18 మే, 2010

అనుకోని యాత్ర - ఊటీ

మేము ఇంజినీరింగ్‌లో చేరాక, ఫస్ట్ సెమిస్టర్‌లోనే కొందరికి బండ్లు వచ్చాయి. సెకండ్ సెమిస్టర్‌కి వచ్చేసరికి బండ్లు పెరిగాయి. అదిగో, అప్పుడు అనుకున్నాం... అందరం కలిసి ఒకసారి బండ్లమీద ఊటీ వెళ్లి వద్దాం అని. అలా అనుకుంటూనే రోజులు గడిచిపోయాయి. రోజులు నెలలు, నెలలు ఏళ్లు అయ్యాయి. రెండేళ్లు గడిచాక, ఒక హోళీనాడు అందరం సరదాగా హోళీ ఆడుకున్నాం. ఏం సరదానో ఏమో, హోళీ అన్న విషయం మరిచిపోయి పొద్దెక్కేదాకా పడుకున్నందుకు, లేపుకొచ్చి నెత్తి మీద గుడ్డు కొట్టి కిందనుంచి మన్ను తీసి పోసారు... దుమ్మంతా తలలోంచి పోవడానికి గంట కష్టపడి మూడు శాంపూ సాచెట్లు అరగదీస్తే కానీ దారికి రాలేదు. అది పక్కన పెడితే, అలా ఆడుకుని స్నానాలు అయ్యాక అందరం కలిసి లంచ్ కి వెళ్లేముందు అలవాటు ప్రకారం ఒకచోట కలుసుకున్నాం. అక్కడినుంచి మెస్‌కి పోతుండగా ఎవడో అన్నాడు.. ఎటైనా ట్రిప్ వేద్దామురా అని... అక్కడ మొదలైంది, మా పరిశోధన. భోంచేసి వచ్చి అందరం కలిసి ఒక గ్రూప్ డిస్కషన్ పెట్టుకున్నాం, ఎక్కడికి వెళ్దాం అని. మొదలు మైసూరుకు 80 కిలోమీటర్ల దూరంలో వున్న గోపాలస్వామి బిట్ట అనుకున్నాం. చూస్తే మంది ఎక్కువ, బండ్లు తక్కువ వున్నాయి. సరే, కొందరు ఏ సుమోనో క్వాలిసో మాట్లాడుకుని పోతే సరిపోద్ది అనుకున్నాం. అంతలో మా రూమ్మేటు కొందరు బండ్లమీద, ఇంకొందరు కార్లో పోవడం ఏంటి, పోతే అందరం ఏ స్వరాజ్ మజ్దానో పట్టుకుపోతే సరిపోద్ది కదా అన్నాడు. ఆ పెద్ద బండేదో మట్లాడుకునేటట్టయితే, ఈ బిట్ట దాకానే ఎందుకు, ఇంకొచం ముందుకు పొయ్యొద్దాం అనుకున్నాం. అలా ప్లాన్ చేసి, మరుసటి రోజు పొద్దున్నే అందరం కలిసి ఊటీ, కొడైకనాల్ చూసొద్దామని బయలుదేరాం.

మాకు దొరికిన డ్రైవర్ పేరు మైఖేల్ షుమేకర్ (అది మేము పెట్టిన పేరు). వాడు పొద్దున మైసూర్‌నుండి బయలుదేరి, 135 కిలోమీటర్ల దూరంలో వున్న ఊటీ కి తీసుకెళ్లడానికి 6 గంటల పైనే తీసుకున్నాడు. టైం తీసుకున్నాకూడా ఆ జర్నీని మేము బాగా ఎంజాయ్ చేసాం. ఎప్పుడో చూసిన తిరుపతి ఘాట్‌రోడ్డు, ఎప్పుడూ తిరిగిన చాముండి బిట్ట రోడ్డు తప్ప పెద్దగా ఘాట్‌రోడ్డులు తెలీని మాకు, ఒక్కసారిగా అంతపెద్ద కొండలు, మలుపులు తిరుగుతూ వెళ్లే రొడ్డు, దానికి తోడు చుట్టూ టీ తోటలు.. స్వర్గం కల్లముందు వున్నట్టు అనిపించింది. అలా ఎంజాయ్ చేస్తూ డైరెక్టుగా ఊటీలో దొడ్డబిట్ట కి వెళ్లిపోయాం. అక్కడ చూస్తే ఏముంది... మేఘాల పైన మేమున్నాం. గాళ్లో తేలిపోవడమంటే ఇదేనేమో అనిపించింది. దానికి తోడు, అప్పుడు అక్కడ చిన్నగా వాన, చలి. మొదలు చూస్తే అక్కడంతా ఫ్రెష్ క్యారట్, మసాలా అద్దిన శెనగలు గట్రా అమ్ముతున్న కౌంటర్లు కనిపించాయి. కానీ, టికెట్టు కొని పీక్‌పాయింటు చూద్దామని వెళ్తే అక్కడ ఒకడు చాకోబార్‌లు అమ్ముతున్నాడు. ముందు వాన్ని చూసి, ఇక్కడ ఐస్‌క్రీములెవడు తింటాడురా పిచ్చిప్యూన్ అనుకున్నా. విధి వక్రించి ఎవడో తింటూ కనిపించాడు. జిహ్వచాపల్యం వూరుకుంటుందా, నాకూ కావాలని గోల చేసింది. తప్పదనుకొని కొన్నా. ఆ చలిలో ఆ చాకోబార్... కేక. ఇప్పటికీ ఎవరైనా ఊటీ వెళ్తున్నామని చెప్తే వాళ్లకి నేను దొడ్డబిట్ట దగ్గర చాకోబార్ తినమని సలహా ఇస్తా. అంతలా నచ్చింది. దొడ్డబిట్ట తర్వాత ఊటీలో పెద్దగా పొడిచిందేమీ లేదు గానీ, ఆరోజు సాయంత్రం ఊటీ నుంచి కూనూర్ వరకూ టాయ్‌ట్రెయిన్‌లో ప్రయాణం మాత్రం అద్భుతం. ఆ తరువాత నేను ఊటీకి వెళ్లిన ప్రతీసారీ ఆ టాయ్‌ట్రెయిన్ ప్రయాణం చేస్తూనేవున్నా.

కూనూర్‌లో దిగాక మా మొదటి పని, రూము వెతుక్కోవడం. రూం వెతుక్కోవడం అనే కార్యక్రమం పూర్తి అయ్యేలోపే మా వాళ్లు అసలు కార్యక్రమానికి ప్రిపేర్ అయ్యారు. అదేదో రూం కోసమే ఆగినట్టుగా, దొరికేసరికి చేతిలో కవర్లు పట్టుకొని సిద్దంగా వున్నారు. ఎనిమిదింటికి రూములోకి వెళితే, ఎనిమిది అయిదుకి గ్లాసులు నింపి సిద్దమయ్యాం. కాకపోతే, మాకు అక్కడికి, మైసూరుకి పెద్ద తేడా తెలీలేదు. మామూలుగానే అనిపించింది. ఇక ఆ మర్నాడు కూనూరు చూసుకుని కొడైకనాల్ బయలుదేరాం. దార్లోనే కదా అని మధ్యలో పళని గుడి కూడా చూసేసాం. పళని అంగానే మాకందరికి గుర్తొచ్చే విశయం ఒకటుంది. దానికి ఆద్యం మాకున్న ఒక గొప్ప ఫ్రెండు. పేరు - కిరణ్ అలియాస్ . నిజం చెప్పొద్దూ, వీడు మన తోటరాముడు గారి దినకర్ కి కజిన్ బ్రదర్. తమిళనాడు బార్డర్ కి పక్కనే వున్న వూర్లో పుట్టి పెరగడం మూలాన నాకు తమిళ్ వచ్చు అని చెప్పేవాడు. దార్లో పళనిలో ఆగిదాం అని చెప్పగానే వాడు చెప్పాడు... నేను ఇదివరకు వెళ్లాను, కొండ పైవరకు రోడ్డు వుంటుంది, బండి నేరుగా గుడి ముఖద్వారం ముందు ఆగుతుంది అని చాలా చెప్పాడు. గుడి గురించి ముందు చెప్పినవాడు కొండ పైకి నడిచి వెళ్లాలి అని చెప్పినప్పుడు పుట్టిన కంగారు వాని మాటలతో దూరం అయ్యింది కూడా.

గుడిదాకా వెళ్లాక కానీ మాకు అర్థం కాలేదు. తీరా వెళ్లి చూస్తే అక్కడ కొండపైకి వున్నది రోడ్డు కాదు... రోప్‌వే. వాడు వెళ్లి ఎవరితోనో మాట్లాడి వచ్చి నదిచి ఎక్కితే మూడు గంటలు పడుతుందంట అన్నాడు. కొండ చూస్తే చిన్నగా వుంది, ట్రై చేద్దాం అని నడిస్తే ఎక్కడానికి 30 నిమిషాలు పట్టింది. ఎమైతేనేం, దర్శనం అయ్యింది. ఆరోజు సాయంత్రం ఆరుగంటలప్పుడు కొడై చేరుకున్నాం. నాకైతే ఊటీ కంటే కొడై బాగా నచ్చింది. రూములు తీస్కొని ఫ్రెషాయ్యక వెళ్లి వూరిమీద పడ్డాం. అక్కడికి మాకేదో అక్కడ ఆ టైంలో ఏదో చూసేద్దామని గుల పుట్టి కాదు కానీ, మా పని మీద మేము వెళ్లాం(ఆ పనేంటో అర్థం అయినవాళ్లు యువతరం కింద లెఖ్ఖ). అదేంటో, కొడై బస్టాండుకి మూడు దిక్కులా ఒక అరకిలోమీటరు వెళ్లాం. కనిపించిన ప్రతీ షాపులో అడిగాం. కూల్‌డ్రింకు కావాలి అంటే ఒక్కనిదగ్గరా ఫ్రిజ్జు లేదు. ప్రతీవాడూ అదేదో చిప్స్ పాకెట్ ఇచ్చినట్టు కబ్బొర్డులోంచి తీసిస్తున్నాడు. ఇప్పుడేం చెయ్యాలా అని మేమందరం ఒక షాపు ముందు నుల్చుని మా అంతర్జాతీయ మహాసభ నిర్వహిస్తూంటే ఇదంతా పక్కన వుండి అబ్సర్వ్ చేస్తున్న ఒకాయన మమ్మల్ని పిలిచి తెలుగులో మాకు అక్కడి వాతావరణం గురించి ఒక ఐదు నిమిషాలు క్లాసుపీకి, ఇది నాచ్యురల్ కోల్డు, మీకు పనికి వస్తుంది, ఇక్కడ హీటర్లే కానీ ఫ్రిజ్జులు వాడరు అని చెప్పి పంపాడు. కూనూర్‌లో కంటే కొడైలో ఆ రాత్రి మేము బాగా ఎంజాయ్ చేసాం.

ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. నాకు తెల్లవారుఝామున వచ్చిన కలలన్నీ నిజం అవుతుంటాయి. కానీ అదేంటో, అలా ఏదైనా కల వచ్చినప్పుడు లేవాగానే అనుకుంటా... ఇది జరిగే ఛాన్స్ లేదు అనో, లేకపోతే నిజ జీవితంలో ఇది జరగకుండా చూసుకోవాలి అనో... కానీ అది జరిగేవరకూ మళ్లీ అది గుర్తుకురాదు. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, నాకు ఊటీ వెళ్లడానికి ఒక రెండు నెలల ముందు ఒక కల వచ్చింది. అందులో మా బ్యాచ్ అంతా వున్నాం. అందరం గంటకు 10 రూపాయల అద్దె పెట్టి సైకిల్లు అద్దెకి తీసుకున్నట్టు. లేవగానే అనుకున్నా... ఇండియాలో గంటకి 10 రూపాయల అద్దెతో సైకిల్ తీసుకునే రేటు రావడానికి ఇంక చాలారోజులు పడుతుంది... అయినా నా రూమ్మేటు(మా బ్యాచులో, కలలో వాడు కూడా వున్నాడు కదా) సైకిలు రెంటుకి తీసుకుని తొక్కే సీనే లేదు అని. కానీ, మా వూరి వాగులో నీరు లేదు, నా ఆలోచనలో అర్థం లేదు. నా తెల్లవారుఝాము కలని నిజం కాకుండా ఆపే ధైర్యం ప్రకృతి చేయలేకపోయింది. అక్కడ ఒక లేక్ వుంది. దాని చుట్టు అందమైన రోడ్ వుంది. ఆ రోడ్ మీద సైకిలేసుకుని తిరగడం కూడా ఒక అనుభవమే. అందరూ ఆ అనుభవాన్ని అస్వాదించాలని, కొందరు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు(????) అక్కడ ఆ రోజుల్లో గంటకు పది రూపాయల అద్దెపై ఇచ్చేవారు. ఇంకేముంది... "కల నిజమాయెగా, సైకిల్ నేను తొక్కగా" అని పాడేసుకుంటూ అందరం సైకిల్ తొక్కేసాం. మొత్తం ట్రిప్‌లో నేను అన్నిటికంటే ఎక్కువగా ఎంజాయ్ చేసిన ఘట్టం ఈ గంటన్నర సేపే.

అదేంటో, రిటర్న్‌జర్నీలో మా షుమేకర్‌కి మాంఛి మూడ్ వచ్చినట్టుంది... ఒంట్లో వున్న ఎనర్జీనతా కాల్లల్లోకి తెచ్చుకొని అక్సిలరేటర్ తెగ తొక్కేసాడు. ఏముంది... తెల్లారేసరికి మళ్లీ మైసూరులోకొచ్చి పడ్డాం. కానీ కమర్షియలైజేషన్ వల్ల సంభవించే పరిణామాలు ఎలా వుంటాయో నాకప్పుడు తెలిసింది. ఊటీ కమర్షియల్‌గా అభివ్రుద్ది చెందింది... ప్రతిగా అందాన్ని త్యాగం చేసింది. కానీ, అభివృద్ది తక్కువగా వున్న కొడైలో అందం, ఆనందం, ఆహ్లాదం తాండవం చేస్తున్నాయి అని.

17 మే, 2010

పెళ్లి - ఒక కన్‌ఫ్యూజన్

1995: 10వ తరగతి

పెళ్లంటే - పెద్దవాళ్లు చేసుకుంటారు. కట్నం పేరుతో డబ్బులిస్తారు. పెళ్లాం వస్తుంది... పనులు చేసి పెడుతుంది. కొత్త బంధువులు, కొత్త బంధుత్వాలు. బామ్మర్ది వస్తాడు. ఏ పని చెప్పినా చేసిపెడతాడు.

