మా సూరీడు చాలా తెలివైనోడు. ఒక్క తెలివైనోడే కాదు... బాగా లోకజ్ఞాణం వున్నోడు. మేధావి కూడా. వాడు ఎలాంటివాడంటే, వాడు లేకుంటే మా కాలేజ్‌డే ఫంక్షన్ కి స్టేజీ పనులు కాదు కదా, కనీసం ప్రోగ్రాములు చేసేవాళ్ల లిస్టు కూడా రెడీ కాదు. అంతలా అన్ని పనులూ నెత్తినేసుకుని చూసుకునేవాడు. సమాజసేవ అంటే వానికి పిచ్చి. చదువులో టాపర్(సరస్వతీదేవి దయవల్ల మావాడు లెక్కలని కూడా భట్టీయం వేయగలిగేవాడు). అంతెందుకు, అసలు 35 ఏళ్ల టీచింగ్ కెరీర్‌లో మా కాలేజ్ ప్రిన్సిపాల్ అలాంటి స్టుడెంటుని అంతకు ముందు చూల్లేదు. (నిజ్జ్యొం. కావాలంటే వాడు అమెరికాలో ఎమ్మెస్ చెయ్యడానికి అక్కడి యూనివర్సిటీ కి పంపిన SOP చూడండి. కింద, మా ప్రిన్సిపాల్ సంతకం, స్టాంపుతో సహా వుంటుంది.)
వానికి ఇంత టాలెంట్ ఎలా వచ్చిందా అని ఆలోచిస్తున్నారా.....? కష్టపడకండి. నేను చెబుతా. వాడు 1వ క్లాసులో రేడియో విప్పి చూసాడు. 3వ క్లాసులో టెలివిజన్ సెట్టు కూడా విప్పేసాడు. (నిజ్జ్యొం, ఇది కూడా SOP లోనే చూసా). మావాడు జీవితంలో సాధించిన మొదటి ఘనత, 5వ క్లాసులో కంప్యూటర్ ని విప్పడం. (బహుశా, ఇక్కడే దొరికాడనుకుంటా. లేకపోతే, 1990లో పిల్లలు పీకి పందిరేసేటన్ని కంప్యూటర్లు ఇండియా లో వున్నాయా అని). ఇంతటి మేధావి కాబట్టే, ఇంజినీరింగ్ ఆఖరిఏడు లోకి రాకముందే భవిష్యత్తుకు దిశానిర్దేశం కానిచ్చాడు. అమెరికా లొ ఎమ్మెస్ చేసి, వీలయితే పీ హెచ్ డీ చేసి, వానంత తెలివి వున్న వాళ్లందరినీ అక్కడికే లాగేసుకుని, ఆ పాప్యులారిటీ తో అక్కడే రాజకీయాల్లోకి దిగి, ఏ సెనేటరో అయిపోయి ఇక్కడి ఈనాడు పేపర్లో పడాలని ప్లాన్ చేసాడు. కానీ, పాపం. వీడు అప్లై చేసుకున్న ఏదో యూనివర్సిటీ వాడు మనవాడి అతితెలివిని పట్టేసాడు. పెట్టేసినోడు పట్టేసినట్టు వూరికే వుండకుండా, ఏదో ఘనకార్యం చేసినవాడిలా ఇందులో నిజమెంత అంటూ మా ప్రిన్సిపాల్ కి ఓ లెట్టర్ రాసి పడేసాడు. ఇక్కడే, పాపం, మా వాడి (డామిట్)కథ అడ్డం తిరిగింది. ఇంకేముంది... కాలేజీ ప్రిన్సిపాల్ పుణ్యమా అని, దేశం దాటి పోవాల్సిన ఒక అతితెలివి మేధావి ఇంజినీరింగ్ పూర్తయితే చాలు అని వీసా ప్రయత్నాలు ఆపేసాడు.
బోస్టన్ లో సెనేటర్ కలలు కన్న ఒక యువకిషోరం, బెంగుళూరులో సాఫ్ట్‌వేరులో సెట్టిల్ అయ్యాడు. దేశంలో అతితెలివిపరుల కౌంటు ఒకటి పెరిగింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి