19 ఏప్రిల్, 2010

మోడీ-థరూర్: ఏది నిజం?

ఇక్కడికి నేనేదో భీభత్సమైన అనలిస్టుని అనుకుంటే మీరు రమ్ములో కక్కేసినట్టే. నేను అనలిస్టుని కాదు కదా, కనీసం ఒక పిల్ల జర్నలిస్టుని కూడా కాదు. నేను అనుకున్నదే నిజం అనుకునే అమాయక చక్రవర్తిని కాబట్టి, టైటిల్ జస్టిఫై అవుతుందని ఆ టైటిల్ పెట్టానంతే. ఇక విషయానికి వద్దాం.

అనగనగా, మోడీ అనే పెద్దమనిషి ఒక పెద్ద ఆటల పండుగని డిసైన్ చేసి, మార్కెట్ చేసి, టీములని అమ్మేసి, కొన్ని వేలకోట్ల వ్యాపారాన్ని తయారుచేసాడు. మొదాటి ఏడాది అంతా బాగానే జరిగింది. రెండో ఏడాది వచ్చేసరికి ఆసేతుహిమాచలంలో ఎన్నికలొచ్చి, ఆటలపండుగని వేరే దేశానికి, ఆ మాటకొస్తే వేరే ఖండానికి మార్చారు. అక్కడ కూడా పండగ బాగానే సాగింది. అయితే పండగ ఇంటికి దూరంగా చేసుకుంటున్నాం కదా అని సదరు మోడీగారు కాస్త ఎక్కువగానే పండగ చేసుకున్నారు. అప్పటివరకు సదరు పెద్దమనిషిని ఒక వ్యాపారవేత్త అనే అనుకున్న సామాన్యజనం ఈ పెద్దమనిషిలోని రసికుడిని కూడా గుర్తించారు. అదే సమయంలో పండగ జరుగుతున్న ఖండంలో పండగకు డిమాండు పెంచడానికి రకరకాల పోటీలు పెట్టారు. అందులో ఒక పోటీలో అందమైన ఒక లోకల్ మోడెల్‌ని సెలెక్ట్ చేసి ఆమెని ఇండియాకి రమ్మన్నారు. ఆ టైంలో సదరు మోడెల్‌కి చాలా కాంట్రాక్టులు దక్కాయని అప్పట్లో వినికిడి. నిజం పెరుమాల్లకెరుక.

సదరు మోడీగారు, ఈ పండగలో వున్న సమయంలో అఖండభారతావని తన పాలకులను ఎన్నుకునే అత్యంత ఖరీదైన భారీ ప్రక్రియను ముగించింది. ఈ ప్రక్రియలో అంతవరకు ఐక్యరాజ్యసమితిలో పనిచేసి, ఒక పర్యాయం ఐక్యరాజ్యసమితి అధ్యక్షునిగా పదవి వెలగబెడదామనుకుని, సాటి ఆసియా ఖండపువాని చేతిలో ఓడి ఇంటిదారి పట్టిన థరూర్ అనే మరో పెద్దమనిషి ఇంటికి రాగానే, ఉజ్యోగం మానేసి, రాజకీయాల్లోకి దిగి, అంతర్జాతీయ దౌత్యంపై తనకున్న అనుభవాన్ని చూపి ఒక సీటు కొట్టేసాడు. దేశవ్యాప్తంగా ఆపార్టీకి వచ్చిన స్పందనలో కలిసిపోయి జాతీయ దిగువసభలో సభ్యుడు కూడా అయిపోయ్యాడు. ఎలాగూ ఎన్నికల్లో గెలిచాడు కదా, అంతర్జాతీయ దౌత్యంలో ఉన్న అనుభవాన్ని వాడుకుందాం అని ఆశించిన ప్రభుత్వపెద్దలు ఇతనికి విదేశీ వ్యవహారాల శాఖలో ఒక సహాయపదవిని ఇచ్చి సరిపెట్టేసారు. ఈ పెద్దమనిషి అంతర్జాతీయ సమితిలో ఏమి దౌత్యం వెలగబెట్టాడో తెలీదు కానీ, ఈయన మంత్రి అయినదగ్గర్నించీ ప్రభుత్వానికి ఏదో ఒక తలనొప్పి క్రమంతప్పకుండా తేవడం మొదలుపెట్టాడు.