2000: ఇంజినీరింగ్ స్టుడెంట్

పెళ్లంటే - చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, వాళ్ల చదువులు, వాళ్ల పిల్లలు, మనువలు మనువరాల్ల చదువులు, చావు. ఇదీ జీవితం. మన మొహానికి అమ్మాయిలు పడే ఛాన్స్ కనుచూపుమేరలో కనపడట్లేదు కాబట్టి, బై ఫోర్సు అయినా, పెళ్లామే మొదటి గర్ల్ ఫ్రెండ్ అవుతుంది కాబట్టి పెళ్లానికి ఐశ్వర్య రాయి కి ఉన్నంత అందం, సునీతకున్నంత చక్కని కంఠం, అదేదో పాత సినిమాలో సావిత్రికున్నంత అణకువ, ఇంకేదో సినిమాలో సౌందర్యకున్నంత సంస్కారం గట్రా గట్రా వుండాలని ఎక్స్‌పెక్టేషన్స్...!!! ఇన్ని మంచి క్వాలిటీస్ వున్న పిల్ల నిన్నే ఎందుకు చేసుకోవాలీ అని నన్ను ఎవరూ అడగలేదు కాబట్టి... నేను కూడా ఆన్సర్ రెడీ చేసుకోలేదు.

2005: ఉద్యోగ ప్రయత్నం ("బేవార్సు"కి పర్యాయ పదం)

పెళ్లంటే - బరువు బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీ, స్థిరత్వం, కుటుంబం, ఆనందం, జీవనసారం, తొక్క తోలు లాంటి ఏవో అర్థం తీలీని, సామాన్య మానవునికి అర్థం కాని ఒక జఢపదార్థం. కానీ, సంపాదన లేని మొగుడ్ని ఈ రోజుల్లో ఏ ఆడదీ గౌరవించదనీ, పెళ్లనేది తప్పించుకోలేని ఒక సామాజిక అవసరం కాబట్టి ఎంత తొందరగా సంపాదన మొదలు పెడితే అంత మంచిది అని ఒక ఫీలింగ్.

2010: ఎలిజిబుల్ బ్యాచిలర్

పెళ్లంటే - ఇది తర్వాత మాట్లాడుకుందాం.

ఇన్ని రోజులు కలిసున్న ఫ్రెండ్సుకి పెళ్లిల్లయిపోయాయి. పెళ్లిల్లు అంటె, తప్పుగా అర్థం చేసుకోవద్దు. మనిషికి ఒక్కటే అయ్యింది ప్రస్తుతానికి. పెళ్లేం ఖర్మ... ఒకరిద్దరు తండ్రులు కూడా అయ్యారు. అయ్యారు కానీ, స్వాతంత్ర్యం పోగొట్టుకున్నారనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. అర్ధరాత్రి, అపరాత్రి ని తేడా లేకుండా గాలికి తిరిగిన వాళ్లు ఇప్పుడు పట్టపగలు కూడా ప్రశాంతంగా తిరగలేకపోతున్నారు. ఏదైనా పని మీద బయటికి వెళ్తే, వచ్చేముందు ఎదో మాటవరసరకి గంటలో వస్తామని చెప్తారా... గంటా పది నిమిషాలవరకూ బాగానే వుంటుంది... గంటంపావు కాగానే ఫోను మోగుతుంది. ఎక్కడ, ఎందుకు, ఎంతసేపు, ఏమిటి... అంటూ ప్రశ్నల వర్షం మొదలవుతుంది. అసలే హాస్టలు, ఆ తర్వాత ఇంటికి దూరంగా ఉద్యోగం పేరుతో స్వాతంత్ర్యానికి అలవాటుపడ్డ ప్రాణమేమో.... ఉస్సూరుమంటుంది.

మాటవరసకి ఈవీకెండ్‌లో సినిమాకు పోదాం అని చెప్పి, తీరా వీకెండ్‌లో ఏదో పని పడి సినిమా పోస్ట్‌పోన్ చేస్తే పాపం వాళ్ల కష్ఠాలు చెప్పుకోతరం కాదు. ఇంకో రెండుమూడు వీకెండ్లు వరసగా సినిమాలకు తీసుకెళ్లినా ఇంట్లొ గొణుగుడు మాత్రం ఆగదు. ఆ గొణుగుడుని భరించలేక, ప్రతీ వారం బయటికి తీసుకెల్లి జేబుకు పడే చిల్లు పూడ్చలేక లోపల లోపల పడే బాధ కొంచెం కాదు.

పెళ్లంటే ఇన్ని కష్టాలుంటాయని తెలీని రోజుల్లో, అంటే, మా బ్యాచ్‌లో ఎవరికీ పెళ్లి కాని రోజుల్లో.. మొడటి వాడు పెళ్లి చూపులకు వెళ్తున్నప్పుడు అన్నాడు... పెళ్లి చేసుకుంటే, రోజు ఆఫీసునుంచి వచ్చేసరికి నీ కోసం ఎదురుచూసే మనిషి వుంటుంది. అసలు ఒక మనిషి నీకోసం ఎదురు చూస్తున్న ఫీలింగే ఎంతో బాగుంటుందిరా అని అన్నాడు. కానీ, మా రూములో అలానే ఎదురుచూసుకునే వాళ్లం. ఎవనికైనా లేట్ అయితే, రూములో వున్నవాడు ఫోన్ చేసేవాడు, ఎక్కడున్నావురా ఎప్పుడొస్తావురా అని... మరీ లేట్ అయ్యేలా వుంటే తప్పించి, అందరూ వచ్చాక అందరం కలిసే మొదలుపెట్టేవాళ్లం... తినుడైనా, తాగుడైనా, తిరుగుడైనా!!! కానీ ఈ ఎదురుచూపుల ఫీలింగ్ ఇన్ని రోజులు అనిపించలేదెందుకు చెప్మా? అని డౌటొచ్చింది. కాని వాడిని అడగలేదు... అసలే ముక్కోపి, అడిగితే ఎలాంటి ఆన్సర్ చెప్తాడో అని భయమేసి ఆగిపోయ్యా.

అసలిదంతా ఎందుకు మొదలెట్టానంటే, మా బ్యాచులో చాలామందికి పెళ్లిల్లయిపోయాయి. అఫ్‌కోర్స్, నాకింకా ఈ కష్టాలు మొదలవలేదనుకోండి. కానీ, నాకు అదే పెద్దకష్టం అయ్యిపోయింది. అసలే, ఈ మధ్యే లోను తీస్కొని మరీ ఇల్లు కొని అప్పులపాయ్యానేమో, ఈ అప్పుల మధ్య పెళ్లి అవసరమా అని నాకొక అనుమానం. కానీ అదో పెద్ద సమస్యే కాదన్నట్టు అందరూ సలహాలూ. ఈ మధ్య ఎవడు కలిసినా, ఎవనితో ఫోనులో మాట్లాడినా అటోమాటిగ్గా టాపిక్ నా పెళ్లి దగ్గరికి పోతోంది. మొన్న ఇలాగే ఒకడు ఫోన్‌చేసాడు. వాడేదో నా పెళ్లి ముహూర్తం కనుక్కోడానికే చేసినట్టు, ఫోన్ ఎత్తగానే పెళ్లెప్పుడురా అన్నాడు. టాపిక్ మార్చరా అంటే, ఇప్పుడు నేను మారుస్తా గానీ వచ్చే నెలలో మీ బంధువులందరూ గెట్-టుగెదర్ వుందన్నావుగా... అక్కడ అందరూ అడుగుతారు, వాళ్లకేం చేప్తావ్ అంటూ ఒక డౌటు లేపాడు. ఇప్పుడు నాకున్న సమస్య పెళ్లి కాదు, పెళ్లెప్పుడు అని అడుగుతున్న బంధువులకు, ఫ్రెండ్సుకు సమాధానం... నాకిన్ని కష్టాలు వస్తాయని కలలో కూడా అనుకోలేదు...:-( ఇప్పుడు కూర్చుని అందరికీ చెప్పాల్సిన సమధానం గురించి ఆలోచించాలి... ఏం చెప్పాలో ఎనీ ఐడియా...?!?!?!?!

07 మే, 2010

మన కోరిక నెరవేరేనా...!!!?

ఉజ్వల్ నికం - ఒక గొప్ప న్యాయవాది. తన వాక్పటిమతో న్యాయాన్ని నిలబెట్టేవాడు... నిలబెడుతున్నవాడున్నూ! లేకుంటే ఇన్ని ప్రతిష్ఠాత్మకమైన కేసులకి ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం తన తరఫు న్యాయవాదిగా నియమించుకోవు కదా. ఈమధ్యే తెలిసింది... తన వాక్పటిమతో ఇప్పటికి వంద పైచిలుకు మందికి జీవితఖైదులూ, డజన్లమందికి మరణశిక్షలూ పడేలా చేసాడని. ఇప్పుడాయన గురించి ఎందుకు చెప్పానంటే మొన్ననే అతనొక కేసు గెలిచాడు. అదే... ముంబాయి మీద తెగబడ్డ ముష్కరులలో ఒకడైన కసబ్ తాలూకూ కేసు. అతని పేరుతోనే మొదలుపెట్టడానికి రెండు రీజన్లిన్నాయి. ఒకటి, ఈ టపాని ఒక పాజిటివ్ నోట్‌తో మొదలెట్టాలని. రెండు, కసబ్‌ని చంపాలనే సగటు భారతీయుని కోరికను తను చట్టపరంగా తీర్చే వెసులుబాటు కల్పించాడు. కానీ మన (సగటు భారతీయుని) కోరిక తీరుతుందా... లెట్ అస్ ఇన్వెస్టిగేట్. రండి, విశ్లేషిద్దాం.

కొన్ని సంవత్సరాల క్రితం, అనగా 2001లో, భారత రాజ్యాంగ వ్యవస్థకు పట్టుకొమ్మ, భవిష్యభారతానికి దిశానిర్దేశం చేసే సభాభవనాల సముదాయం - భారత పార్లమెంటు భవనంపై తీవ్రవాదుల దాడి జరిగింది. దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఐదుగురు తీవ్రవాదులూ మరణించారు. వారితోపాటు ఆరుగురు పోలీసులు (వారిలో ఒకరు మహిళ) మరియు ఒక తోటమాలి. ఆ తరువాత 2004 వరకు ఈ కేసులో చాలా పురోగతి కనిపించింది. ఈ దాడితో సంభందమున్న వారిని అరెస్టు చేసి, కోర్టులో విచారణ జరిపించడం, పట్టుకున్న అందరినీ దోషులుగా కోర్టు తేల్చడం, అఫ్జల్ గురు అనే ఒకనికి ఉరి శిక్ష వేయడం, తీర్పులపై ఉన్నత న్యాయస్థానికి వెళ్లడం, సుప్రీంకోర్టు ఉరిశిక్షను ఖరారు చేయడం... అన్నీ జరిగిపోయాయి. కేసు ఇన్ని కోర్టులు తిరిగి, ఇంత త్వరగా తీర్పు రావడం సామాన్యుడికి భారత న్యాయ వ్యవస్థ మీద నమ్మకాన్ని కొంచం పెంచాయి. ప్రతీ పౌరుడు అఫ్జల్కి పడ్డ ఉరిశిక్షని అమలుచేసే తేదీ కోసం ఎదురు చూసారు. ఒక సుముహుర్తాన, ఆ ముహూర్తాన్ని కూడా ప్రకటించారు. అక్కడినించి, సదరు ఉరిశిక్షని ఆపండంటూ మన సోకాల్డ్ సెక్యులరిస్టులు చక్రాలు తిప్పారు.

