నేను, మా గల్లీ గాడు (అది మేము వాడికి పెట్టుకున్న ముద్దు పేరు) చచ్చీ చెడీ అష్టకష్టాలూ పడి ఇంజినీరింగ్ చివరి ఏడు కి చేరామా... అని సంతోషిస్తూ 7వ సెమిస్టర్ పరీక్షలు రాసాం. ఇంకొక మూడునెల్లు మనవి కాదనుకొని కష్టపడితే ఆ డిగ్రీ ఏదో చేతిలో పడుతుంది అని ఆనందపడుతూ సెలవులకి ఇంటికివెళ్లా. మా గల్లీగాడు లోకలోడే కాబట్టి వానికి పెద్దగా తేడా ఎమీ పడలేదు లెండి. కానీ వాడే పెద్ద తేడా మనిషి. అందుకే వానికి ఆ పేరు. మా బట్టతల HOD గాడేమో (క్షమించాలి. అలా అలవాటైపోయిన ప్రాణం) 7వ సెమిస్టర్ చివరి పరీక్ష రోజే ప్రాజెక్ట్ సినాప్సిస్ ఇచ్చేయాలని చెప్పాడు. మనకేమో చివరిక్షణంలో ఎవరో ఒకరు గుర్తు చేస్తే తప్ప డెడ్‌లైన్‌లు గుర్తుండని ప్రాణమాయె. చివరి ఎగ్జాం తర్వాత ఎవడో వాని ప్రాజెక్ట్ గురించి చెబుతోంటే నాకు మా ప్రాజెక్ట్ విషయం గుర్తొచ్చి, రూంకి పరిగెత్తుకొచ్చి సినాప్సిస్ రాయడం మొదలుపెట్టా.
మా గల్లీ గాడి పుణ్యమా అని, ఏదో రిఫరెన్సు దొరికి మాకు ఇద్దరికి L&T లో ప్రాజెక్టు దొరికింది. ప్రాజెక్టు వచ్చిన రోజు వెల్లి గైడ్ ని కలవమంటే మేమిద్దరం కి వెళ్లాం. ఆ గైడ్ అక్కడ ఒక డిపార్ట్‌మెంట్‌కి వైస్ ప్రెసిడెంట్ అని మాకు అక్కడికి వెళ్లాక తెలిసింది. పాపం, వయసులో పెద్దాయన కానీ, చాలా కష్టపడేవాడు. మాకు ప్రాజెక్టు గురించి ఏదో కొద్దిగా చెప్పాడు. నేను కష్టపడి దాన్ని గుర్తు చేసుకుని సినాప్సిస్ రెడీ అనిపించా. అది ప్రింట్ తీయించి HOD కి ఇవ్వరా అని మావాడికి చెప్పి నేను బెంగుళూర్‌కి బస్సెక్కా.
ఓ నెల రోజులు ఇంట్లో పండగ చేసుకుని మైసూరుకి వచ్చేసరికి మా గల్లీ గాడు మంగుళూరులో పండగ చేసుకోడానికి వెళ్లాడు. ఎలాగూ వాడు లేడు కదా అని నేను ఓ రెండు రోజులు ఇటు కాలేజీకి, అటు ప్రాజెక్టు కి వెళ్లకుండా రూంలో తొంగున్నా. అప్పుడు తగిలింది, నాకొక పెద్ద షాక్. ఒక క్లాస్‌మేట్ ఒకడు రూంకి వచ్చి ముసలోడు గరం మీదున్నాడు. మీ ప్రాజెక్టు వొప్పుకోడంట అని బాంబు పేల్చాడు. కాలేజీకి వెళ్లి చూస్తే వాడేమో ఇంకా సినాప్సిస్ ఇవ్వలేదూ అంటాడు.(నిజం చెప్పాలంటే, ఆ మాట వినేదాకా నేను వెళ్లేముందు అది రెడీ చేసానన్న విషయం మరిచిపొయ్యా) బయటికొచ్చి మావాడికి ఫోన్ చేస్తే వాడు చావు కబురు చల్లగా చెప్పాడు - "నేను వెళ్లేసరికి బట్టతలోడు చాయ్ తాగడానికి పొయ్యాడు. ఎంతసేపు ఎదురు చూస్తాం, మళ్లీ ఇద్దాం లే అని ల్యాబ్ అటెండర్ బీరువాలో పెట్టి వచ్చేసా" అని. ఏదోలా మా ముసలోడి కాల్లుగడ్డాలూ పట్టుకొని, ఆరోజు సినాప్సిస్ ఇచ్చేసి ప్రాజెక్ట్‌కి ఓకే అనిపించుకున్నా.
