27 జూన్, 2011

కత్తిలాంటి సినిమా 180 (ఇది తల తినేసే కత్తి)

విధి విచిత్రమైనది, బలి బాధాకరమైనది. బలవ్వాలని విధి గీత గీస్తే మేకని ఏ మేకల దేవుడూ కాపాడలేడన్నది క(ఖ)ర్మ సిద్దాంతం. ఇది మనుషులకి కూడా వర్తిస్తుందని అదేదో పురాణంలో వుందని ఆయనెవరో భక్తి ఛానెల్లో పోయిన అమావాస్య రోజు అర్ధరాత్రి ప్రోగ్రాంలో చెప్పగా విన్నట్టు ఈరోజు మధ్యాహ్నం కునుకు తీసినప్పుడు కల వచ్చింది. "యెవడ్రా వీడు అర్థం పర్థం లేకుండా వేదాంతం వాగుతున్నాడు...???" అని తిట్టుకున్నా సరే, ప్రస్తుతానికి ఇలా పిచ్చి వాగుడు వాగడం తప్ప నాలుగు మంచి మాటలు రాయడానికి కళ్లుగానీ, వేళ్లుగానీ సహకరించట్లేదు.

అదేదో సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం చెప్పినట్టు "కాలం గాలమేస్తే సముద్రంలో ఫిష్షు స్టార్ హోటల్లో డిష్షు అయ్యిందట". మొన్న శనివారం కాలం గాలమేసింది. పొద్దున 11 దాకా సముద్రంలో ఫిష్షులాగా దర్జాగా బతికిన నేను మధ్యాహ్నానికి నక్షత్రాల హొటలో, రోడ్డు పక్కన కబాబ్ సెంటరో తెలీలేదు కానీ, ఏదో ఒక చోట డిష్షు మాత్రం అయిపోయా. ఇంతటి విపత్కర పరిస్థితిలోకి నేను నెట్టబడటానికి కారణం మా యావిడ. తను సిద్దార్థ ఫాన్ కాకపోయినా, నేను నిత్య మీనన్ కి కానీ, ప్రియా ఆనంద్ కి కానీ కనీసం ఎయిర్ కూలర్ కూడా కాకపోయినా, శనివారం పొద్దున ఇంటిపక్కనున్న మల్టిప్లెక్సులో 180 సినిమా చూసి తీరాసిందేనని శుక్రవారం పొద్దున నన్ను ఉపవాసం వుంచి మరీ తీర్మానించేసింది. ఎంతైనా కొత్తగా పెళ్లైంది కదా, కొత్త పెళ్లాన్ని నిరుత్సాహ పరచడం ఎందుకని అత్యుత్సాహం వల్లనో, శనివారం కూడా నాతో ఉపవాసం చేయిస్తే ఆదివారం ఎక్కడ ఆస్పత్రిపాలు కావాల్సి వస్తుందో అన్న భయం వల్లనో, నిత్య మీనన్ ని చూసి తరిద్దామనే ఆశ వల్లనో తెలీదు కానీ, అన్నా హజారే ముందు కాంగ్రేసు వాళ్లలాగా డబుల్‌గేములాడకుండా బుద్దిగా తన డిమాండ్లకి వొప్పుకుని తల వంచి మానిటర్‌లోకి చూసి టికెట్లు బుక్ చేసా. శనివారం ఉదయం 11 గంటల ఆటకి నా మెదడు బ్లాంకైపోవాలని అలా డెసిషన్ తీసుకోబడింది.

ఇక సినిమాలోకొద్దాం... టైటిల్సు పడుతూంటే హీరో డల్‌గా కాశీలో బోటుయాత్ర చేస్తాడు. గంగలో మునిగి తేలాక వొడ్డుకున్న సాధువు నూరేళ్లూ బతకమని దీవిస్తే ఓ పిచ్చి చూపు చూస్తాడు. రెండు నిమిషాలయ్యాక ఓ చిన్నపిల్లాడిగురించి నోటి మాటకి, ముఖ కవళికలకి సంబంధం లేకుండా ఒక ముసలాయన చెప్పిన మాటలతో టైటిల్సు ముగుస్తాయి. ఇదంతా కథకి ముందుమాట లాంటిదన్నమాట. కాశీలో కలిసిన బుడ్డోడు ఒక్క క్షణంలో మన హీరో ఆలోచనా విధానాన్నే మార్చేస్తాడు. ఆ కొత్త థాట్ ప్రాసెస్‌ని వంటబట్టుచ్చుకున్నా హీరోగారు, బుడ్డోడి పేరు పెట్టుకుని రాజధానికి చేరుకుని 20 సందులు, 40 గొందులు తిరిగేసి ఒక పేపర్ బాయ్ సహాయంతో ఒక ఇల్లు అద్దెకు తీస్కొని ఆరు నెలలపాటు ముందే రెంటు ఇచ్చేసి దిగిపోతాడు. కనిపించిన ప్రతీవాళ్లకూ సాయం చేసేస్తూ వుంటాడు. అలా సాయం చేస్తూ నిత్య మీనన్‌తో దోస్తీ చేస్తాడు. తర్వాత ఇంటి ఓనర్‌కి కూడా సాయం చేస్తాడు. ఫైనల్‌గా నిత్య హెల్పుతో పేపర్ బాయ్‌లందరికీ చదువుకునే ఏర్పాటు చేస్తాడు. ఇదే టైములో నిత్య మేడంగారు హీరోకి ప్రొపోజ్ చేస్తే ఏమీ చెప్పకుండా ఊరొదిలి వెళ్లిపోదామని డిసైడ్ అయ్యి వెళ్లి బస్ ఎక్కితే, దాన్ని ఫాల్లో చేస్తూ అక్సిడెంట్ చేస్కొని నడ్డి విరగ్గొట్టుకుని హాస్పిటల్ బెడ్డెక్కుతుంది. తనని అమెరికా తీసుకెళ్లి ఒకప్పుడు హీరో డాక్టర్‌గా పని చేసిన హాస్పిటల్‌లో ఆపరేషన్ చేయించి బతికించడం మూలకథ.

దీనికున్న ఒకే ఫ్లాష్‌బ్యాక్ ని ముక్కలు ముక్కలు చేసి తీన్‌మార్ తరహాలో చూపించాడు. అందులో సిద్ధార్థకి ప్రియా ఆనంద్‌తో లవ్వు, మ్యారేజీ, శోభనం అన్నీ అయ్యాక, మనోడికి ప్రేమాభిషేకంలో అక్కినేనికి వున్నట్టు మందులేని క్యాన్సర్ వుందని తేలడం, మనోడి ముందు నీగ్రో వేషంలో చావు కనబడటం, చస్తున్నానని పెళ్లాన్ని భయపెట్టడం, కంగారులో ఆ పిల్ల ఏమన్నా దానికి పెడర్థాలు అర్థం చేసుకుని సతాయించడం, ఇత్యాది కొన్ని సీన్ల తర్వాత పెళ్లానికి చచ్చాననే బిల్డప్ ఇచ్చి వచ్చి కాశీలో మునగటం.... ఇదీ కథ. సినిమా మొత్తమ్మీద ఆకట్టుకున్నది ఫొటొగ్రఫీ. చాలా బాగుంది. ప్రథమార్థం పర్లేదనిపించినా ద్వితీయార్ధం మాత్రం టార్చర్ చూపించాడు. ఎంతసేపూ ఏడుపులూ పెడబొబ్బలూ. కొంత సేపైతే హీరో మరీ ఆడవాళ్లలాగా (స్త్రీ లోకం క్షమించాలి) నస పెట్టినట్టు అనిపిస్తుంది. దీనికి తోడు సెకండ్ హాఫ్ అంతా ఒక ఆరడుగుల నీగ్రోని యమదూత లాగా చూపడం, వాడు కనపడినప్పుడళ్లా హీరో చస్తానని భయపడటం. సినిమాలో కామెడీ అనేది ఎక్కడా లేదు. అక్కడక్కడా మెయిన్ కారెక్టర్లు వెసిన ఒకటి రెందు చిన్నా చితకా జోకులు తప్ప మంచిగా నవ్వుకునే మ్యాటర్ ఒక్కటి కూడా లేదు. ఇక సంగీతం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సినిమా చూసేప్పుడు ఒకే ఒక్క పాట బాగుందనిపించింది. కానీ అది ఏ పాటో కూడా నాకు గుర్తులేదు. మిగిలిన పాటలు అసలు ఎందుకొచ్చాయో అర్థం కాదు. రెండు పాటల్లో అసలు లిరిక్ అర్థమై చావలేదు. పాపం, సంగీత దర్శకుడు సినిమా హిట్ అవ్వడం కోసం న్యూమరాలజీని నమ్మినట్టున్నాడు. శరత్ అన్న తన పేరుని అష్ఠ వంకర్లు తిప్పి Sssherrath అని వేసుకున్నాడు. అది చూడగానే మన శరత్ 'కాలమ్' శరతన్నయ్య ఎలా ఫీలవుతాడో అనిపించింది.

దీనికి కొసమెరుపేంటంటే, అదే రోజు సాయంత్రం మా GD గాడు ఒక సంక్షిప్త సందేశం పంపాడు - "Don't dare to watch 180" అని. "Watched" అని నేను పంపిన రిప్లై కి సమాధానంగా "నా ప్రగాఢ సంతాపం" అని సమాధానమిచ్చాడు.