15 అక్టోబర్, 2010

మీటింగ్‌లో నిద్రపోతే....?

పోయిన వారం నాకు ఆఫీసులో ఒక మీటింగ్ జరిగింది. అది కూడా లంచ్ అవ్వగానే పెట్టారు. మా టీం అంతా కలిసి లంచ్ చేసాం. ముందురోజు డిన్నర్ సరిగా చెయ్యకపోవడం వల్లనో, లేకపోతే ఆరోజు పొద్దున బ్రేక్‌ఫాస్ట్ చెయ్యకపోవడం వల్లనో, కాదంటే లంచ్ రుచిగా వుండడం వల్లనో తెలీదు కానీ భీభత్సంగా కుమ్మేసా. ఇంకేముంది, నిద్ర తన్నుకురావడం మొదలైంది. డెస్కు దగ్గరికెళ్లి కాసేపు నిద్ర పోదామని ఆలోచిస్తూ మెల్లగా కేఫిటేరియాలోంచి బయటకు వస్తూంటే మా లీడ్ పద్మజ గారు గుర్తు చేసారు "పెద్ద తలకాయల"తో మీటింగ్ వుంది కదా ఇప్పుడు అని. అందరం కలిసి మీటింగ్ వున్న ఆడిటోరియంలోకి వెళ్లాం. అప్పటికే మీటింగ్ స్టార్ట్ అయిపోయింది. హాల్లో ఒక 100 వరకు కుర్చీలు వేసారు. చివర్లో అన్నీ నిండుగా వున్నాయి. కూర్చోడానికి ఎక్కడా ప్లేసులేదని కుర్చీల వెనకాల స్నాక్సు కోసం వేసిన టేబుల్స్ మీద కూర్చున్నాం అందరం. ఒక రెండు నిమిషాలు ప్రశంతంగా కూర్చుని ఇలా సెటిల్ అయ్యానో లేదో ముందు నుంచి నా పాలిటి లేడీ విలన్ లేచి మట్లాడుతున్న జెంటిల్‌మాన్ దగ్గర మైకు లాక్కుని "వెనక టేబుల్సు దగ్గర సెటిల్ అయిన వాళ్లందరూ ముందుకు వస్తె అక్కడ కుర్చీలు ఖాళీగా వున్నాయి రండి" అని ఆహ్వానించింది. మనకి బాడ్ టైం స్టార్ట్ అయ్యింది.

అప్పుడు కదిలి చూస్తే మనకంటే లేటుగా మీటింగుకి చాలామందే వచ్చారు.అందరం కలిసి ముందుకు వెళ్లాం. అందరం ఒక వరుసలో కూర్చున్నాం. గోడ వైపు మా లీడు, పక్కన మా టీమువాళ్లు, చివర్లో... దారికి దగ్గరగా నేను. తీరా చూస్తే నేను కూర్చుంది రెండో వరుసలో. మొదటి వరుస నా ఖర్మ కాలి ఖాళీగా వుంది. అంతా బాగానే వుంది కానీ మా ప్రవీణ్‌గాడు కనపడట్లేదేంటి చెప్మా అని వెనక్కి చూసా. నా వెనక వరుసలో రెండు కుర్చీల అవతల ప్రవీణు, వాని వెనకాల నా మేనేజరూ కూర్చున్నారు. అప్పుడే నాకు కుడి కన్ను అదిరింది, అంటే సిక్స్త్ సెన్స్ పనిచేసింది. కానీ దాన్ని పట్టించుకునే మూడ్‌లో ఆ క్షణంలో నేను లేను.

