నేను 7వ తరగతి లో వుండగా అనుకుంటా, మంథని లో సంగీత పఠశాల స్టార్ట్ అయ్యింది. 8వ తరగతి లో వుండగా నేను, ఇంకో ఇద్దరు స్నేహితులు మ్రుదంగం క్లాసులో చేరాం. అదే సమయం లో ఇంగ్లిష్ గ్రామ్మర్ కోసం కూడా ఇంట్లో వాళ్లు మా ముగ్గురికీ ట్యూషన్ పెట్టించారు. ఇక రోజూ మాది ఒకే దినచర్య అయిపోయింది. సాయంత్రం స్కూలు నుంచి రాగానే ఇంత తినడం, తయారవడం, సైకిల్లేసుకుని బయట పడటం. ముందుగా ఇంగ్లిష్ ట్యూషన్ కి వెళ్లడం, అది అయ్యాక సంగీత పఠశాల కి వెళ్లడం. రెండూ అయ్యాక ఇంటికి చేరడం. ముందు కొన్నాల్లు బాగానే గడిచింది. తరువాతే, (డామిట్) కథ అడ్డం తిరిగింది.
ఇంగ్లిష్ ట్యూషన్ బాగానే జరిగేది. పేరు గుర్తు లేదు కానీ, ఆ పంతులు మాచేత WREN & MARTIN పుస్తకాన్ని కొనిపించి, అదే పుస్తకంలోంచి నేర్పించేవారు. ఏ మాటకామాటే చెప్పుకోవాలి గానీ, నేను ఈమాత్రం ఇంగ్లిష్ మట్లాడుతున్నానంటే అది ఆ ట్యూషన్ మహిమే. ఆ పుస్తకం అయ్యేంత వరకు మేము ముగ్గురం ఆ ట్యూషన్ కు రోజూ వెళ్లాము.(అక్కడ మేము ముగ్గురమే స్టుడెంట్సు, అది వేరే విషయం).
ఇక సంగీతం విషయానికి వస్తే, మొదట్లో అక్కడ ఒక మ్రుదంగం మాస్టారు వుండేవారు. ఆయంటే అందరికీ గౌరవం వుండేది. కానీ ఆయనకి వరంగల్ అంటే ఇష్టం వుండేది. ఆ ఇష్టం తోనే ఆయన వరంగల్ కి ట్రాన్స్ ఫర్ చేయించుకుని వెళ్లిపోయారు. అందరూ చాలా బాధ పడ్డారు. నేను కూడా!!! (తొక్కలో బాధ. నేను ఆయన దగ్గర నేర్చుకున్నది రెండు వారాలు. ఆ రెండు వారాల్లో నేర్చుకున్నది, ఒక్క పాఠం. ఈమాత్రానికే బాధ పడితే, నా లైఫ్ అంతా ట్రాజెడీ గానే వుండేది. ఏదో, పక్కనున్న వాళ్ల కోసం కొంచెం సైలెంట్ గా వున్నా.. అంతే.) కానీ, ఆయన వెళ్లాక వచ్చిన కొత్త మాస్టారు ఆ పాత మాస్టారు చెప్పిందంతా వేస్టు అని కొత్తగా చెప్పడం మొదలు పెట్టారు. కొత్త పాఠాలు ఎలా వున్నా, పాత మాస్టారు చెప్పింది వేస్టు అనేసరికి చాలా మందికి ఎక్కడో కాలింది. (నాక్కూడా కాలింది. కానీ రీజన్ మాత్రం వేరు. ఏదైనా ఒక్కసారి చెప్పగానే పట్టేసి నేర్చేసుకోవాలని ఎక్స్ పెక్ట్ చేసేవాడు. నాకు అంత తెలివి లేక రోజూ తిట్లు తినేవాన్ని. అందుకు నాకు కాలింది.)
అప్పట్లో అందరికీ ఒక అలవాటు వుండేది. క్లాస్ అయ్యాక, బయటకి వచ్చి చెప్పులు వేసుకుంటూ "వెళ్లొస్తాం మాస్టారూ" అని చెప్పేవాళ్లం. (బహుశా అది RSS వారి శిశు మందిర్ నుండి వచ్చిన అలవాటు అనుకుంటా. ఆ క్లాసులో ఎక్కువ మంది శిశు మందిర్ పూర్వ విద్యార్థులే.) ఒక రోజు అనుకోకుండా నేను రమణ గారి "బుడుగు" స్టైల్ లో "ఒరేయ్ మాస్టారూ, వెళ్లొస్తానురా" అన్నాను. అది ఆ మాస్టారి చెవిన పడింది. అంతే, ఆ మాస్టారు నన్ను చుస్తూ, ఒరేయ్, నువ్విలా రారా అన్నాడు. మెడకాయ మీద తలకాయ వున్నవాడెవడైనా వెళ్తడా...? నేను కూడా అంతే. పరుగు లంకించుకున్నాను. నా పుణ్యమా అని, నాతో వున్నందుకు నా ఫ్రెండ్సు కూడా పరుగెత్తక తప్పలేదు. మళ్లీ మూడు నెలల పాటు మేము ముగ్గురం సంగీత పఠశాల కి వెళ్లలేదు. అఫ్ కోర్స్, మూడు నెలల తర్వాత ఆ పాఠశాల ప్రిన్సిపాల్ వచ్చి మీ వాడు రావట్లేదండీ అని ఇంట్లో చెప్పాక వెళ్లక తప్పలేదు.
కానీ, లైఫ్ లో మొదటిసారి బంక్ కొట్టడం అలవాటైంది. ఆ మూడు నెలలు బంక్ కొట్టి రోజూ గ్రౌండ్ లో ఆడుకోవడం లో కూడా ఒక థ్రిల్ వుండేది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి