మా ఇంజినీరింగ్ కాలేజీకి హాస్టల్ వుండేది కాదు. ఫస్ట్ ఇయర్‌లో మేము ప్రైవేట్ హాస్టల్‌లో వుండేవాళ్ళం. మా కాలేజీ దగ్గరవున్న లేఅవుట్‌లో అలాంటివి చాలా వున్నాకూడా, మా బ్యాచ్ మొత్తం రెండు హాస్టల్లల్లోనే వుండేది. ఒకటి(నేనున్నది) ప్యూర్లీ అబ్బాయిల హాస్టల్ అయితే ఇంకొకటి అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరికీ (ఒకటే బిల్డింగ్ కాదులెండి. అబ్బాయిలకి రెండు బిల్డింగులు, అమ్మాయిలకు ఒకటి విండేవి). బిల్దింగులు అంటే ఇళ్లని అద్దెకి తీసుకుని వాటిలో హాస్టళ్లు పెట్టేసారు. టాక్స్ కట్టాల్సిన అవసరం లేని బ్రహ్మాండమైన బిజినెస్ అది. ఈ హాస్టళ్లల్లో రాత్రుల్లు మేము చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. మా హాస్టల్ ఊరికి చివరగా, ఎక్కడో విసిరేసినట్టుగా వుండడం మాకు కొంతవరకు కలిసివచ్చింది.
మా హాస్టళ్లో మొత్తంగా ఒక 30 మంది పైనే వుండేవాల్లం. ఒక 20 మందిమి మెయిన్‌రోడ్ నుంచి ఒక 100 మీటర్ల దూరంలో వుండే బిల్డింగ్‌లో వుండేవాల్లం. మిగిలినవాల్లంతా మెయిన్‌రోడ్‌ని ఆనుకుని వున్న బిల్డింగ్‌లో వుండేవాల్లు. ఒక ఏడాది పాటు ఆ హస్టల్లో మేము చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. అప్పట్లో మైసూర్లో పోలీసుల గస్తీ ఎక్కువగా వుండేది. లోకల్ క్లాస్‌మేట్స్ అయితే మాటలతోనే భయపెట్టేవాల్లు - రాత్రి తొమ్మిది తర్వాత రోడ్డు మీద తిరగొద్దు, గరుడ(హైదరాబాద్ లో రక్షక్ లాగ) వాల్లు చూస్తే ఏమీ అడగరు, తీసుకెళ్లి ఠాణాలో కూర్చోబెట్టి పొద్దున పంపిస్తారు అని చెప్పేవాళ్లు. మనం చెప్పిన మాటలు వినే బాపతు కాదు అని అప్పట్లో వాల్లకి తెలీదు పాపం.
మైసూరులో అప్పట్లో రాత్రిపూట గస్తీకి గుర్రాల మీద తిరిగేవారు. ఓసారి అలా పోలీసోల్లు రాత్రి ఒంటిగంటప్పుడు రోడ్ మీద గస్తీ తిరుగుతున్నప్పుడు, అప్పుడప్పుడే ఈల వెయ్యడం నేర్చుకుంటున్న మా రఘుగాడు గట్టిగా ఈల వేసాడు. వానికి రాక రాక గట్టి సౌండ్ రావడం, అర్ధరాత్రి కావడం కలిసొచ్చి ఆ ఈల చాలా దూరం పాకింది. చూస్తున్నంతలో రోడ్ మీద పోతున్న గుర్రాలు మా హాస్టళ్‌వైపుకు తిరిగడం కూడా వెంటనే జరిగిపోయింది. మాకైతే భయం అంటే ఎలా వుంటుందో తెలిసింది. ఏం జరుగుతుందో తెలిసేలోపలే బెటాలియన్ మొత్తం మా బిల్డింగ్ ముందుకొచ్చింది. అప్పుడు మొదలైంది మాకు సినిమా. ఒక ఆరగంట సేపు మేమెవరమో, ఎక్కడినుంచి వచ్చామో మొత్తం ఎంక్వైరీ చేసి అనవసరంగా ఈల వేసినందుకు ఒక క్లాస్ పీకి వెళ్లారు.
గండం గడిచిందని సంతోషపడి ఒకరోజు సైలెంట్‌గా వున్నాం. రెండోరోజు రాత్రి నిద్రపట్టక రెండు గంటలప్పుడు గేటు ముందర టెప్ క్యాచులతో గల్లి క్రికెట్ ఆదుతున్నాం. దానికోసం గేటు దగ్గర ఒక పెద్ద లైటు కూడా పెట్టాం. ఆ లైటు చూసి రోడ్‌మీద వెలుథున్న ఒక ఎన్‌ఫీల్డు బండి లోపలికి తిరిగింది. సీదా వచ్చి మా ముందు బండి ఆపాడు. చూస్తే ఒక పోలీసాయన ఫుల్లుగా మందేసి ఇంటికి పోతున్నవాడు లైటు చూసి మా దగ్గరికి వచ్చాడు. వచ్చినోడు చూసి వెళ్లకుండా నిలబడి తాగింది దిగేదాకా మాకో క్లాసు తీసుకుని పొయ్యాడు. ఆ క్లాసు మధ్యలో బెదిరింపులు కూడా. మళ్లీ ఇలా అర్ధరాత్రి ఆటలాడుతూ కనిపిస్తే అరెస్టు చేసి లోపలేస్తానని వార్నింగు.
ఇలాంటివి చాలా జరిగిన తర్వాత, రాత్రి ఎలా అయినా తిరగడానికి మాకు ధైర్యం వచ్చింది. అలాగే మేము ఎంత తిరిగినా పట్టిచ్చుకోకుండా వుండడానికి పోలీసులకూ ధైర్యం వచ్చింది. ఆర్ధ రాత్రి ఒక కుర్రాడు రోడ్డు మీద తిరుగుతున్నాడు అంటే, పోలీసులు ఆపేవాల్లు కాదు. వాడు ఇంజినీరింగ్ కాలేజీ స్టుడెంటు అని ఫిక్స్ అయిపొయ్యేవాల్లు. ఎప్పుడైనా ఎవరినైనా ఆపి అడిగినా వాళ్లకి ఒకటే సమాధానం వుండేది. "రేపు ఎగ్జాం వుంది, ఫ్రెండు రూములో కంబైండ్ స్టడీ చేసుకుని వెలుతున్నా" అని. ఈ ఏడాది పొడుగూతా ఏం ఎగ్జాములురా అని వాళ్లకి ఎప్పుడూ డౌటు రాలేదో, లేక ఏదో ఒక ఆన్సర్ వచ్చింది కదా అని వూరుకునేవాల్లో తెలీదు. వాళ్లకి ఎం తెలిసిందో కానీ, నేను ఏదో రాద్దామనుకుని మొదలుపెట్టి ఏదో రాసినట్టున్నా. ఎటు నుంచి ఎటు వెలుథున్నానో నాకైతే తెలీట్లేదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి