అవును. పరువు పోయింది. విద్యాధికులు, మేధావులతో నిండి వుండే పెద్దల సభగా చెప్పుకోబడే ఎగువ సభ (రాజ్య సభ) పరువు పోయింది. పరోక్ష ఎన్నికలు, వాటి వల్ల వచ్చే పదవులు రాజకీయ ఉద్యోగాలు సృష్టంచడానికేనని రాజకీయ పక్షాలు మరోసారి నిరూపించాయి. ఈ మాట నిరూపించుకునే ప్రయత్నం లో మన గౌరవనీయులైన సిగ్గు లేని రాజకీయ వుద్యోగులు అంతర్జాతీయ అవనిక పై భారతావనికి ఒక మాయని మచ్చను అంటగట్టారు.
మహిళా దినోత్సవం రోజున మహిళా బిల్లును ప్రవేశపెట్టే సమయంలో పెద్దల సభలో కొందరు పెద్దలు ప్రవర్తించిన తీరు కేవలం ఆ సభ పరువునే కాదు, మొత్తం భారతీయ పార్లమెంటరీ వ్యవస్థ పరువునే మంట గలిపేసింది. ఈ తరహా విన్యాసాలు దిగువ సభలో జరిగితే ఇంతగా ఆలోచించేవాల్లం కాదు. ఎందుకంటే, వాళ్లు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన మన ప్రతినిధులు. వీళ్లు మైకులు విరగ్గొట్టకుండా, బిల్లు పేపర్లు చించేయకుండా ప్రశాంతంగా చర్చిస్తే ఆ తర్వాతి ఎన్నికల్లో మళ్లీ మనం ఓట్లేస్తామా...? అస్సలు వెయ్యం. ఆ విషయం వాళ్లకు కూడా తెలుసు. అందుకే వాళ్లు అలా చేస్తారు. మనం చూస్తాం. మనం అలా అడ్జస్ట్ అయిపొయ్యాం. కాని, పెద్దల సభ అంటే, ఇప్పటికి నాలాంటి అమాయకులకి ఎక్కడో కొద్దిగా నమ్మకం మిగిలింది. రాజ్యసభ అంటే పెద్దరికానికీ, హుందాతనానికీ ప్రతినిధిగా వుండాలనీ, వుంటుందనీ జనాల్లో వున్న నమ్మకాన్ని ఈరోజు మన రాజకీయ పార్టీల పుణ్యమా అని మన రాజకీయ వుద్యోగులు మానభంగం చేసేసారు.
పొలిటికల్ ఎంప్లాయ్‌మెంట్ పేరు మీద రాజ్యసభను మరో లోక్‌సభ చేసిన పార్టీల తప్పా, లేక రాజ్యసభ విలువ తెలియకుండా వెళ్లి దాని పరువు తీసిన సభ్యుల తప్పా అని ఆలోచిస్తే.... నాకు తట్టిన ఆలోచన మాత్రం ఇది ముమ్మాటికీ పార్టీల తప్పే. ఫ్రజాబలం లేకో, మరేదో కారణం వళ్లో ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజాసేవకు నోచుకోని మేధావి వర్గం సేవలను ప్రజాసేవకు వినియోగించుకోవాలనే సదుద్దేశం తో మన రాజ్యాంగం నెలకొల్పిన విధానమే రాజ్యసభ. ఆ సభ విలువ తెలియనివాళ్లనీ, ఆ సభలో సభ్యత్వం పొందే అర్హత లేనివాల్లనీ కేవలం డబ్బు కోసమో లేక పార్టీ ఫండ్ కోసమో లేక మరేదో ప్రయోజనం ఆశించో రాజ్యసభకు పంపిన పార్టీలదే ఇక్కడ తప్పు.
గతాన్ని చూస్తే, ఈ సభ తన మర్యాదను ఏనాడూ ఇలా పోగొట్టుకోలేదు. ఇంకా చెప్పాలంటే, గత ప్రభుత్వాలు దాని ప్రతిష్ఠను పెంచాయి. దానికి స్వచ్చమైన ఉదాహరణ మన జాతీయ విత్త మంత్రివర్యులు శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు. ప్రణబ్ రాజకీయ జీవితాన్ని పరికిస్తే, 1969-1987 మరియు 1993-2004 మధ్య కాలంలో రాజ్యసభ సభ్యునిగా సేవ చేసారు. చాలా మంది ఈయనని సోనియా కోటరీగానే అనుకుంటారు. కానీ, చాలా మందికి తెలియని విషయం ఒకటుంది. 1982-84 మధ్య కాలంలో కూడా ఈయనే మనకు విత్తమంత్రి. ఆ సమయంలో, అంటే, 1984 లో "యూరోమనీ" అనే పత్రిక వారు ప్రణబ్ ని ప్రపంచంలో అత్యుత్తమ ఆర్థిక మంత్రిగా ప్రకటించి గౌరవించారు. దానికి ఒక కారణం కూడా వుంది. 1981లో (అనుకుంటా) భారత ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి తీసుకున్న అప్పులో చివరి వాయిదా అయిన 1.1 బిలియన్ డాలర్లను 1984లో తీసుకోవలసివుండగా, ఆ సమయంలో ఈయన తీసుకున్న నిర్ణయాల ఫలితంగా మన ప్రభుత్వం ఆ సొమ్మును, అనగా అప్పును, తీసుకోలేదు. ఇలాంటి మేధావుల సేవలను కోల్పోరాదనే సదుద్దేశంతో మన రాజ్యాంగం మనకిచ్చిన రాజ్యసభ అనే మహోత్తరమైన విధానానికి తిలోదకాలిస్తూ ఆ సభా మర్యాదను మంటగలిపే రౌడీరాజులను సభ్యులుగా చేసిన మతి లేని, సిగ్గు విడిచిన ముగ్గురు యాదవ కుల తిలకులకు ఇవే నా జోహార్లు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి