12 అక్టోబర్, 2010

తొక్కలో జీవితం... ఇంతేనా... ఇంకేం లేదా....?

ఇండియాలో వున్నప్పుడు లైఫ్ చాలా బాగుండేది. వీక్ డే లో అయితే తెల్లవారుఝామున (నా ఫ్రెండ్సు అది తెల్లవారుఝాము కాదు, పొద్దున అంటారు. మీరు నమ్మొద్దు) లేచి తయారయ్యి ఆఫీసుకి వెళ్లి లంచవర్లో ఏ చెత్తో తినేసి, సాయంత్రం ఇంకేదో గడ్డి తినేసి రాత్రి వరకు చెమటోడ్చి(?) పని చేసి మధ్యలో బ్లాగులు చదువుతూ, అప్పుడప్పుడు కామెంట్లు పెడుతూ, ఓపిక వుందని అనిపించినప్పుడు పోస్టులు వేస్తూ టైంపాస్ చేసేవాన్ని. ఇక వీకెండైతే పండగే. మరీ తెల్లవారుఝామున లేవాల్సిన పని లేదు కాబట్టి కాస్త పొద్దెక్కాక లేచేవాన్ని (దీన్ని నా ఫ్రెండ్సు మధ్యాహ్నం అంటారు. ఆస్ యుజువల్ గా మీరు నమ్మినట్టు నటించండి, కానీ నమ్మొద్దు). ఫ్రైడే నైటు పార్టీ, శనివారం రాత్రి గాలి తిరుగుడు, ఆదివారం రాత్రి సినిమా.... ఇలా సరదాగా సాగిపోయేది. ఒకరోజు మామూలుగా ఆఫీసుకి వెళ్లి బ్లాగులు చదువుతుంటే మధ్యలో ఒక ఫ్రెండు పింగ్ చేసాడు. మాటల మధ్యలో "విధి చాలా బలీయమైనది. అది మనం కోరుకున్నదానికి సరిగ్గా అప్పోసిట్ గా చేస్తుంది" అని అన్నాడు. వాడు ఏ క్షణాన అన్నాడో గాని, అన్నాక రెండు రోజులకి నా మేనేజర్ పిలిచి నువ్వు ఫారిన్ వెళ్ళాలి, అన్ని రెడీ చేసుకో అని చెప్పాడు.

ఫారిన్‌లో ఎలా వుంటుందో ఆల్రెడీ ఆన్సైటుకెళ్లొచ్చిన వాళ్ల దగ్గర చాలా విన్నాను కాబట్టి, దానికి తగ్గట్టుగానే చాలా ప్లాన్స్ కూడా వేసుకున్నా... ఇక్కడికొచ్చాక జిమ్ముకెళ్లి పొట్ట తగ్గించాలి, వీలైతే 8 ప్యాక్, లేదంటే 6 ప్యాక్ అయినా పెంచేసి, మల్లి బెంగళుర్ లో ఆఫీసుకెళ్లే రోజు కి మొత్తం అవుట్ లుక్ ని మార్చేసి, అమ్మాయిలందరికీ షాక్ ఇచ్చి... అబ్బో... చాలా చాలా వూహించేసుకున్నా. కానీ, విధి చాలా బలీయమైనది. నా బద్దకం అంతకంటే బలమైనదన్న విషయం నాకు ఇక్కడికొచ్చాక అర్థం అయ్యింది. నేను ఇక్కడుండేది మూడు నెల్లు. అందులో నెలన్నర నాకు జిం ఎక్కడుందో కనుక్కోవడానికే పట్టింది. ఇంక అందులో కార్డ్ తీసుకోవాల్సిన ప్రాసెస్ తెలుసుకోవడానికి ఇంకో 2 వీక్స్. మిగిలింది ఒక్క నెల. ఈ ఒక్క నెలలో మనం జిం లో చేరి సాధించగలిగేది ఏం లేదని నాకు నేను అనుకుని జిం గురించి ఆలోచించడం మానేసి, తిరిగి, చూసి, చుట్టెయ్యాల్సిన ప్లేసుల గురించి రీసెర్చ్ చెయ్యడం మొదలెట్టా.

ఇప్పుడు చూస్తే ఒకరోజు లావు పెరిగాననిపిస్తుంది. ఒకరోజు బరువు తగ్గాననిపిస్తుంది. మొన్న వెయిట్ చూసుకుంటే 4 కిలోలు తగ్గానని చెప్పింది. నిన్న పాంట్ వేసుకుంటే ఇదివరకట్లో బాగుందనిపించింది ఇప్పుడు టైటయినట్టు అనిపించింది. ఇంత కంఫ్యూజన్ ఏంటో అర్థం కావట్లేదు. ఇంటికెళ్లాక బంధు మిత్ర సకుటుంబ సపరివారమంతా ఏమంటారో చూస్తే అప్పుడు కానీ అర్థం అయ్యేలా లేదు అసలు నా పరిస్థితి ఏంటో.

సరే, ఇక విషయానికి వస్తే, ఫారిన్ లో లైఫ్ అంటే ఏంటో అనుకుంటాం కానీ, బొత్తిగా నిస్సారమైన బతుకులాగుంది. వీక్‌డే లో బతుకు అంతా పొద్దున లేచి సద్ది సర్దుకుని స్నానం చేసి ఆఫీసుకెళ్లడం, పని చేస్తూ చేస్తూ మధ్యలో ఆ సద్ది లాగించేసి మళ్లీ పని చేసీ చేసీ ఇంటికి రావడం, ఇంత వండుకుతిని మళ్లీ పొద్దున్నే లేచి ఆఫీసుకెళ్లాలి అని తిట్టుకుంటూ నిద్ర పోవడం. అంటే వీకెండులో జీవితం ఏదో నక్క తోక తొక్కిందా అంటే అదీ లేదు. ఏదైన ప్లేసు చూడటానికి పోతే అక్కడ తిందామంటే పిజ్జాలు బర్గర్లు తప్ప ఇంకేమీ దొరకదు. వాటికి వీళ్ల పేర్లు కూడా వింతగా పెడతారు. మావాడు ఒకడు వచ్చిన కొత్తలో పెప్పరోనీ అంటే పెప్పర్ ఆండ్ ఆనియన్ మిక్ష్చర్ అనుకున్నాట్ట. రెండు మూడు సార్లు తిన్నాక ఎవడో చెప్పాడంటా అది బీఫ్ అని. దెబ్బకి వాడు బయటికి వెళ్తే మాంసం తీసుకోవడం మానేసాడు. ఎక్కడికెళ్లినా మీట్ లేకుండా మీదగ్గర ఏముంది అని అడగటం మొదలెట్టాడు.

బెంగళుర్‌లో వున్నప్పుడు ప్రతీ ఆదివారం రాత్రి పక్కనే వున్న తిరుమల థియేటర్ కి వెళ్లేవాన్ని. అక్కడ ఏ సినిమా ఆడితే అది చూసి వచ్చేవాళ్లం. ఇక్కడ ఒక సినిమ చూడాలంటే ఎక్కడికో వెళ్లాలి. అది కూడా ఎదన్నా రెండు మూడు షోలుంటే నచ్చిన టైములో వెళ్లే ఆప్షన్ లేకుండా రోజుకు ఒక్క షో వేసి మూసేస్తున్నారు(తెలుగు అయితే). థియేటర్‌లో స్క్రీను, సౌండ్ ఎఫెక్ట్సు మాత్రం మన తిరుమల లోనే చాలా బెటర్. అసలిదంతా ఎందుకొచ్చిందంటే, నిన్న బెంగళూర్‌లో వున్న ఒక ఫ్రెండుతో మాట్లాడుతూంటే అడిగాడు... ఇక్కడికీ, అక్కడికీ లైఫ్‌లో వున్న తేడా ఏంటి అని. ఆక్సిడెంటల్‌గా నా నోట్లోంచి ఒక అద్భుతమైన పోలిక వచ్చింది. అది అందరికీ చెబుదామని మొదలెట్టా.

ఇండియాలో ఇది బాలేదు, అది బాలేదు అది తిట్టుకుంటూ, ఫ్రీడం లేదని బాధ పడుతూనే మనకు నచ్చినట్టుగా వుంటాం. ఇక్కడైతే ఇన్‌ఫ్రాస్ట్రక్చరూ, ఫెసిలిటీసు అన్నీ బాగున్నాయని మెచ్చుకుంటూ, ఫ్రీడం వుందని చంకలు గుద్దుకుంటూ ఎవడో రాసిన రూలు బుక్సుని ఫాలో అవుతూ బతికేస్తున్నాం.

