23 ఆగస్టు, 2010

ఎట్టకేలకు.... మొదటి ప్రయాణం

బెంగళూరులో కూర్చొని బుద్దిగా నా పనేదో నేను చేసుకుంటూ, మధ్య మధ్యలో బ్లాగులు చదువుతూ, మూడొచ్చినప్పుడు బ్లాగులు రాసుకుంటూ నామానాన నేను బతుకుతుంటే... ఒకరోజు సడెన్‌గా నా మేనేజర్ పిలిచి నీకు కెనడా వెళ్లడానికి ఏమైనా ప్రాబ్లెమా అని అడిగాడు. వెంటనే నా కల్లముందు ఒక పెద్ద రింగు తిరిగి గతంలోకి వెళ్లిపోయా.

ఇంజినీరింగ్ అయ్యాక, ఉద్యోగ ప్రయత్నాల్లో వున్నప్పటినుంచీ నువ్వు ఫారిన్ వేళ్తే చూడాలిరా అని అన్న అమ్మ, బ్రహ్మిగా కెరీర్ మొదలెట్టిన రోజునుంచీ నువ్వు శ్రీలంకకైనా సరే ఒక్క వారం వెళ్లిరారా, అమెరికాలో వున్నావని ఊర్లో మూడ్నెల్లు చెప్పుకుంటా అని కలిసినప్పుడల్లా చెప్తున్న బాబాయి కంటిముందు కనిపించారు. నేనోదో ఆలోచిస్తున్నా అనుకున్న నా మేనేజరు నీకెమైనా ప్రాబ్లెం వుంటే చెప్పు... వేరేవాళ్లకి ట్రైనింగ్ ఇచ్చి పంపిద్దాం అన్నాడు. నా ఆలోచనని మరోరకంగా అర్థం చేసుకున్నాడని అర్థం అయిన మరుక్షణం స్టైలు మార్చి విక్టరీ బాబు లెవెల్లో "సార్, కెనడా అంటే చాలా ఇష్టం సార్, ఆన్సైటు మీద అక్కడికి పంపుతారనే నేను ఈ కంపనీలో చేరా సార్... అసలు నేను పుట్టిందే కెనడాలో పని చేయడానికి సార్" అని కొంచెం అతి చేసా. పాపం, అప్పటికప్పుడు నన్నో వీరవిధేయునిగా మార్క్ చేసుకుని ఈ వీకెండ్లో నీ ప్రయాణం అని ఓ అభయహస్తం పడేసాడు. రాక రాక కెరీర్ మొదలైన ఇన్ని రోజులకి నాకో ఆన్సైట్ వచ్చిందని, ఒక మూడు నాలుగు పార్టీలు చేసుకుని... బెంగళూరు కి టాటా చెప్పేసి టొరొంటో కి విమానమెక్కా. ఆకాడికి కెనడాలో దుమ్మేద్దాం, ఇరగదీసేద్దాం అని ఏదేదో ప్లానులేసుకున్నా కూడా. అనుకున్నదే ఆలస్యం, "అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్నీ" అనే పాట గుర్తొచ్చింది.

అది గుర్తుకు రావడం కాదనీ, సిక్స్త్ సెన్స్ ఇచ్చిన వార్నింగనీ, దూరపు కొండలు నునుపనీ, సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడనీ కొన్ని కఠోర నిజాలు ఫ్లైట్ ఎక్కాక తెలిసొచ్చాయి. అప్పటివరకూ ఆన్సైటు విశేషాలగురించి ఎవరైనా చెప్తే వినడమే కానీ చూసిన అనుభవం లేదాయె. ఇంటర్నేషనల్ విమానాల్లో అడిగినంత మందు పోస్తారంటే చెవులు రిక్కించి విని గుడ్లప్పగించి చూసిన నాకు, బొంబాయిలో ఏయిర్ ఇండియా ఫ్లైట్ ఎక్కగానే పెద్ద షాక్ ఇచ్చింది. ఫ్లైట్ ఎక్కగానే ఎదురొచ్చిన ఒక నలభయ్యేల్ల ఎయిర్ హోస్టెస్ ఫ్లైట్ ఎగరగానే డిన్నర్ తెచ్చి ఇచ్చింది. ఇచ్చింది ఇచ్చినట్టు పోకుండా ఇంకా ఎమైనా కావాలా సార్ అంది. ఒక పెగ్గు వోడ్కా అంటె, సారీ సర్, ఫాంటా వుంది అంది. అదివద్దు కానీ ఒక పెగ్గు విస్కీ అంటే, సారీ సర్, స్ప్రైట్ వుంది అంది. కలుపుకునేవి కావమ్మా, తాగేవి కావాలి అంటే, మంచినీళ్లు వున్నాయి సర్ అంది. దూరపు కొండలు నునుపే కాదు, ముదురు కూడా అని అప్పుడు అర్థం అయ్యింది.