L&T లో మా ప్రాజెక్ట్ గైడ్ గురించి చెప్పా కదా, ఆయన ఎప్పుడు చూసినా ఫుల్ బిజీగా వుండేవాడు. ఆయన్ని కలవాలీ అంటే, ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకుని పోవాలి. అదికూడా ఒక టీం కి వారంలో ఒకేసారి ఇచ్చేవాడు. ఒక వారంలో ఇచ్చిన పనిలో చిన్న డౌట్ వచ్చినా కూడా మళ్లీ వారం దాకా ఆగాల్సిందే. అలాంటి సమయంలో ఒకసారి మేము వరుసగా రెండు వారాలు అసలు అపాయింట్‌మెంట్ గురించే ఆలోచించలేదు. సడెన్‌గా ఒకరోజు మా ముసలోడు ప్రాజెక్ట్ స్టేటస్ అడిగితే అప్పుడు అపాయింట్‌మెంట్ గురించి గుర్తొచ్చింది. బేసిక్‌గా నేనొక సోంబేరి వెదవని కాబట్టి ఆ పని మా గల్లీగానికి అప్పజెప్పా. కానీ మావాని గురించి తెలుసు కదా... వాడు రెండు రోజుల తర్వాత ఫోన్ చేసి "అపాయింట్‌మెంట్ దొరికింది. రేపు పొద్దున మా ఇంటికి వచ్చెయ్, ఇద్దరం కలిసి వెళ్దాం" అన్నాడు. నేను హుషారుగా మరుసటి రోజు వెళ్లా. తీరా దగ్గర బ్నడి ఆపాక మావాడు బాంబు పేల్చాడు నేను అపాయింట్‌మెంట్ తీసుకోలేదూ అని. ఇప్పటికైనా మించింది లేదు, ఇంటికి వెళ్లి మళ్లీ రేపు అపాయింట్‌మెంట్ తీస్కొని వద్దామురా అని నెత్తి నోరు కొట్టుకున్నా. అయినా వాడు వినకుండా నన్ను లోపలికి లాక్కెళ్లాడు.
BP ఎలా వుంటుందో ఆ రోజు చాలా దగ్గరినుంచి చూసా. చెప్పాపెట్టకుండా వచ్చామని మొత్తం ఫ్లోర్ అంతా వినపడేలా అరుపులు. మాకు ఆరోజు అర్థం అయ్యింది, అన్ని రోజులు మేము ప్రాజెక్ట్‌లో ఎన్ని తప్పులు చెసామో...!!! ఆయనుకున్న ఓపిక కూడా మాకు అప్పుడే తెలిసింది, ఆ తప్పులను ఆయన ఎలా కరెక్ట్ చేయించారో ఆలోచించాక. ఆతరువాత, మళ్లీ మేము అపాయింట్‌మెంట్ తీసుకోకుండా ఆయన దగ్గరికి వెల్లలేదు. తప్పులు కూడా చెయ్యలేదు. ఫోన్ చెయ్యడానికి ముందే మేము చేసిన పని ఒకటికి రెండూ సార్లు క్రాస్‌చెక్ చేసుకుని అపాయింట్‌మెంట్ తీసుకునేవాళ్లం.
మొత్తానికి ప్రాజెక్ట్ ఒడగొట్టాం. ఫైనల్‌గా సర్టిఫికేట్ ఇచ్చేరోజు మాత్రం మేము అనుకున్నదానికి పూర్తి భిన్నంగా జరిగింది. మమ్ములని కూర్చోబెట్టి లైఫ్ ని ఎంత సీరియస్‌గా తీసుకోవాలో, ప్రాధాన్యతా క్రమాలు ఎలా నిర్ణయించుకోవాలో చెప్పారు. ఇంజినీరింగ్ స్టుడెంట్ లైఫ్‌కి, ఇంజినీర్ లైఫ్‌కి తేడా ఏంటో చెప్పారు. ఫైనల్‌గా ఒక కాఫీ పోసి పంపారు. ఇదీ క్లుప్తంగా మా ప్రాజెక్ట్ కథ. ఏదో చెప్పాలనుకుని మొదలు పెట్టా, ఏదో చెప్పి ముగించేస్తున్నా. మిగిలిన విషయాలు మల్లెప్పుడైనా చెప్పుకుందాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి