09 జనవరి, 2012

నా మొట్టమొదటి వం(పెం)ట

అనగా అనగా, అంటే కొన్ని సంవత్సరాల క్రితం మాట అన్నమాట. మేము ఫ్రెండ్స్ అందరం ఉద్యోగప్రయత్నాల్లోంచి బ్రహ్మిగా రూపాంతరం చెందిన కొన్ని రోజులకి, అందరం కలిసి ఈ సింగిల్ రూముల్లో బతుకు వెళ్లదీయడం దేనికిలే అని ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకుని అక్కడికి మారాం.

మామూలుగానే స్వతహాగా అన్ని బ్యాచిలర్ బ్యాచులకి వుండే అత్యుత్సాహం కొద్దీ కొత్త ఫ్లాట్‌లోకి అడుగుపెట్టే ఒకటి రెండు రోజులముందు అనుకున్నాం. కొత్త ఫ్లాట్‌లో అయినా ఈ మెస్సు ఫుడ్డు మానేసి రోజూ రాత్రి వంట వండుకుందాం. వీలయితే మధ్యాహ్నం బాక్సులు తీసుకెళ్దాం. ఓపిక వుంటే పొద్దున టిఫిన్ చేసుకుందాం. ఇక నుంచి బయట ఫుడ్డు కోసం పైసా కూడా ఖర్చుపెట్టకూడదు అని సవాలక్ష ప్లాన్లు వేసాం. మామూలుగా అయితే ఇది ఎక్కువ కాలం జరగాల్సిన ప్రక్రియ కాదుగానీ, మావాల్ల ఉత్సాహ ప్రదర్షన మూలంగా కొంచం, బయటి ఫుడ్డుమీద ఇంట్రెస్టు పోవడం మూలంగా కొంచెం ఆ అలవాటు అలా సా...గి పోయింది, కొన్ని సంవత్సరాలపాటు.

ఇక అసలు విషయానికొస్తే, మేము ఆ ఫ్లాట్‌లోకి మారిన కొన్నిరోజులకి వినాయకచవితి పండగొచ్చింది. మామూలుగా ప్రతీ చిన్నదానికి ఇంటికి పరిగెత్తే మేము అదేంటోగానీ, ఆ పండక్కి మాత్రం అందరం బెంగుళూరులోనే వున్నాం. అప్పటికే కొన్ని రోజులు రూమ్మేట్సు వండింది తిని బాగా కాకపోయిన, కొద్దిగా బలిసిందేమో, పొద్దున లేవంగానే నాకో వింత ఆలోచన పుట్టింది. రోజు అందరూ కలిసి విడివిడిగా, కలివిడిగా తలా ఒక చెయ్యి వేస్తూ వంట చేస్తే నేను మాత్రం వంట చేసేప్పుడు వాళ్లనీ, తినేప్పుడు టివి ని చూడటం తప్ప వేరే ఏమి చెయ్యట్లేదని బాధేసింది. అలాగే వుంటే ఆ బాధతో డిప్రెషన్‌లోకి పోతానేమో అని భయమేసింది. ఆ తర్వాత ఇంత చెత్తగా ఆలోచిస్తున్నందుకు నామీద నాకే అసహ్యమేసింది (నాక్కూడా అని నాగార్జున లాగా మీరు అనుకోకండే). ఏదో ఒకటి చేసి నేను సైతం అనిపించేద్దామని డిసైడ్ అయ్యా.

డిసైడ్ చేసుడే ఆలస్యం, తెగ ఆలోచించీ చించీ... ప్రసాదం కింద పాయసం చేసి వినాయకుడికి నైవేద్యం పెడదామనే ఆలోచన నా మిత్రగణం ముందుంచా. ఒక్కడు కూడా కనీస స్థాయిలో ప్రోత్సాహం ఇవ్వకపోగా నీకెందుకురా ఈ దూల అని రకరకాలుగా పరిహసించి, నాలో ఆగ్రహ జ్వాలలు రేగేలా నన్ను వుసిగొల్పారు. వీళ్లకి ఎలాగైనా బుద్ది చెప్పాలి, పాకశాస్త్రంలో నేను ఎంతటి ప్రావీణ్యం సంపదించగలనో నిరూపించాలి ఈ మందబుద్దులు గ్రహించేలా చెయ్యాలని కంకణం కట్టుకున్నా. (ఆరోజు చూసిన వినాయక మహత్యం సినెమా డైలాగులు ఇప్పుడు నా మైండ్లో తిరుగుతున్నాట్టున్నాయి. అందుకే, భాష పట్టు తప్పుతోంది). అనుకున్నదే తడవుగా రోడ్డెక్కేసా, పాయసానికి కావాల్సిన వస్తువులు తేవడానికి. అప్పటికే నాకు తెలిసిన పాకశాస్త్రం పుస్తకానికి ఒకసారి దుమ్ము దులిపితే తెలిసింది, పాలు, చక్కెర, సేమియా వుంటే పాయసం చెయ్యొచ్చని.

షాపుకెళ్లాను గానీ, ఏది ఎంత వెయ్యాలో తెలీదు. అర లీటరు పాలు, ఒక సేమియా పాకెట్టు తీసుకున్నా. చక్కెరెంత పడుతుందో తెలీదు. కనుక్కుందామని ఇంటికి ఫోన్ చేసా. నాన్న ఫోన్ తీసాడు. నన్ను అసలు విషయంలోకి దిగనివ్వకుండా స్నానం చేసావా లేదా, గుడికెళ్లావా లేదా అని సిబిఐ రేంజిలో అడిగేసాడు (నేనంటే ఎంత నమ్మకమో, నేనలాంటి పనులు ఎన్ని సార్లు చెప్పినా మర్చిపోతానని). ఈ ప్రశ్నావళిని మధ్యలో తుంచేసి అమ్మకి ఫోనివ్వమన్నా. అమ్మ బిజీగా వుంది, విషయం ఏంటో చెప్పమన్నాడు. పాయసం అయిడియా చెప్పి, చక్కెర ఎంత కావాలి అని అడిగా. ఒక పావుకిలో తీస్కుని ఇంటికి వెళ్లు, అమ్మ ఫ్రీ అయ్యాక ఫోన్ చేయిస్తా అప్పుడు ఎంత అంటే అంత వెయ్యొచ్చు అని నాన్న సలహా ఇచ్చాడు. ఇదేదో బాగుందే అని అలాగే చేసా.

ఇంటికెళ్లి పాలు కాచాను కానీ అమ్మ నుంచి ఫోన్ రాలేదు. ఎలాగూ వెయ్యాల్సిందే కదా అని సేమియా కూడా వెసేసా... అది కూడా ఓ మోస్తరు ఉడికింది(??). ఇంకా అమ్మ నుంచి ఫోన్ లేదు. నాలో ఓపిక లాస్ట్ ఇయర్ సెన్సెక్స్ పడ్డట్టు పడిపోయింది. మళ్లీ ఇంటికి ఫోన్ చేసా. అమ్మ ఇంకా బిజీ అన్నాడు నాన్న. ఇక లాభం లేదని, ఎదురు చూస్తే కిచెన్ లో నిలబడి కాల్ల నొప్పూ తప్ప ఇంకేమి మిగిలేలా లేదని ఆలొచించి తెచ్చిన చక్కెర మొత్తం పాలల్లో వేసేసా. అదేంటో, వేసిన 30 సెకన్లకి అమ్మ ఫోన్ చేసింది. ఎంట్రా అంటే, ఏం లేదు పనైపోయింది అని చెప్పి పెట్టెసా. గిన్నె మీద మూత పెట్టి మొబైల్ లో ఒక గేం ఆడుకున్నా. ఒక రెండు నిమిషాలాగి, గేము అయ్యాక మూత తీసి చూస్తే, సేమియా బ్రహ్మాండంగా వుంది. అవును, సేమియా మాత్రమే వుంది, చుక్క పాలు కూడా లేవు. సర్లే, అందరికీ, గిన్నెలో పోసిచ్చెబదులు, చెంచాతో డైరెక్టు చేతిలో వెయ్యొచ్చు కదా అనుకుని, దేవునికి నైవేద్యం కూడా చూపించేసా.

తర్వాత రుచి చూద్దును కడా, అది పాయసంలా కాక హల్వా లాగ తయారైంది. దాని విషయం తెలిసిన నా రూమ్మేట్సు కనీసం దాన్ని ప్రసాదం కింద కన్సిడర్ చేసి రుచి చూడమన్నా కుడా కుదరదని తేల్చేసారు. తప్పనిసరి పరిస్థితుల్లో అలా నా మొదటి వంట పెంటలోకి చేరింది. అదేంటో, ఇది జరిగి ఇన్నేళ్లయినా కుడా, ఇప్పటికీ మావాళ్లు నేను కిచెన్‌లోకి వెళ్తున్నానంటే జడుసుకుంటారు. సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే, నాకు పెళ్లయ్యాక మావాళ్లు ఈ అనుభవాన్ని కొద్దిగా మసాలా దట్టించి నా భర్యకు చెప్పారు. ఇప్పుడు నేను వంట నేర్చుకుంటా అని చెప్పినా, నా భార్య నన్ను వంటింట్లోకి రానివ్వట్లేదు. వా :-(