ఇక్కడ ఇంకో విషయమేమిటంటే ఇక్కడ మనకు నచ్చిన కొన్ని విషయాలు ఇక్కడివాళ్లకు నచ్చకపోవడం. టొరొంటోలో అండర్‌గ్రౌండ్ ట్రాన్సిట్ వుంది. మొదటిసారి చూసినప్పుడు అది నాకు చాలా బాగా అనిపించింది. ఎంత బాగా చేసారో కదా అని పక్కవానితో అన్నా కూడా. రెండు వారాల్లో ఇక్కడ మేయర్ ఎలక్షన్స్ వున్నాయి. ఆ ఎలక్షన్స్ గురించి పేపర్లల్లో వచ్చే ఆర్టికల్సు, ఇక్కడివాల్లతో డిస్కషన్సూ అన్నీ కలిపితే నాకు అర్థం అయ్యిందేమిటంటే మనం మన సిస్టం మీద ఎలా అసంతృప్తితో వున్నామో అలాగే వీళ్లు కూడా వీళ్ల సిస్టం మీద అసంతృప్తితో వున్నారు. సబ్‌వే సిస్టం లో వీళ్లకు లోపాలు కనిపిస్తున్నాయి. వాటిని క్లియర్ చేసేవానికి వోటేస్తారంట. ఈరోజు మధ్యాహ్నం ఒక ఫ్రెండ్ అడిగాడు... ఇక్కడికొచ్చిన రెండు నెలల్లో ఏమేమి తెలుసుకున్నావురా అని... నేను తెలుసుకున్నది మాత్రం ఒక్కటే. అది - పక్కింటి పుల్లకూరకి రుచెక్కువ. మనకి వీళ్లది నచ్చింది, వీళ్లకి ఇంకేవరిదో నచ్చింది, వాళ్లకి ఇంకొకరిది.

18 కామెంట్‌లు:

  1. ఇండియా జీవితానికీ, పాశ్చాత్య జీవితానికి వున్న తేడాను ఒకలా నేను పోలుస్తుంటాను. ఇండియాలో జీవితం ఫ్రీ బర్డ్ వంటిది - అంటే స్వేఛ్ఛ చాలా ఎక్కువకానీ ఎన్నో రకాలుగా భద్రత చాలా తక్కువ. పాశ్చాత్య దేశాల్లోని జీవితం బంగారు పంజరంలో వున్న పక్షిలాంటిది. కాలికేస్తే మెడకీ, మెడకేస్తే కాలికీ లాంటి ఎన్నో చట్టాలు, నిబంధనలు పాటిస్తూ చాలా రకాలుగా భద్రంగా వుంటాం.

    రిప్లయితొలగించండి
  2. భలే చెప్పారు మాష్టారు. మరి తొందరగా మారతహల్లి కి రండి. ఇక్కడ తిట్టుకుంటూ, కొట్టుకుంటూ దొరికిన బలుసాకు తినుకుంటూ బ్రతికేద్దురు.

    రిప్లయితొలగించండి
  3. @ శరత్: అన్నయ్య, అది కూడా కరెక్టే. కానీ, పక్షి దృష్టిలో అది పంజరమే కదా... బంగారమా, వెండా, ప్లాటినమా అన్నది దానికి అర్థం కాదు. నా బాధ కూడా అలాంటిదే. ఇక భద్రత అంటారా, దానికి ఫేట్ కూడా వుండాలి. గోకుల్ ఛాట్ అయినా, WTC అయినా, లక్కుంటే బతికేస్తాం, లేదంటే పోతాం.

    @ జగన్: మాష్టారు, వచ్చేస్తున్నా. కన్నడ రాజ్యోత్సవానికి బెంగళూరులో వుంటా. ఆఫీసులో లంచు టైములో కష్టాలుగానీ, లేదంటే బెంగళురులో బలసాకు తినాల్సిన ఖర్మ తెలుగువాడికేమి పట్టింది చెప్పండి. మారతహళ్లినే తీసుకోండి. మెయిన్ రోడ్డు మీద భారతిలో ఫుల్ మీల్సు మన స్టైలే. తులసి సందులోకి పోతే మావూరి టేస్టుతో బోలెడన్ని బిర్యాని సెంటర్లు.