అతని భార్య 'నా భర్తకు క్షమాభిక్ష పెట్టండి మహాప్రభో' అని అప్పటి రాష్ట్రపతి కలాం అయ్యవారికి ఒక నివేదిక పెట్టుకుంది. అది మీడియా ప్రసారం చెయ్యడం ఆలస్యం, సదరు రాజకీయ పార్టీలు రంగంలోకి దిగాయి. మేధావి వర్గానికి చెందినవారు కొందరు అఫ్జల్‌ని బలి పశువుగా వర్ణించారు. కాషాయాన్ని నమ్ముకున్నవారు మాత్రం ఉన్నపళంగా ఉరితీయాలని పట్టుబట్టారు. చివరికి బంతి కలాం గారి కోర్టులో పడింది. ఆయనగారు అధ్యక్ష భవనం నుంచి పోతూ పోతూ చట్టం తనపని తాను చేసుకుపోతుంది, నేను తలదూర్చను అని చెప్పేసి వెళ్లిపోయారు. మళ్లీ ఎన్నికలొచ్చాయి. సెక్యులరిస్టులు అధికారంలోకొచ్చారు. సదరు అఫ్జల్‌గారి సెల్‌లోకి ఉష్ణనియంత్రన వ్యవస్థ కూడా అప్పుడే వచ్చిందని అప్పట్లో వినిపించింది (నిజం దేవుడెరుగు). ఇప్పటికీ అఫ్జల్ జైలులోనే AC సెల్లులో కూర్చుని కలర్ TV చూస్తూ పండగ చేసుకుంటున్నాడు. మన సెక్యులరిస్టు ప్రభుత్వాన్ని అడిగితే, మన ముసలి రబ్బరు స్టాంపు ముందు 29 అర్జీలున్నాయి. అఫ్జల్‌ది 25వది. మొదలొచ్చినవన్నీ పక్కనబెట్టి ఇది మొదలు ఎలా చూస్తారు... అందుకే మిగిలినవాటిపై నిర్ణయం తీసుకున్నాకే దీనిపై నిర్ణయం అని తెగేసి చెప్తున్నారు. ఈ లెఖ్ఖన మొదటి 24 అర్జీలు తేలేదెన్నడూ... అఫ్జల్‌ని ఉరి తీసేది లేదని ధైర్యంగా చెప్పేదెన్నడూ...!!! అయినా పార్టీ పెద్దలకుగుణంగానో, బడా వ్యాపారవేత్తలనుకుగుణంగానో ప్రయారిటీలు మారినప్పుడు లేనిది, అంతర్గత రక్షణ పేరుమీద ఈ విషయంలో ప్రయారిటీలు మార్చలేరా....? బహుశా "ఠాగూర్"లో చిరంజీవి అన్నట్టు, అన్యాయాన్ని నిలదీసినవాడిని మాత్రమే ఉరితీస్తారేమో... ఎవరికైనా ఈ విషయంమీద ఒక ఐడియా వుంటే చెప్పండి.

ఇప్పుడు కసబ్ విషయంలో కూడా ఇలాగే జరగదని ప్రజలకి నమ్మకం ఏంటి అన్నది నా సందేహం. (ఆ మాటకొస్తే నాకు కూడా నమ్మకం లేదు.) అన్నిటికంటే నాకు నవ్వు తెప్పించిన విషయం వేరొకటుంది. అది, కసబ్‌ని కోర్టు దోషిగా తేల్చిన రోజు మన కేంద్ర మంత్రి మండలిలోని ఒక మంత్రివర్య్లు ఒక మాట అన్నారు - 'ఇది పాకిస్తాన్‌కు ఒక హెచ్చరిక. ఇకనైన వారు తీవ్రవాదాన్ని పోశించడం మానుకోవాలీ వగైరా వగైరా... కానీ మన మంత్రివర్యులు అలోచించడం మరిచిందేమంటే, అఫ్జల్ విశయంలో జరిగింది చూసినతర్వాత అదే పాకిస్తాను పెద్దలకు మన ప్రభుత్వానికి అంతర్గత రక్షణపై వున్న అలసత్వం అర్థం కాదా అని. అన్నట్టు ఇక్కడో విషయం చెప్పుకోవాలండోయ్... ఇదివరకు ఇలానే కొందరిని పట్టుకొని జైలులో పెట్టి మేపితే, వాళ్లు తిన్నరగట్లేదు... కానీ బుద్ది పెరిగింది, తీసుకెళ్తే ఇంకా మంచి దాడులు చేస్తాం అని వాళ్ల పెద్దలకి కబురంపారంట. వెంటనే వాళ్లు ఒక విమానాన్ని హైజాక్ చేసి, వాళ్లని విడిపించుకున్నారు. వాళ్లలో ఒకడే, ఈ అఫ్జల్ గురు ని తయారు చేసాడనుకుంటా. ఇంకొకడు ముంబాయి లోకల్ ట్రైనులల్లో బాంబులు పెట్టించడమో ఏదో చేసాడు. చూస్తే వీళ్లిద్దరినీ కూడా ఇంకా భయంకర దాడులకు వ్యూహరచన చేసుకునేదాకా మన డబ్బులతో మేపి పంపించేటట్టున్నారే...? అయినా మన రాతే ఇలా వుంటే ఏం చేస్తాం లెండి. పదో పరకో పడేస్తే వచ్చే బుల్లెట్‌తో పోయే ప్రాణాన్ని నిలబెట్టి కోట్లు ఖర్చు పెట్టి బిర్యానీలతో మేపి, కోర్టులచుట్టూ తిప్పి, AC రూముల్లో పడుకోబెట్టి మళ్లీ మనమీద దాడులెలా చేయ్యాలో ఆలొచించమంటున్నాం... వద్దులెండి.. ఇంక రాయను.. నోటికెచ్చే మాటలను చేతిదాకా తేవడానికి సంస్కారం అడ్డొస్తోంది.

03 మే, 2010

హైదరాబాద్ ప్రయాణం

పోయిన శుక్రవారం నాడు బెంగళూరు నుంచి హైదరాబాదుకి వచ్చాను. ఆ ప్రయాణం నాకొక కొత్త అనుభవం. ట్రైన్‌లో వద్దామనుకున్న నాకు ఆఫీస్‌లో లేట్ అయ్యి ట్రైన్ మిస్సయ్యింది. ఒక ఫ్రెండు పుణ్యమా అని, KSRTCలో చివరి బస్సుకి ఒక టికెట్ దొరికింది. అసలే మూడు వారాలకి డెప్యుటేషన్ మీద వస్తుండడం, అది కూడా చివరి నిమిషంలో డిసైడ్ అవ్వడం వల్లనూ, ఆఫీసులో వున్న గొడవలన్నీ వదిలించుకునేసరికి ట్రైన్ తుర్రుమంది. సాయంత్రం వైట్‌ఫీల్డులో వున్న ఆఫీసునుండి ట్రాఫిక్‌లో పడి HSR లే-అవుట్‌లో వున్న రూముకి చేరి బట్టలు సర్దుకునేసరికి బస్సుకి టైమైందనే తొందర మొదలైంది. మళ్లీ అక్కడినుంచి మారతహళ్లి కి వచ్చి, టికెట్టు బుక్ చేసిన ఫ్రెండు వచ్చేంత వరకు ఎదురు చూసి, టికెట్ తీసుకునేసరికి... నీకు తోడుగా నేనున్నానంటూ వానొచ్చేసింది. అక్కడే నేను హీరోగా 'వానలో అభిమన్యుడు' అనే సినిమా షూటింగ్ మొదలైంది.

కార్పోరేషన్ సర్కిల్ దాటగానే అలవాటు ప్రకారం ట్రాఫిక్ జాం అయ్యింది. కొంతసేపు ఎదురుచూసా. అప్పుడర్థమైంది - ఎంతసేపు ఎదురు చూసినా బస్సు ముందుకి కదలాలంటే టైం ఎక్కువ పడుతుందీ అని. ఇంకోవైపు బస్సు టైమవుతోంది. ఇక తప్పదన్నట్లుగా, బ్యాగు మోసుకుంటూ, వానలో తడుచుకుంటూ బస్టాండుకి పరిగెత్తా. అప్పటికీ లేటయ్యాననుకోండి, అది వేరే విషయం. పదిన్నర బస్సుకోసం పది ముప్పావుకి ప్లాట్‌ఫారం దగ్గరికి చేరుకున్నా. వాన పడటం వల్లో, ట్రాఫిక్‌జాం వల్లో తెలీదుగానీ బస్టాండు మాత్రం మేడారం సమ్మక్క జాతరలాగా నిండుగా వుంది. అందులో బస్సు వుందో పోయిందో తెలీక అంతర్రాష్ట్ర సర్వీసులు ఆగేచోట ఆకొస నుండి ఈకొస దాకా తిరుగుతూ, పట్నం బోర్డేసుకున్న ప్రతీ ఐరావత బస్సునూ ఇది నా బస్సేనా అని అడుగుతూ తిరిగేసా. పదకొండుంపావుకి నాకు అర్థం అయ్యింది. నా బస్సింకా రాలేదు అని. సరే అని ఓ పక్కన నిలబడి తల తుడుచుకుంటూ టైము చూస్తే పదకొండున్నర అయ్యింది. సరే మళ్లీ ఒకసారి చూద్దాం అని మళ్లీ అంతా తిరిగితే బస్సు దొరికంది. బస్సెక్కుదామని చూస్తే బస్సు ముందు, మెట్ల మీద, ఏజిల్ లో అంతా నిలబడి వున్నారు.