ఒక అయిదు నిమిషాలయ్యింది. అప్పటిదాక మట్లాదుతున్న పెద్దాయన స్పీచుకూడా అయ్యింది. మమ్మలని ముందుకు పిలిచిన నా లేడీ విలన్ లేచి ఏదో గేం అంటూ నేను రెండో తరగతిలో వుండగా ఒక ఈమెయిల్‌లో వచ్చిన ఫొటో చూపింది. చాలా కాఫీ గింజల మధ్య ఒక మనిషి ఫేసు వుండే ఫొటో అది. ఆ ఫొటో చూపగానే ఆమెకో ఫోన్ వచ్చింది. మమ్మల్నందరినీ లైన్‌లో వుండమని చెప్పి ఆమె మాత్రం మాట్లడ్డానికి బయటికెళ్లింది. ఒక అయిదు నిమిషాల తర్వాత వచ్చి కొన్ని క్వెశ్చన్స్ వేసింది. అదేంటో, నాకు తప్ప అక్కడ ఎవ్వరికీ ఆన్సర్స్ తెలీవనుకుంటా. నేను తప్ప ఎవ్వరూ జవాబు చెప్పలేదు. నాకూ, నా విలన్ కు మధ్య డిస్కషన్ ఇలా జరిగింది.

విలన్: ఈ ఫొటోలో వున్నదేంటి...?
నేను: కాఫీ గింజలు.
విలన్: గుడ్. నువ్వు లేచి నిలబడు.
నేను: (లేచి నిలబడ్డా)
విలన్: దీనితో ఏం చెయ్యొచ్చు...?
నేను: ఫొటోనయితే సిస్టంలో వాల్‌పేపర్ గా పెట్టుకోవచ్చు. గింజలతో అయితే కాఫీపొడి చేసి దానితో కాఫీ చేసుకుని తాగొచ్చు. ఒక అయిదు నిమిషాలు టైమిస్తే ఇంకేమైనా చెయ్యొచ్చేమో గూగుల్ చేసి చెప్తా.
విలన్: బ్రహ్మాండం. అసలు నీలాంటి వానికోసమే నేను ఎదురుచూస్తున్నా. నీ అంత ఇంటెల్లిజెంట్ లేక ఇన్ని రోజులు మా మీటింగ్స్ అన్ని తెగ బోరు కొడుతున్నాయి. ఇంకొక్క ప్రశ్న వుంది, దానికి కరెక్ట్ అన్సర్ చెప్తే నీకొక సర్‌ప్రైజ్ గిఫ్ట్.
నేను: డౌటొద్దు. గిఫ్ట్ నాదే. నువ్వడుక్కో.
విలన్: కాఫీ స్పెల్లింగ్ ఏంటి...?
నేను: కే ఏ యూ పీ హెచ్ వై

అంతే, గిఫ్టు నాదైపోయింది. ఆడిటోరియం అంతా చప్పట్లతో దద్దరిల్లింది. ఆ చప్పట్లమోత నా చెవుల్లో గింగిరాలు తిరుగుతూంటే తల విదిలించా. చూస్తే నేను కూర్చొనే వున్నా. విలన్ ముందు కనపడలేదు. కానీ చప్పట్లు మోగుతున్నాయి. వెనక్కి తిరిగి చూస్తే విలన్ వేరేవాళ్లకి గిఫ్ట్ ఇస్తోంది. మనం రికగ్నైజ్ చెయ్యక కానీ, తర్వాత మా ప్రవీణ్ కి కూడా ఒక గిఫ్టొచ్చింది. అది నాకు మీటింగయ్యాక తెలిసొచ్చింది. పాపం, వానికి గిఫ్టొచ్చినప్పుడు నేను చప్పట్లు కొట్టలేదని ముందు ఫీలయ్యాడు కానీ తరువాత అర్థం చేసుకున్నాడు.

మళ్లీ స్పీచులు మొదలయ్యాయి. ఇంక నన్నడక్కండి. ఎంత మంది వచ్చారో, ఎంత సేపు దంచారో, గంటన్నర ఎలా గడిచిందో నాకైతే తెలీదు. మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు వెనక్కి తిరిగి చూస్తే మా ప్రవీణుడు వెటకారంగా ఒక స్మైల్ పడేసాడు. (అంటే నేను నిద్ర పోతున్నానన్న విషయం వాడు పట్టేసాడు) నేను అలా వెనక్కి తిరిగిన ప్రతీసారీ నన్ను ఎవరో తట్టినట్టనిపించే చూసాను. అది వేరే విషయం. రెండోసారి చూసినప్పుడు అనిపించింది... నా పక్కన కూర్చున్న వినోద్ నన్ను తడుతున్నాడు అని. ఎందుకైనా మంచిది కంఫర్మ్ చేసుకుందామని అడిగా "నీకు కాలేజీ రోజుల్లో నిద్రపోతున్న వాళ్లని లేపే అలవాటు బాగా వుండేదా...?" అని. 'యెప్పీ' అని స్టైల్‌గా చెప్పాడు.

అలా అలా మీటింగ్ అంతా అయిపోయి బయటికొచ్చాక తెలిసింది ఏమీ అంటే, చివర్లో మాట్లాడిన మాస్టారు అందరికంటే పెద్దతలకాయంట. జోకులు కూడా బాగా పేల్చాడంట. నన్ను ఆఅహించిన నిద్రాదేవత విశ్వరూపాన్ని కూడా చూసాడంట. మా ప్రవీణడు చెప్పాడు... "ఆ పెద్దతలకాయ ప్రతీ జోకుకి జోకుకి మధ్యలో నీవైపు కంఫ్యూజింగ్‌గా చూసాడు. అందరి నవ్వులకి నువ్వు తల విదిల్చి నవ్వుతుంటే అది వేసిన జోకుకి నవ్వావో, వేయబొతున్న జోకుని ఎక్స్‌పెక్ట్ చేసి నవ్వావో అర్థం కాక.. పాపం" అని.

అసలు పోస్ట్ లంచ్‌లో ఇలాంటి మీటింగ్స్ పెట్టేదే సుఖంగా నిద్ర పోవటానికి నా ఫీలింగ్. అలాగే ఈరోజు కూడా ఒక మీటింగ్ పెట్టారు, తెల్లవారుఝామున ఎనిమిదిన్నరకి. దానికితోడు మాటీమువాళ్లందరికీ ఈ మొదటిబెంచీలో కూర్చునే అలవాటు ఏంటో అర్థం కాదు. వెనక కొన్ని సీట్లు ఖాళీగా వున్నాకూడా వెళ్లి మళ్లీ రెండో వరసలో కూర్చున్నారు. అందులో మొదటి స్లైడ్‌లోనే దయచేసి గురకపెట్టొద్దు అని చెప్పారు. అంటే సైలెంటుగా నిద్ర పోవచ్చనే కదా. మరేంటి, ఆ స్లైడ్ చుస్తూనే మా టీమువాళ్లంతా నవ్వుతూ నావైపు చూసారు....?

6 కామెంట్‌లు:

  1. నా ప్రఘాఢ సానుభూతి. ఐనా ఈ వెధవ మీటింగులు సరిగ్గా లంచవంగానే పెడతారెందుకో

    రిప్లయితొలగించండి
  2. @కొత్త పాళీ:మీటింగులకు ముందు లంచ్ వుండాల్సిందే...మీటింగులో గురక పెట్టాల్సిందే..అన్నీ పూర్తయిపోతాయి కదండీ...

    రిప్లయితొలగించండి
  3. కొద్దిగా ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షమించాలి.
    చాలా బాగా రాసారు. అదేమిటో లంచ్ కి సంబంధం లేకుండా సభలు,సమావేశాలు జరిగే అన్నిచోట్లా మైకాసురులు ఉపన్యాసాలు దంచుతూ ఉంటే బ్రహ్మాండమయిన నిద్రొస్తుంది నాక్కూడా. అలాంటినిద్రలో ఎంత సుఖం ఉందో అనుభవించినవారికి కానీ తెలీదు.
    మీ బ్లాగుతో ఇప్పుడే పరిచయం. ఇంకా చదవవలసిన టపాలు చాలా ఉన్నాయి.

    రిప్లయితొలగించండి
  4. @ Sudha: థ్యాంక్సండీ. మీరే కాదు, నేను కూడా ఆలస్యమే. కానీ ఇది కావాలని కాదండోయ్. చూడటంలోనే లేటయ్యింది.

    రిప్లయితొలగించండి