మన అదృష్టం ఎప్పుడు సరిగా ఏడ్చింది కనుక ఈరోజు బాలేదనుకోడానికి అని ఒక చిన్న నిట్టూర్పు నటించేసి ఎదురుగా వున్న హెడ్‌ఫోన్ తీసి చెవిలో పెట్టుకున్నా. డిన్నర్ - సినిమా - నిద్ర - సినిమా - బ్రేక్‌ఫాస్ట్ - సినిమా... ఇలా బతుకు వెళ్లదీస్తుండగా లండన్ వచ్చేసింది. ఇది వూర్లల్లో చెంబట్టుకుని పోయే లండన్ కాదండోయ్... నిఝం లండన్. పేర్లు పెద్దగా గుర్తు లేవుకానీ, సిటీ మధ్యలోంచి వెళ్తున్న నది పై కట్టిన ఒక హిస్టోరికల్ బ్రిడ్జిని కిటికీలోంచి చూసా. దాని పేరు టవర్ బ్రిడ్జ్ అనుకుంటా. అక్కడ దిగినతర్వాత నాకు ఏడు గంటల ట్రాన్సిట్. విసా ఆన్ అరైవల్ లాంటిదేమైనా ఇస్తారేమో అని ఆశగా ఎయిర్ ఇండియా కౌంటర్ కి వెళ్లి అడిగితే, అది ఇది అంటూ పెద్ద ప్రాసెస్ చెప్పి, ట్రై చేస్తే ఇక్కడినుంచి సిటిని కనెక్ట్ చేసే సూపర్‌ఫాస్ట్ రైల్లో వెళ్లి అదే రైళ్లో వెనక్కి రావచ్చని చెప్పింది. "ఈసారికి వద్దులే, వచ్చేసారికి ఆన్సైటు యూరప్‌కి ట్రై చేద్దాం" అనుకుని ఏయిర్‌పోర్ట్‌లో అంతసేపు ఏం చెయ్యాలా అని ఆలోచనలో పడ్డా. కాస్త ఫ్రెషప్ అయ్యి రెండు బ్రెడ్డుముక్కలు తిని కాఫీ తాగిటెర్మినల్ మొత్తం కాసేపు చుట్టొద్దామని నడవడం మొదలుపెట్టా. చిన్నదేం కాదు, ఆ ఒక్క టెర్మినల్ చుట్టడానికే నాకు రెండు గంటలు పట్టింది... ఎంత పెద్ద ఏర్‌పోర్టో...!!!

అటు ఇటు తిరిగీ బోరు కొట్టింది కానీ టైం గడవట్లేదు. ఏం చెయ్యాలో అర్థం కాక మళ్లీ తిన్నా. లండన్‌లో వుండే ఒక ఫ్రెండుకి ఫోన్ చేద్దామంటే లైన్ కలిసి చావలేదు. ఇన్ని కష్టాల మధ్య నాకు ఊరటనివ్వడానికి ఒక అమెరికన్ సైనికుడు తగిలాడు. ఇరాక్‌లో కొంతకాలం పనిచేసి సెలవులకోసం ఇంటికి పోతున్నాడు. మామూలుగా మాట్లాడుతూ మాట్లాడుతూ డిస్కషన్ పాకిస్తాన్ టెర్రరిజం వైపు మళ్లింది. భలే మంచి టాపిక్ అని ఇద్దరం ఎవరి చంకలు వాళ్లం గుద్దుకొని వెళ్లి ఒక బార్ కౌంటర్ దగ్గర కూర్చొని డిస్కషన్ కంటిన్యూ చేసాం. అక్కడినుంచి మాటలు మతం వైపు వెళ్లాయి. అన్ని మతాలగురించి మాట్లాడెసుకుని చివరగా హిందు మతం గురించి అడిగాడు. అప్పట్లో ఒక ఫార్వార్డెడ్ మెయిల్లో చదివిన కంటెంటూ, రీసెంటుగా వార్త పేపర్‌లో చదివిన ఒక ఆర్టికలూ కలిపి కొట్టి, హిందూత్వ అంటే ఒక మతం కాదనీ, ఒక నమ్మకమనీ... వేర్వేరు సిద్దాంతాలు వున్నవాళ్లందరినీ కలిపి వుంచే నమ్మకమే హిందూమతమని ఇంకా ఇంకా చాలా చెప్పెసా. హిందువులు చేసే దైవారాధనలకు రోమన్లు చేసే దైవారాధనలకు దగ్గరి పోలికలు వున్నాయని ఎదో ఆర్టికల్‌లో చదివిన విషయాన్ని నా సొంత పరిశోధన లెవెల్లో ఎక్స్‌ప్లెయిన్ చేసా. పాపం... వెర్రోడు ఇదంత నా సొంత తెలివి అని నమ్మి నా మెయిల్ ఐడి తీస్కొని, ఇంటికి చేరగానే మెయిల్ చేసి, ఇప్పుడు కాల్ కూడా చేస్తున్నాడు. ఏదైతేనేమి... ఒక ఫ్రెండు దొరికాడు. సమాచార సాంకేతిక విప్లవంవల్ల ఒక కుగ్రామంగా మారిన ఈ సువిశాల ప్రపంచంలో నాకు ఒక ఖండాంతర స్నేహితుడున్నాడిప్పుడు. మా ఇద్దరి ఫ్లైట్‌లకీ మధ్య తేడా ఒక్క అరగంట మాత్రమే వుండడం వల్ల అతనెళ్లాక నాకు పెద్దగా బోర్ అనిపించలేదు. చివరాఖరికి వచ్చి నా చివరి మజిలీకి విమానమెక్కా. అది కూడా ఏయిర్ ఇండియా ఫ్లైటే. అదేంటో, ఈ ఫ్లైట్‌లో కూడా మందు లేదన్నారు. :'(

"ఇంకేం చేస్తాం.... ఖండించేస్తాం" అని పాడుకుంటూ "లంచు - నిద్ర - సినిమ - నిద్ర - స్నాక్సు - నిద్ర" ఇలా సా.......సాగిస్తున్నంతలో టొరొంటో వచ్చేసింది. కిటికీలోంచి చూస్తుంటేనే అర్థం అయిపోయింది, పెద్ద సిటీనే. ఏదయితేనేం, ఎలాగయితేనేం... చివరాఖరికి నేను కూడా ఆన్సైటుకొచ్చేసా. పులి పులివెందులలో దిగింది. పులివెందుల విశేషాలు వచ్చే టపాలో.