19 ఏప్రిల్, 2010

మోడీ-థరూర్: ఏది నిజం?

ఇక్కడికి నేనేదో భీభత్సమైన అనలిస్టుని అనుకుంటే మీరు రమ్ములో కక్కేసినట్టే. నేను అనలిస్టుని కాదు కదా, కనీసం ఒక పిల్ల జర్నలిస్టుని కూడా కాదు. నేను అనుకున్నదే నిజం అనుకునే అమాయక చక్రవర్తిని కాబట్టి, టైటిల్ జస్టిఫై అవుతుందని ఆ టైటిల్ పెట్టానంతే. ఇక విషయానికి వద్దాం.

అనగనగా, మోడీ అనే పెద్దమనిషి ఒక పెద్ద ఆటల పండుగని డిసైన్ చేసి, మార్కెట్ చేసి, టీములని అమ్మేసి, కొన్ని వేలకోట్ల వ్యాపారాన్ని తయారుచేసాడు. మొదాటి ఏడాది అంతా బాగానే జరిగింది. రెండో ఏడాది వచ్చేసరికి ఆసేతుహిమాచలంలో ఎన్నికలొచ్చి, ఆటలపండుగని వేరే దేశానికి, ఆ మాటకొస్తే వేరే ఖండానికి మార్చారు. అక్కడ కూడా పండగ బాగానే సాగింది. అయితే పండగ ఇంటికి దూరంగా చేసుకుంటున్నాం కదా అని సదరు మోడీగారు కాస్త ఎక్కువగానే పండగ చేసుకున్నారు. అప్పటివరకు సదరు పెద్దమనిషిని ఒక వ్యాపారవేత్త అనే అనుకున్న సామాన్యజనం ఈ పెద్దమనిషిలోని రసికుడిని కూడా గుర్తించారు. అదే సమయంలో పండగ జరుగుతున్న ఖండంలో పండగకు డిమాండు పెంచడానికి రకరకాల పోటీలు పెట్టారు. అందులో ఒక పోటీలో అందమైన ఒక లోకల్ మోడెల్‌ని సెలెక్ట్ చేసి ఆమెని ఇండియాకి రమ్మన్నారు. ఆ టైంలో సదరు మోడెల్‌కి చాలా కాంట్రాక్టులు దక్కాయని అప్పట్లో వినికిడి. నిజం పెరుమాల్లకెరుక.

సదరు మోడీగారు, ఈ పండగలో వున్న సమయంలో అఖండభారతావని తన పాలకులను ఎన్నుకునే అత్యంత ఖరీదైన భారీ ప్రక్రియను ముగించింది. ఈ ప్రక్రియలో అంతవరకు ఐక్యరాజ్యసమితిలో పనిచేసి, ఒక పర్యాయం ఐక్యరాజ్యసమితి అధ్యక్షునిగా పదవి వెలగబెడదామనుకుని, సాటి ఆసియా ఖండపువాని చేతిలో ఓడి ఇంటిదారి పట్టిన థరూర్ అనే మరో పెద్దమనిషి ఇంటికి రాగానే, ఉజ్యోగం మానేసి, రాజకీయాల్లోకి దిగి, అంతర్జాతీయ దౌత్యంపై తనకున్న అనుభవాన్ని చూపి ఒక సీటు కొట్టేసాడు. దేశవ్యాప్తంగా ఆపార్టీకి వచ్చిన స్పందనలో కలిసిపోయి జాతీయ దిగువసభలో సభ్యుడు కూడా అయిపోయ్యాడు. ఎలాగూ ఎన్నికల్లో గెలిచాడు కదా, అంతర్జాతీయ దౌత్యంలో ఉన్న అనుభవాన్ని వాడుకుందాం అని ఆశించిన ప్రభుత్వపెద్దలు ఇతనికి విదేశీ వ్యవహారాల శాఖలో ఒక సహాయపదవిని ఇచ్చి సరిపెట్టేసారు. ఈ పెద్దమనిషి అంతర్జాతీయ సమితిలో ఏమి దౌత్యం వెలగబెట్టాడో తెలీదు కానీ, ఈయన మంత్రి అయినదగ్గర్నించీ ప్రభుత్వానికి ఏదో ఒక తలనొప్పి క్రమంతప్పకుండా తేవడం మొదలుపెట్టాడు.

సదరు మోడీగారు ఎన్నుకుని రమ్మన్న సుందరి భారతగడ్డపై కాలుమోపింది. ఆ విషయం చాలా మీడియా హౌసులు ప్రచారం చేసాయి. కానీ, ఆ తర్వాత ఆ సుందరి విషయం పక్కన పెట్టేసాయి. తెలియవచ్చిన విషయం ఏమిటంటే, సదరు సుందరి చాలాకాలం (అంటే ఎంతకాలమో నాకు కూడా తెలియదు, కాని వీసా గడువు ముగిసేంతవరకు) ఇక్కడే వుంది. ఎక్కడ వుందో, ఎలా వుందో విజ్ఞ్యులకు నేను చెప్పాల్సిన పనిలేదు. వీసా గడువు ముగిసేముందు, సదరు మోడీగారు ఆ అమ్మణ్ని మరికొంత కాలం ఇక్కడే అట్టిపెట్టుకోడానికి వీసా పొడిగించుకోవాలని అనుకున్నారు. అనుక్కున్నదే తడవుగా ఢిల్లీలో వున్న సదరు మంత్రిత్వశాఖ వారిని కలుద్దామని వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లాక చూస్తే వున్నది థరూర్ అనే పెద్దమనిషి. ప్రభుత్వంలో సభ్యుడైన ఆయనకి, ప్రైవేటు వ్యాపారి అయిన ఈయన ఒక వినతిపత్రం సమర్పించి పని చేసి పెట్టమన్నాడంట. దానికి ఆ మంత్రివర్యులు అభయహస్తం ఇచ్చి పంపారు. మంత్రిగారి ఆశీర్వాదం దొరికింది కదా అని ప్రశంతంగా వున్న మోడీగారికి ఒక పెద్ద షాక్ తగిలింది. అది సుందరమోడల్‌కి వీసా దొరకలేదు అని. ఇద్దరికీ ఇక్కడే చెడింది అని ఇప్పట్లో వినవస్తోంది.

చెడితే చెడింది. ఏదో ప్రపంచానికి తెలీని మ్యాటర్‌లో కొట్టుకుంటే ఏ గొడవా వుండేది కాదు. కానీ, చివరొకొచ్చి ఇద్దరూ ప్రపంచమంతా పేరు తెచ్చుకున్న ఆటల పండగ మీద గొడవ పెట్టుకున్నారు. ఎనిమిది కంపనీలతో మొదలైన ఆటల పండుగను పది కంపనీలకి పెంచి సంపాదన పెంచుకుందామనుకున్నాడు మన మోడీ. ఏదైనా ఒక్క కంపనీలోనైనా వాటా పెట్టుకోవాలనుకున్నాడు మన థరూర్. అనుకున్నదే తడవుగా సొంత రాష్ట్రంలో పెడుతున్న టీముని కొందామనుకున్న ఒక కన్సార్టియంతో మాటలు కలిపాడు. మనోడి రాజకీయ ప్రోద్బలం దక్కుతుందన్న ఆశతో కొన్ని కోట్ల వాటా అప్పనంగా ఇవ్వడానికి వాల్లు కూడా ముందుకొచ్చారు. (కేవలం రాజకీయ లబ్ది కోసమేనో లేక ఇంకా ఎవైనా డీల్సు వున్నాయొ తెలీదు మరి). అది కూడా డైరెక్టుగా తీసుకుంటే కాషాయ పార్టీ, ఎర్రపార్టీలు గొడవ చేస్తాయని అనుకున్నాడో ఏమో గానీ, ఎక్కడో ప్రశంతంగా బతుకుతున్న గర్లుఫ్రెండుని తీసుకొచ్చి, తన పేరుమీద వాటా ఇప్పించుకొని ఈరొంపిలోకి లాగేసాడు. ఇక్కడ తప్పు ఒకరకంగా చెప్పాలంటే మోడీదే. రాజకీయనాయకుడికి తెలిసినట్టుగా ప్రతీకారం తీర్చుకోవడం వ్యాపారికి తెలీలేదు. ఎలాగైనా థరూర్ పరువు తీయాలి ఆలోచనతో కొచ్చి టీం గురించి పబ్లిక్‌గా బయటపెట్టి సొంత కొంప కూడా కూల్చుకున్నాడు.

మొత్తంగా ఈ వ్యవహారం నుంచి రాజకీయనాయకులు, బిసినెస్‌మాన్‌లు నేర్చుకోవాల్సిన నీతి ఒకటి వుంది. రాజకీయం చేసేవాడికి వ్యాపరం చేసేవాడి తోడు వుండాలి. వ్యాపారం చేసేవాడికి రాజకీయనాయకుడి అండ వుండాలి. అప్పుడే ఇద్దరు కలిసి దేశాన్ని దోచేయగలుగుతారు. వాళ్లిద్దరూ కొట్టుకుంటే ఇద్దరూ రచ్చకెక్కి పరువు పోగొట్టుకోవడం తప్పించి వచ్చే లాభం మాత్రం నిండుసున్నా.

07 ఏప్రిల్, 2010

అరిటిపండు - కోవా

చిన్నప్పుడు నేను అరటిపళ్లు, కోవా బాగా తినేవాన్ని. ఇంటి ముందు అరటిపళ్ల బండి వచ్చినా, కోవా అమ్మేవాడు వచ్చినా మా అమ్మకు సినిమా....! కొనేవరకూ ఆగేవాన్ని కాదు. ఇప్పటికీ మా అమ్మ అంటూవుంటుంది... చిన్నప్పుడు ఎటైనా తీసుకెళ్తే, అరటిపళ్ల బండి కనిపించడం పాపం, అక్కడినుంచి అడుగు ముందుకు వేసేవాన్ని కాను అని. అలా ఇంటిముందు బండి వచ్చినప్పుడు, కోవా అమ్మేవాడు తట్ట పట్టుకొచ్చినప్పుడు నేను చేసే గోల భరించలేక మా అమ్మ ఒక ఐడియా వేసింది. అదే పరిచయాలు. నాకు ఒక అరటిపళ్ల బండి వాడిని, కోవా అమ్మేవాడిని చూపించింది. అప్పటినుంచి వాళ్లు ఎక్కడ కనిపించినా తీసుకోవచ్చని చెప్పింది. మామూలుగానే మనం సెంటీమీటర్ చనువిస్తే కిలోమీటర్ దూసుకెళ్లే టైప్ కాబట్టి ఇంక దున్నేసుకున్నా.

స్వతహాగా నాకు చిన్నప్పటినుంచీ వున్న టాలెంటు వల్ల ఫ్రెండ్ సర్కిల్ చాలా పెద్దగా వుండేది. నా లైఫ్‌లో ఇప్పటికీ మారనిది ఎదైనా వుందీ అంటే అదే.... అతిశయోక్తి కాదు గానీ, ఎందుకో నాకు ఫ్రెండ్సు ఎక్కువ. రీసెంటుగా మా అమ్మకు ఒక జ్యోతిష్యుడు కూడా చెప్పాడంట... మీ వాడు ఎక్కడ ఎలా వున్నా ఎప్పుడూ పక్కన ఓ నలుగురు తోడు వుంటారు అని. ఇప్పటికే మ్యాట్టర్ అర్హమై వుంటుంది మీకు, ఈ ఉపోద్ఘతమంతా ఎందుకు ఇచ్చానో. యూ ఆర్ రైట్. అమ్మ చూపిన అరతిపళ్ల బండి వాడు కానీ, కోవా బుట్ట వాడు కానీ వూర్లో ఎక్కడ కనిపించినా నేను కుమ్మడం మొదలెట్టేవాన్ని. మనం కుమ్మడమే కాకుండా, పక్కన వున్న మిత్రబ్రుందాన్ని కూడా కావలిసినంత కుమ్మమని ప్రోత్సహించేవాన్ని. ఇక్కడ రెండు విషయాలు చెప్పుకోవాలి.

ఒకటి, అరటిపళ్ల బండి వాడు, కోవా బండి వాడు ఇంటికెల్లి పైసలడిగినప్పుడు ఎంత బిల్లు ఇస్తారో ఆలోచించకపోవడం.
రెండు, వాడు ఇచ్చే బిల్లు గురించి ఇంట్లోవాల్లు నన్ను అడుగుతారని ఆలోచించకపోవడం.

అసలు చెప్పాలంటే, వాళ్లు ఇంటికి వెళ్లి పైసలడుగుతారని కూడా అప్పట్లో నాకు తెలిసేది కాదు. ఫ్రీగా ఇస్తున్నారనుకునేవాన్ని. అప్పట్లో నేను అంత అమాయకున్ని. మొదట్లో అంతా బాగానే నడిచింది. నేను తింటూ పోయేవాన్ని. మా అమ్మ డబ్బులు ఇచ్చేసేది. నాకైతే ఇంక జీవితాంతం ఇలా ఫ్రీగా అరటిపళ్లు, కోవా తినేస్తూ బతికేస్తాననిపించింది. కానీ నా ప్లానింగ్ అంతా అనుకోకుండా ఒకరోజు గాల్లొ కలిసిపోయింది. కారణం, అరటిపళ్లబండి వాడు ఆరోజు మా అమ్మ దగ్గరికి కాకుండా మా నాన్న దగ్గరికి వెళ్లి డబ్బులు అడగడమే. వాడు డబ్బులు అడగడం పెద్దగా దెబ్బెయ్యలేదు కానీ, అలవాటు ప్రకారం మా నాన్న వాన్ని లెఖ్ఖ అడిగాడు. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎన్నెన్ని తిన్నాడో లెఖ్ఖ చెప్పమన్నాడట. దానికి వాడు నీల్లు నమిలాడంట. మామూలుగా అయితే ఆ సిట్యుయేషన్‌లో మా నాన్న వాడికి డబ్బులు ఇచ్చేవాడు కాదు. కానీ ఏదో ఆ సమయానికి అక్కడ మా మామయ్య వుండడం వానికి కలిసి వచ్చింది. వాన్ని లెఖ్ఖ అడగడం ఆలస్యం, మా మామయ్య మా నాన్నతో వాడేమన్నా వందలు వేలు అడిగాడా, యభయ్యే కదా, ఇచ్చి పంపక వానితో లెక్కలెందుకు అని అడిగిన వెంటనే ఇప్పించేసాడంట. అంతే, ఇంక ఇంటికి రాగానే, ముందు నన్ను పిలిచి ఎందుకు తిన్నావ్ అని మొదటి ప్రశ్న. ఆ బండి వాళ్లని ఎందుకు చూపావ్ అని మా అమ్మకు రెండో ప్రశ్న. అలా హార్డ్ క్వష్చనింగ్ తర్వాత నాకు ఒక డెడ్లీ వార్నింగ్ కూడా వచ్చింది. ఇంకోసారి బండి కనపడగానే పళ్లమీదకి దండయాత్ర చేస్తే............ అందరం ఆ వయసు నుండి వచ్చిన వాల్లమే కదా, ఎమన్నారో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా!!!