    రిప్లయితొలగించండి
  4. హ్మ్..ఈ కష్టాలనే మన వాళ్ళు స్వర్గం కింద ఊహించేసుకుని...M.S అది ఇది అంటూ ఇక్కడికొస్తారు...వచ్చాక తెలుస్తాయి అసలు సంగతులు.మళ్ళి ఎవరికన్నా చెప్పుకుంటే అలుసైపోతారని చెప్పుకోరు.అమెరికా కేక,కత్తి అని చెప్పి ఇంకో బలిపసువుకి ఆశ కలిగిస్తారు..

    రిప్లయితొలగించండి
  5. భద్రత అని నేను వాడిన పదంలో నేను ఆశించిన అర్ధం రావడం లేదు. భద్రత బదులుగా జీవన ప్రమాణాలు అని చదవగలరు. జీవన ప్రమాణాల కిందికి భద్రత కూడా వస్తుంది.

    రిప్లయితొలగించండి
  6. నేను రాద్దామనుకున్న మాటే శరత్ గారు రాసేసారు. మీరన్నట్లు లక్కుండాలి కాదనను కానీ బయటకి వెళ్తే ఎక్కడ ఎవడు వచ్చి గుద్దెస్తాడో అన్న భయం ఉండదు.

    అసంత్రుప్తి అంటారా అది లేని మనిషి ఎవడుంటాడు చెప్పండి. మే బీ మీరు విజిటర్ గా వచ్చినందు వల్ల విదేశీ జీవన శైలిని యాక్సెప్ట్ చేసి ఆస్వాదించట్లెదేమో అనిపిస్తోంది.

    హ్యాపీ జర్నీ టూ ఇండియా

    రిప్లయితొలగించండి
  7. మావాడు ఒకడు వచ్చిన కొత్తలో పెప్పరోనీ అంటే పెప్పర్ ఆండ్ ఆనియన్ మిక్ష్చర్ అనుకున్నాట్ట.
    -------
    మీవాడు చాలా లాజికల్. మూడు నెలలలో కొత్త దేశానికి, కొత్త పరిస్తుతులకీ అలవాటు పడటం చాలా కష్టం.పోస్ట్ బాగుంది.

    రిప్లయితొలగించండి
  8. @ ఇందు గారు: అది నిజమండి. కానీ, వచ్చినవాళ్లని బలిపశువులని కూడా అనలేము లెండి, ఆర్థికంగా ఎదుగుతారు కాబట్టి.
    @ శరత్ అన్నయ్య: అయితే ఓకే (కొండవలస స్టైల్లో). జీవన ప్రమాణాల్లో మనం వీళ్లని చేరాలంటే చాలా టైం పడుతుంది.
    @ Rishi గారు: Thanks for the comment. నిజం చెప్పాలంటే నేను యాక్సెప్ట్ కానీ, రిజెక్ట్ కానీ చేసేంతగా ఇక్కడి లైఫ్‌లో ఇన్వాల్వ్ కాలేదు. నేను ఇక్కడికి రాకముందే వెనక్కి వెళ్లే డేట్ తెలవడం కూడా అందుకు రీజన్ కావచ్చు. ఆస్వాదించడంలో మాత్రం వెనుకపడలేదు. ఇక్కడ వున్న ఈ రెండున్నర నెల్లు నేను బాగా ఎంజాయ్ చేసాను. అయినా కూడా లైఫ్ ఎందుకో నిస్సారంగా అనిపించింది. అదే ఈ పోస్ట్ లో చెప్పాలనుకున్నా. ఆ కంఫ్యూజన్ తోనే ఈ పోస్టుకి సరైన ఎండింగ్ కానీ, ఒక కంక్లూజన్ కానీ ఇవ్వలేకపోయా.
    @ లక్కరాజు గారు: థాంక్సండి.

    రిప్లయితొలగించండి
  9. నిస్సారం, నిస్సారం అంటూ మూలుగుతూనే ఒళ్ళు పెంచానంటున్నారు. మీది పురిటి వైరాగ్యం, అవకాశమొస్తే అక్కడే సెటిల్ అయిపోతారు, అది దొరక్కనే ఈ నిస్పృహ. పర్మనెంట్ రెసిడెంట్ గా అప్లై చేసుకోండి, అంతా సర్దుకుంటుంది.

    పెప్పరోని అంటే మిరియాల కషాయమూ, బీఫూ కాదు, పంది మాంసం.

    రిప్లయితొలగించండి
  10. నరేష్ గారు టొరాంటో జీవితంతో మరీ అంత విరక్తి చెందారనుకోను. ఈ టపా సరదాకి, పిల్లాటకి రాసినట్టుగానే నాకనిపిస్తోంది.

    రిప్లయితొలగించండి
  11. @ అజ్ఞాత: ఒళ్లు పెరగడానికీ, లైఫ్ బోరు కొడుతోందనడానికీ లింక్ నాకు అర్థం కాలేదు. ఇక్కడ సెటిల్ అయ్యే వుద్దేశం కాని, PR కి అప్ప్లై చేసే ఆలోచన కానీ నాకు లేదు. నిజంగానే సెటిల్ అవ్వాలనుకుంటే నా కాలేజ్ సీనియర్స్ ని ఫాల్లో అయి MS కొసం ఇక్కడికే వచ్చేవాడిని (నా కాలేజ్ సీనియర్స్ చాలామంది టొరొంటోలోనే MS చేసారు). ఇంత కాలం ఆగేవాడినే కాదు. నేను నిస్పృహలో వున్నాననుకుంటే అది మీ పొరపాటు. Infact, I am waiting to fly back at the earliest.

    పెప్పారోని అంటే పంది అని చెప్పినందుకు చాలా థాంక్స్. లేదంటే ఇంకా అది బీఫ్ అనే నమ్ముతూ వుండేవాన్ని.

    రిప్లయితొలగించండి
  12. @కొత్త పాళీ గారు: థాంక్సండీ. నన్ను అర్థం చేసుకున్నారు. నిజానికి నేను విరక్తి చెందలేదు. మండే టు ఫ్రైడే లైఫ్ ఇండియాలోనే బాగుండేది అని అనిపించిన క్షణంలో ఇక్కడి కొందరు ఫ్రెండ్సు ఎక్స్‌పీరియెన్సులూ, ఇండియాలో వున్న ఫ్రెండ్సుతో మాట్లాడేటప్పుడు వచ్చిన డిస్కషన్లతో నాకు అనిపించింది రాసాను. ఇది ఆ క్షణంలో గుర్తొచ్చిన సీక్వెన్సులో రాస్తూపోయానే కానీ మెదడు పెట్టి ఆలోచించలేదు.

    నేను వీకెండ్సులో మాత్రం టూరిజం మీద బిజీగా వుండటంవల్ల బాగా ఎంజాయ్ చేస్తున్నా.

    రిప్లయితొలగించండి
  13. Visit Naigara, Wal-Morin Temple in woods on Laval Hy wy. Canada is a beutiful country to stay than the US. One should enjoy fall colours in Canada. Ottawa is a nice city. Parliament & surrounds look so gorgeous. Tulips festival in Spring is so good along the river banks in Ottawa.

    రిప్లయితొలగించండి
  14. everyone starts like this in a new country. stay for more than 2 years and come back. then i would really like to see ur opinion :-)

    రిప్లయితొలగించండి
  15. లోకో భిన్న రుచి... అన్నారు...మీదో యాంగిల్ అనిపిస్తూంది...any way థాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ ఫీలింగ్స్..చాలా చక్కగా చెప్పారు...

    రిప్లయితొలగించండి
  16. @budugoy: ఎన్ని సంవత్సరాలున్నా జీవన ప్రమాణాలు మారొచ్చు గానీ, తీపి జ్ఞాపకాలు, అభిరుచులు మారవు కదండీ. పాతికేళ్లుగా అయిదువేల్లు నొట్లో కి పంపి పిడికెడన్నానికి అలవాటు పడ్డ ప్రాణం రెండేళ్లలో పిజ్జా తిని కడుపు నింపుకోవడానికి సహకరిస్తుందా....? ఇప్పటికైనా రాత్రి ఇంటికి వెళ్లాక అన్నం తింటామనే ఆలోచనతోనే కానీ పిజ్జా బర్గర్ల మీద వారం బతకమంటే నా వల్ల కాదు.

    @kvsv: Thanks

    రిప్లయితొలగించండి