బస్సు ఇప్పుడే వచ్చిందోమో, అంతా ఇప్పుడే ఎక్కుతున్నారు కాబోలు అని కొంతసేపు నిలబడ్డాను. కానీ ఎంతసేపు నిలబడ్డా ఒక్కడు కూడా కదలడే. ఇక లాభం లేదనుకుని, నేను కూడా గుంపులో దూరి అష్టకష్టాలూ పడి, మొత్తానికి బస్సు డోరు దగ్గరికి వెళ్లి చూస్తే అన్ని సీట్లల్లో జనాలు కూర్చున్నారు. అసలేం జరుగుతోందో అర్థం కాలేదు. ముందున్న పెద్దమనిషిని కదిపి పదిన్నర బస్సు ఇదేనా అడిగితే వెల్లి బోర్డుమీద సర్వీసు నంబరు చూసుకోమన్నాడు, అదేదో ఇది హైదరాబాదు బస్సు కాదు అన్నట్టుగా మొహం పెట్టి. నిజం చెప్పొద్దూ, వాని మొహం చూస్తే అది నేనెక్కాల్సిన బస్సు కాదేమో అని అనుమానం వచ్చి వెళ్లి బోర్డు కూడా చూసా. అక్కడ చూస్తే పట్నం పేరు రాసాడే కానీ సర్వీసు నంబరు కానీ, టైము కానీ ఏదీ లేదు. మళ్లీ అందరినీ తోసుకుంటూ వచ్చి, అంతకు ముందడిగిన పెద్ద మనిషిని కాస్త పక్కకు తప్పుకోమన్నా. అదేదో, నేను వాని జాగా కబ్జా చేసి అడిగితే బూతులు తిట్టినట్టు మొహం పెట్టి సర్వీసు నంబర్ చూసుకొమ్మన్నా కద సార్ అన్నాడు. అక్కడ లేదు అని నేను చెప్పకముందే, వెనకనుంచి టికెట్లు చెక్ చేసుకుంటూ వచ్చిన కండక్టరు ఇంకా రిసర్వేషన్ వున్నవాల్లు ఎవరు అని అడిగాడు. నేను టికెట్ తీసి చూపగానే లోపలికొచ్చి కూర్చొమ్మన్నాడు. ఒక రెండు నిమిషాలాగాక అర్థం అయ్యింది. సర్వీసు నంబరు చూసుకొమ్మన్నవాడితో సహా అందరూ రిసర్వేషన్ లేనివాల్లు అని.

ఒకవైపు చూస్తే అదే చివరి బస్సు. వీళ్లంతా వెళ్లి ఎదురుగా వున్న ట్రావెల్సుకి పోతే ఏ రేటు చెప్తాడో తల్చుకుంటేనే జాలేసింది. కానీ, కండక్టరుని చూస్తే ఇంకా జాలేసింది. పదిన్నరకి వెళ్లాల్సిన బస్సు, పన్నెండైనా అక్కడే వుంది. బస్సులో చూస్తే, ఒక 20 మంది, రవితేజ స్టైల్లో ఒక్కసీటు అని అడుగుతూ, దిగమని ఎన్నిసార్లు చెప్పినా దిగకుండా సతాయిస్తున్నారు. చివరాఖరికి, కంట్రోలర్ వచ్చి అందరిని కన్నడంలో తిట్టడం మొదలెట్టాక చాలావరకు దిగిపోయారు. మరి వాల్లు ఈ తిట్లు అర్థమై దిగారో, లేక వాని గొంతు వినలేక దిగారో తెలీదు. కానీ ఒక ముగ్గురు మాత్రం వాల్లకి వాల్లు 'నేను సీతయ్యా' అనుకుంటూ మొండికేసారు. పాపం, ఆ కండక్టరు బస్సు మజెస్టిక్ దాటే వరకూ దిగమని వాల్లను ఒక రకంగా ప్రాధేయపడ్డాడు. చివరికి వాల్లను బస్సులో వుంచడానికి వొప్పుకునేదాకా వొదల్లేదు. కానీ వచ్చిన సమస్యంతా ఆ ముగ్గురూ ఏజిల్‌లో పడుకోవడం. పాపం ఒకావిడ మధ్యలో బస్సు ఒకసారి ఆపమని అడగడనికి 30 నంబరు సీటు నుంచి ముందుకి రావడానికి ఒక పది నిమిషాలు కష్టపడింది. మొత్తానికి బస్సాగింది. అంతసేపు ఆ అమ్మాయి పడిన కష్టాన్ని సినిమాలాగా చూసిన ఆ రిసర్వేషన్ లేని మహానుభావుడు, అందరూ ఇక్కడే బ్రేకు తీసుకుంటే బాగుంటందని అందరికీ వినపడేలాగా తన అమూల్యమైన అభిప్రాయాన్ని చెప్పేసాడు.

కొందరు ఆ అభిప్రాయానికి లోపల తిట్టుకున్నారు. ఇద్దరు ముగ్గురు మాత్రం బహిరంగంగానే (పద్దతి ప్రకారం చెప్పాలంటే) విమర్శించారు.