23 సెప్టెంబర్, 2010

నలుని వంట... భీముని తంట...!?!?!?!

అది అనగా అనగా, అంటే కొన్ని సంవత్సరాల క్రితం మాట అన్నమాట. మేము ఫ్రెండ్స్ అందరం ఉద్యోగప్రయత్నాల్లోంచి బ్రహ్మిగా రూపాంతరం చెందిన కొన్ని రోజులకి, అందరం కలిసి ఈ సింగిల్ రూముల్లో బతుకు వెళ్లదీయడం దేనికిలే అని ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకుని అక్కడికి మారాం.

మామూలుగానే స్వతహాగా అన్ని బ్యాచిలర్ బ్యాచులకి వుండే అత్యుత్సాహం కొద్దీ కొత్త ఫ్లాట్‌లోకి అడుగుపెట్టే ఒకటి రెండు రోజులముందు అనుకున్నాం. కొత్త ఫ్లాట్‌లో అయినా ఈ మెస్సు ఫుడ్డు మానేసి రోజూ రాత్రి వంట వండుకుందాం. వీలయితే మధ్యాహ్నం బాక్సులు తీసుకెళ్దాం. ఓపిక వుంటే పొద్దున టిఫిన్ చేసుకుందాం. ఇక నుంచి బయట ఫుడ్డు కోసం పైసా కూడా ఖర్చుపెట్టకూడదు అని సవాలక్ష ప్లాన్లు వేసాం. మామూలుగా అయితే ఇది ఎక్కువ కాలం జరగాల్సిన ప్రక్రియ కాదుగానీ, మావాల్ల ఉత్సాహ ప్రదర్షన మూలంగా కొంచం, బయటి ఫుడ్డుమీద ఇంట్రెస్టు పోవడం మూలంగా కొంచెం ఆ అలవాటు అలా సా...గి పోయింది, కొన్ని సంవత్సరాలపాటు. అదిగో అప్పుడు మొదలైంది నాకు ఇంట్లో సుప్రభాతం... వంట నేర్చుకొమ్మని. వారానికొకసారైనా వంట నేర్చుకోరా అని చెప్పకుండా ఫోన్ పెట్టేసేది కాదు. కానీ, మా రూమ్మేట్సు మాత్రం చాలా మంచోల్లు. నన్ను కొన్నేళ్లుగా చూసిన అనుభవం వల్ల నాన్ను ఏనాడు వంట నేర్చుకొమ్మని చెప్పలేదు సరికదా, నేను కిచెన్‌లోకి పోతుంటేనే భయపడిపోయి నాకు ఏంకావాలో అడిగి అది చేసిచ్చేవాళ్లు. హైటు తగ్గిన భీమునిలా వుండే నేను నలుని వంటను మించిన రుచికరమైన వంట (టైటిల్ జస్టిఫికేషన్) చేద్దామన్న కల అలాగే మిగిలింది. అలా జీవితం స్వర్గంలా గడిచింది ఒక 3 సంవత్సరాలు.

ఈలోపున ఒక్కొక్కరికి పెళ్లిల్లు అవడం, ఒక్కొక్కడుగా ఫామిలీ పెట్టుకోవడం జరిగిపోయింది. చివర్లో ఒకడు అదే ఫ్లాట్‌లో ఫామిల్య్ పెట్టుకోవడం, నాతో పాటు మిగిలిన పెళ్లి కాని ప్రసాదు అమెరికాకి ఆన్సైటు రావడం వల్ల నేను వేరే కొందరు ఫ్రెండ్స్ వున్న రూములోకి షిఫ్ట్ అయ్యా. పాపం, అమ్మకి అప్పటికీ నేను వంట నేర్చుకుంటానన్న ఆస చావక అడిగింది... ఏరా, ఈ రూములో కూడా వండుకుంటారా...? అని. బ్రహ్మాండంగా అని నా సమాధానం విని తెగ సంబరపడిపోయి కనీసం ఇక్కడైనా వంట నేర్చుకోరా అని బతిమాలింది. కానీ ఏం లాభం... ఇక్కడి రూమ్మేట్సు మనం ఆఫీసునుంచి వచ్చేసరికి వండేసి, మందేస్తూ మనకోసం ఎదురు చూస్తూ వుండేవాళ్లు. అలా మనకి ఎక్కడికి వెళ్లినా తినిపెట్టే అద్రుష్టం, మిగిలిన వాళ్లకి వండిపెట్టే మహాభాగ్యం కలిగాయన్నమాట.

పాపం, అమ్మ మాత్రం మీ ఫ్రెండ్సు దగ్గర నేర్చుకోరా... ఏనాటికైనా పనికొస్తుంది అని చాలారకాలుగా చెప్పిచూసింది. ఒకట్రెందు సార్లు ఇంట్లో పాకశాస్త్రం మీద క్లాసులు తీసుకోవాలని కూడా ప్రయత్నించింది కానీ పెళ్లి బూచి చూపి తప్పించుకున్నా.

