10 ఏప్రిల్, 2014

హెచ్చరిక

నేతలకు, సామాన్యులకు జరగబోతున్న యుద్దం
నోటుతో వాళ్ళు, వోటుతో మనం..
విజయం మనదే కావాలి!!

జీవితాలు హైటెక్కు చేస్తామని జిమ్మిక్కులు చూపిస్తారు
పచ్చ కాగితాలు ఎగ జల్లుతారు, కులాలు, మతాల మద్య పొగ పెడతారు
మందు పోసి మైకంలో ఉంచుతారు, సందు చూసి బొంద పెడతారు
ఈ తుచ్చ ప్రలోభాలకు లొంగితే,
బతుకు మారదు, నీ నోటికి మెతుకు దొరకదు..

రిజర్వేషన్స్ అని, వేల కోట్లనిధులని,
రాజధానులు నిర్మిస్తామని,
రామరాజ్యం తెస్తామని,
వెనుకబాటు వాళ్ళకి పదవులిస్తామని
బుగ్గలు నిమురుతారు, ముద్దులు పెడతారు,కాళ్ళూ పట్టుకుంటారు
ఆ తర్వాత "చేతులు కడుక్కుంటారు"

చరిత్ర పాఠం చెప్తూ ఒకరు, 
చరిత్ర మారుద్దామంటూ ఒకరు,
తాతలు తండ్రులు బంధువర్గముల
చరిత్ర వాసన చూపే నేతల మంద
నేతలు ఎన్నికలప్పుడు రంగులు పూస్తారు.
పదవులొచ్చాక రంగులు మారుస్తారు !!

నీ కడుపు కొట్టి మేత మేసే నేతలొస్తారు,
బతుకు రాత మారుస్తామంటూ కోతలు కోస్తారు.
తెప్ప దాటాక, వాత పెడతారు.
అంచేత..!!
మన ఆయుధాన్ని విచక్షణతో వాడుకుందాం,
మన రాత మనమే మార్చుకుందాం.
మన వోటుని సరిగ్గా వాడుకొంటే,
బతుకులు మారాలని దేవున్ని వేడుకోవాల్సిన అవసరం ఉండదు

-- నా బాల్య స్నేహితుడు అమిత్ సౌజన్యంతో