సదరు మోడీగారు ఎన్నుకుని రమ్మన్న సుందరి భారతగడ్డపై కాలుమోపింది. ఆ విషయం చాలా మీడియా హౌసులు ప్రచారం చేసాయి. కానీ, ఆ తర్వాత ఆ సుందరి విషయం పక్కన పెట్టేసాయి. తెలియవచ్చిన విషయం ఏమిటంటే, సదరు సుందరి చాలాకాలం (అంటే ఎంతకాలమో నాకు కూడా తెలియదు, కాని వీసా గడువు ముగిసేంతవరకు) ఇక్కడే వుంది. ఎక్కడ వుందో, ఎలా వుందో విజ్ఞ్యులకు నేను చెప్పాల్సిన పనిలేదు. వీసా గడువు ముగిసేముందు, సదరు మోడీగారు ఆ అమ్మణ్ని మరికొంత కాలం ఇక్కడే అట్టిపెట్టుకోడానికి వీసా పొడిగించుకోవాలని అనుకున్నారు. అనుక్కున్నదే తడవుగా ఢిల్లీలో వున్న సదరు మంత్రిత్వశాఖ వారిని కలుద్దామని వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లాక చూస్తే వున్నది థరూర్ అనే పెద్దమనిషి. ప్రభుత్వంలో సభ్యుడైన ఆయనకి, ప్రైవేటు వ్యాపారి అయిన ఈయన ఒక వినతిపత్రం సమర్పించి పని చేసి పెట్టమన్నాడంట. దానికి ఆ మంత్రివర్యులు అభయహస్తం ఇచ్చి పంపారు. మంత్రిగారి ఆశీర్వాదం దొరికింది కదా అని ప్రశంతంగా వున్న మోడీగారికి ఒక పెద్ద షాక్ తగిలింది. అది సుందరమోడల్‌కి వీసా దొరకలేదు అని. ఇద్దరికీ ఇక్కడే చెడింది అని ఇప్పట్లో వినవస్తోంది.

చెడితే చెడింది. ఏదో ప్రపంచానికి తెలీని మ్యాటర్‌లో కొట్టుకుంటే ఏ గొడవా వుండేది కాదు. కానీ, చివరొకొచ్చి ఇద్దరూ ప్రపంచమంతా పేరు తెచ్చుకున్న ఆటల పండగ మీద గొడవ పెట్టుకున్నారు. ఎనిమిది కంపనీలతో మొదలైన ఆటల పండుగను పది కంపనీలకి పెంచి సంపాదన పెంచుకుందామనుకున్నాడు మన మోడీ. ఏదైనా ఒక్క కంపనీలోనైనా వాటా పెట్టుకోవాలనుకున్నాడు మన థరూర్. అనుకున్నదే తడవుగా సొంత రాష్ట్రంలో పెడుతున్న టీముని కొందామనుకున్న ఒక కన్సార్టియంతో మాటలు కలిపాడు. మనోడి రాజకీయ ప్రోద్బలం దక్కుతుందన్న ఆశతో కొన్ని కోట్ల వాటా అప్పనంగా ఇవ్వడానికి వాల్లు కూడా ముందుకొచ్చారు. (కేవలం రాజకీయ లబ్ది కోసమేనో లేక ఇంకా ఎవైనా డీల్సు వున్నాయొ తెలీదు మరి). అది కూడా డైరెక్టుగా తీసుకుంటే కాషాయ పార్టీ, ఎర్రపార్టీలు గొడవ చేస్తాయని అనుకున్నాడో ఏమో గానీ, ఎక్కడో ప్రశంతంగా బతుకుతున్న గర్లుఫ్రెండుని తీసుకొచ్చి, తన పేరుమీద వాటా ఇప్పించుకొని ఈరొంపిలోకి లాగేసాడు. ఇక్కడ తప్పు ఒకరకంగా చెప్పాలంటే మోడీదే. రాజకీయనాయకుడికి తెలిసినట్టుగా ప్రతీకారం తీర్చుకోవడం వ్యాపారికి తెలీలేదు. ఎలాగైనా థరూర్ పరువు తీయాలి ఆలోచనతో కొచ్చి టీం గురించి పబ్లిక్‌గా బయటపెట్టి సొంత కొంప కూడా కూల్చుకున్నాడు.

మొత్తంగా ఈ వ్యవహారం నుంచి రాజకీయనాయకులు, బిసినెస్‌మాన్‌లు నేర్చుకోవాల్సిన నీతి ఒకటి వుంది. రాజకీయం చేసేవాడికి వ్యాపరం చేసేవాడి తోడు వుండాలి. వ్యాపారం చేసేవాడికి రాజకీయనాయకుడి అండ వుండాలి. అప్పుడే ఇద్దరు కలిసి దేశాన్ని దోచేయగలుగుతారు. వాళ్లిద్దరూ కొట్టుకుంటే ఇద్దరూ రచ్చకెక్కి పరువు పోగొట్టుకోవడం తప్పించి వచ్చే లాభం మాత్రం నిండుసున్నా.

2 కామెంట్‌లు:

  1. మంచి అనాలిసిస్.

    రమ్ము వాసన్ గుప్పుమని కొడుతుంది.

    రిప్లయితొలగించండి
  2. శ్రీ గారు, ఎంతైనా ఒకప్పటి రమ్ము ప్రేమికున్ని కదా, ఆమాత్రం వాసన రాకపోతే కష్టం.

    రిప్లయితొలగించండి