచర్లుగా వచ్చి మాకు పాఠాలు చెప్పారు. దాదాపు రెండు దశాబ్దాలపాటు ఆయన అక్కడ చేసారు.

మంథని చుట్టు పక్కల వూర్లల్లో కూడా గంగాధర్ సార్ బడి అంటే ఒక పేరు వుండేది. పేరుకి సర్కారు బడి అయినా ప్రైవేటు స్కూల్లకి ఆ స్కూలు పెద్ద పోటీ. అక్కడ టీచర్లు కూడా చాలా బాగా చెప్పేవారు. నాకు గుర్తున్న కొందరు మాస్టార్ల గురించి ఇక్కడ చెప్పాలి.

గంగాధర్ సార్: హెడ్ మాస్టర్ గానే కాకుండా, ఇంగ్లిష్ కూడా చెప్పేవారు. ఆయన క్లాస్ ఎప్పుడు అయినా చాలా సైలెంట్ గా వుండేది. ఎవరూ మాట్లాడే వారు కాదు. చెప్పాను కదా, ఆయనంటే అందరికీ భయం అని.

భూమయ్య సార్: సామాజిక శాస్త్రం చెప్పేవారు. ఆటలు ఆడించేవారు. క్లాసులో క్విజ్ పెట్టేవారు. కథలు చెప్పేవారు. అన్నింటిలోనూ జీవితం గురించీ, చదువు గురించీ చెప్పేవారు. కబడ్డీ ఆడించేటప్పుడు "కబడ్డీ కబడ్డీ" అనే కూత బదులు "కెనడా రాజధాని ఒట్టావా" అనో, "కెన్యా రాజధాని నైరోబీ" అనో కూత వేయించేవారు. అలా ఆటల్లోనే చదువు కానిచ్చేవారు. ఆయన మా మీద ఎంత ప్రభావం చూపారంటే, మేము ఆడుకునే ఆటల్లో క్విజ్ కూడా ఒకటి. ఇప్పటికీ ప్రతీ ఏడాది టీచర్స్ డే రోజు నేను ఆయనకి ఫొన్ చేస్తాను.

వీరయ్య సార్: లెఖ్ఖలు చెప్పేవారు. మా క్లాసులో ఎక్కువ మంది ఇంజినీరింగ్ చేసారంటే ఆ క్రెడిట్ ఆయన చెప్పిన లెఖ్ఖలదే.

ప్రసాద్ సార్: వీరయ్య సార్ తర్వాత మాకు లెఖ్ఖలు చెప్పడానికి వచ్చారు. వీరయ్య సార్ లేని లోటు తెలియకుండా నేర్పారు. ఈయన కూడా గంగాధర్ సార్ శిష్యుడే అనుకుంటా. నేను చివరిసారిగా కలిసిన టీచర్ కూడా. (ఈమధ్యే ఒక ఫంక్షన్ లో కలిసారు.)

రామయ్య సార్: ఈయన నేను 8వ క్లాసు లో వుండగా రిటైర్ అయ్యారు. హిందీ చెప్పేవారు. ఈయన ఒక మంచి కవి కూడా. గంగాధర్ సార్ క్లాస్ ఎంత సైలెంట్ గా వుండేదో, ఈయన క్లాస్ అంత అల్లరిగా వుండేది. పాఠాలను కూడా కథలుగా చెప్పేవారు. ఎవరు అల్లరి ఎక్కువ చేసినా, "వీని లాంటి వాడే ఒకడు...." అంటూ ఒక కథ చెప్పేవారు. ఈయన క్లాసులో అందరూ ఒక వరుసలో కాకుండా ఎవరికి ఇష్ట్టం వచ్చినట్టు వారు గుంపులు గుంపులు గా కూర్చునేవాల్లం. ఒక గుంపు అల్లరి చేస్తే, ఇంకొక గుంపుకు దెబ్బలు పడేవి. ఆ దెబ్బలని కూడా మేము ఎంజాయ్ చేసేవాల్లం.

02 మార్చి, 2010

తొలి టపా

ఇది నా తొలి టపా. కొన్ని తెలుగులొ వస్తున్న బ్లాగులను చూసి ఇన్ స్పిరేషన్ తో మొదలుపెట్టాను. ఎన్ని రొజులపాటు దీన్ని కంటిన్యూ చేస్తానో కాలమే నిర్ణయిస్తుంది.

ఇందులో నా గతం, వర్తమానం మరియు అందులోని మధుర జ్ఞ్యాపకాలను పొందు పర్చుకోవాలని నా ఆలోచన. వాటితో పాటు, అందరితో పంచుకోవాలనుకునే కొన్ని ఆలోచనలు.

నాలో ఒక కవి కానీ, భావుకుడు కానీ లేడని నా ప్రగాఢ నమ్మకం. అందుకే, నా తెలుగు లో తప్పులు దొర్లితే సరిదిద్దమని తెలుగు ప్రేమికులకు మనవి.

సరైన శీర్షిక తో త్వరలొనే మళ్లీ వస్తా.