నా 6, 7, 8 తరగతుల చదువు కరీంనగర్ జిల్లా, మంథని టౌన్ లోని UPS లో జరిగింది. (ఇప్పుడు ఆ బడిని ZPP స్కూలు గా మర్చారు. అది వేరే విషయం.) అప్పట్లో ఆ స్కూలు ని UPS అనే కంటే అందరూ గంగాధర్ సార్ బడి అని పిలిచేవాల్లు. ఆయన ఆ స్కూలు కి హెడ్ మాస్టర్ గా చేసేవారు. ఆయనంటే స్కూల్లో అందరికీ హడల్. ఆ రోజుల్లో అంతగా ఎందుకు భయపడ్డామో ఇప్పటికీ నాకు అర్థం కాదు. ఎందుకంటే, ఆయన ఏనాడూ ఎవరినీ కొట్టడం నేను చూడలేదు. ఆ బడికి ఆ పేరు రావడానికి కారణం అక్కడ ఆయన ఎక్కువ కాలం పని చేసి వుండడమే. ఆయన అదే స్కూల్లో హెడ్ మాస్టర్ గా వున్నప్పుడు అక్కడ చదువుకున్న వాల్లే మళ్లీ ఆ బడికి టీచర్లుగా వచ్చి మాకు పాఠాలు చెప్పారు. దాదాపు రెండు దశాబ్దాలపాటు ఆయన అక్కడ చేసారు.
మంథని చుట్టు పక్కల వూర్లల్లో కూడా గంగాధర్ సార్ బడి అంటే ఒక పేరు వుండేది. పేరుకి సర్కారు బడి అయినా ప్రైవేటు స్కూల్లకి ఆ స్కూలు పెద్ద పోటీ. అక్కడ టీచర్లు కూడా చాలా బాగా చెప్పేవారు. నాకు గుర్తున్న కొందరు మాస్టార్ల గురించి ఇక్కడ చెప్పాలి.
గంగాధర్ సార్: హెడ్ మాస్టర్ గానే కాకుండా, ఇంగ్లిష్ కూడా చెప్పేవారు. ఆయన క్లాస్ ఎప్పుడు అయినా చాలా సైలెంట్ గా వుండేది. ఎవరూ మాట్లాడే వారు కాదు. చెప్పాను కదా, ఆయనంటే అందరికీ భయం అని.
భూమయ్య సార్: సామాజిక శాస్త్రం చెప్పేవారు. ఆటలు ఆడించేవారు. క్లాసులో క్విజ్ పెట్టేవారు. కథలు చెప్పేవారు. అన్నింటిలోనూ జీవితం గురించీ, చదువు గురించీ చెప్పేవారు. కబడ్డీ ఆడించేటప్పుడు "కబడ్డీ కబడ్డీ" అనే కూత బదులు "కెనడా రాజధాని ఒట్టావా" అనో, "కెన్యా రాజధాని నైరోబీ" అనో కూత వేయించేవారు. అలా ఆటల్లోనే చదువు కానిచ్చేవారు. ఆయన మా మీద ఎంత ప్రభావం చూపారంటే, మేము ఆడుకునే ఆటల్లో క్విజ్ కూడా ఒకటి. ఇప్పటికీ ప్రతీ ఏడాది టీచర్స్ డే రోజు నేను ఆయనకి ఫొన్ చేస్తాను.
వీరయ్య సార్: లెఖ్ఖలు చెప్పేవారు. మా క్లాసులో ఎక్కువ మంది ఇంజినీరింగ్ చేసారంటే ఆ క్రెడిట్ ఆయన చెప్పిన లెఖ్ఖలదే.
ప్రసాద్ సార్: వీరయ్య సార్ తర్వాత మాకు లెఖ్ఖలు చెప్పడానికి వచ్చారు. వీరయ్య సార్ లేని లోటు తెలియకుండా నేర్పారు. ఈయన కూడా గంగాధర్ సార్ శిష్యుడే అనుకుంటా. నేను చివరిసారిగా కలిసిన టీచర్ కూడా. (ఈమధ్యే ఒక ఫంక్షన్ లో కలిసారు.)
రామయ్య సార్: ఈయన నేను 8వ క్లాసు లో వుండగా రిటైర్ అయ్యారు. హిందీ చెప్పేవారు. ఈయన ఒక మంచి కవి కూడా. గంగాధర్ సార్ క్లాస్ ఎంత సైలెంట్ గా వుండేదో, ఈయన క్లాస్ అంత అల్లరిగా వుండేది. పాఠాలను కూడా కథలుగా చెప్పేవారు. ఎవరు అల్లరి ఎక్కువ చేసినా, "వీని లాంటి వాడే ఒకడు...." అంటూ ఒక కథ చెప్పేవారు. ఈయన క్లాసులో అందరూ ఒక వరుసలో కాకుండా ఎవరికి ఇష్ట్టం వచ్చినట్టు వారు గుంపులు గుంపులు గా కూర్చునేవాల్లం. ఒక గుంపు అల్లరి చేస్తే, ఇంకొక గుంపుకు దెబ్బలు పడేవి. ఆ దెబ్బలని కూడా మేము ఎంజాయ్ చేసేవాల్లం.
mee badi pilsutondi ra
రిప్లయితొలగించండిnee badi pilustOndi
రిప్లయితొలగించండి