అలా జీవితం ముప్పూటలా పక్కనవాడు వండింది తుంటూ సాగదీస్తున్న రోజుల్లో మార్గదర్శిలో చేరకుండానే ఒక ఆన్సైటు దొరికింది. ఈవిషయంలో అందరికంటే ఎక్కువగా సంతోషపడింది మా అమ్మ. అదికూడా నేను విదేశాలకు పోతున్నాననేకంటే, ఇప్పుడూ ఎలాగైనా తప్పదు కాబట్టి అక్కడ వంట నేర్చుకుంటాడు అని. కానీ మా అమ్మొకటి తలిస్తే విధి ఇంకోటి తలచింది. ఇక్కడికొచ్చి చూస్తే, సాటి హైదరబాదీయుడు, నా బెంగళూరు రూమ్మేట్సుకంటే మంచోడు. కిచెన్‌లో నేను చేయగలిగిన ఏకైక కార్యక్రమం కుక్కర్‌లో బియ్యం పెట్టడం. నేను అది చేసినా కూడా "పర్లేదు, నేను పెట్టేస్తా, నువ్వెళ్లి కూర్చో" అని చెప్పిన సహృదయుడు.

ఈ విషయం మా అమ్మకు తెలిసి నాకు వంట చేసే భాగ్యం ప్రసాదించమని కనిపించన ప్రతీ రాయికీ మొక్కేసి, కనిపించిన ప్రతీ గుళ్లోకీ వెళ్లి ప్రత్యేక పూజలు కూడా చేయించింది. ఏ గుళ్లో ఏ దేవుని డెసిషనో తెలీదు కానీ, ఇక్కడ మా రూమ్మేటుకి పని పెరగడం స్టార్ట్ అయ్యింది. వరుసగా వారం రోజులపాటు ఇద్దరం పచ్చడి మెతుకులతో ముప్పూటలా ముగించేసాం. ఇలా ఎంతకాలం అని ఒక చిన్న ఆత్మశోధన చేసుకుని, ఒకరోజు నేను వంట చెయ్యాలని డిసైడ్ అయ్యా.

ఆఫీసులోనే అందుకు తగ్గ కసరత్తు మొదలెట్టేసి, యూట్యూబు లో ఆలుగడ్డ కూర మీద ఒక వీడియో చూసి, ఇంకో రెండు సైట్లల్లో ఎలా చెయ్యాలో చదివేసి రూముకి బయలుదేరా. దార్లో మా ఉమాని కూడా అడిగా, ఎలా చేయ్యాలి అని. తను కూడా ఓంట్లో వున్న ఓపికనంతా తెచ్చేసుకుని కూర ఎంతసేపు చెయ్యాలో అంతసేపు విసుగుతెచ్చుకోకుండా ఎక్ష్‌ప్లెయిన్ చేసాడు.

ఇంటికెళ్లాక కాస్త ఫ్రెష్ అయ్యి, కిచెన్‌లోకి అడుగుపెట్టా. కదనరంగంలో కాలు పెట్టిన కొత్త సైనికుడిలా నా గుండె వేగంగా కొట్టుకోసాగింది. అరగంట కష్టపడి ఆలుగడ్డా, ఉల్లిగడ్డ కోసేసి, పచ్చిమిరపకాయలు కోయబోతూ కారంతో సరిపెడదామని డిసైడ్ అయ్యా. ఆ తరువాత ఏం చెయ్యాలా అని చాలాసేపు ఆలోచించా. ఏదో మరిచిపోతున్నా అని తట్టింది కానీ ఏం మరిచిపోయానో తట్టలేదు. ఇలా కాదులే అని మా ప్రదీప్ కి ఒక ఫోన్ కొట్టా. మనవాడు, ఆలుగడ్డ ఫ్రై గావాల్నా, గ్రేవీ గావాల్నా, కర్రీ గావాల్నా అని వెంకీ సినిమాలో కృష్ణ భగవాన్ లాగా చాలా ఆఫర్స్ ఇచ్చాడు. ఏదో ఒకటి అని కర్రీ దగ్గర డిసైడ్ అయ్యాక అది వుందా, ఇది వుందా అని చాలా వాటికి నాతోనే లేవనిపించి ఎర్ర ఫ్లైటెక్కి వంటచేయడనికొచ్చానని చిన్న కామెంటేసి వున్నవాటితో ఎలా వండాలో చెప్పాడు. ఏదో మరిచిపోతున్నా, మరిచిపోతున్నా అని అనుకుంటూ అన్నీ తను చెప్పింట్టే చేసేసి... కూర అయిందనిపించా.

హమ్మయ్య... నేను కూడా వంట నేర్చుకున్నా అని ఆనందించి వెంటనే ఆ ఆనందాన్ని ఒక పోస్టు ద్వారా అందరితో పంచుకుందామని, ఇన్స్పిరేషన్ కోసం తోటరాముడు ఓపెన్ చేసి 32వ సారి మగ పిల్లాడు - పిల్ల మగాడు పోస్టుని చదివేసి, 34వ సారి వివాహ భోజనంబు - వింతైన వంటకంబు పోస్టుని చదువుతుంటే మా రూమ్మేటు వచ్చాడు. టేస్టు చూసి ఎలా వుందో చెప్పమన్నా. రమణ గోగుల, అను మలిక్ కలిసి పాడిన పాటకు కృష్ణ, రాజశేఖర్ కలిసి డాన్సు చేస్తే ఎలా వుంటుందో లైవ్ చూపిస్తాడనుకున్నా కానీ, నా అంచనాలను మారుస్తూ "నువ్వొస్తానంటే నేనొద్దంటానా"లో ఉప్పుతో చేసిన హల్వా తిన్న జయప్రకాష్ రెడ్డి లాగా ఫేస్ పెట్టి "మళ్లీ కిచెన్‌లో అడుగు పెడితే కాల్లు విరగ్గొడతానని" డిప్లొమాటిక్‌గా వార్నింగ్ ఇచ్చేసాడు.